ముంబై, జూలై 28,
దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. కుంభవృష్టి కారణంగా అనేక ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. భారీ వర్షాల కారణంగా రాజస్థాన్‌లో వరదలతో నదులు, వాగులు, కాల్వలు పొంగిపోర్లుతున్నాయి. నీటిమట్టం పెరగడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరాలు, రైల్వేస్టేషన్లలోకి వరద నీరు భారీగా చేరి వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు బయటపడ్డాయి.జోధ్‌పూర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోటెత్తిన వరదల కారణంగా వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వరదల్లో కార్లు, బైకులు, గ్యాస్ సిలిండర్లు సైతం కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జోధ్‌పూర్‌లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జోధ్‌పూర్ జిల్లా కలెక్టర్ మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నగరంలో నీటిమట్టం పెరగడంతో జోధ్‌పూర్‌లోని రైల్వేస్టేషన్ కూడా జలమయమైన దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.కుండపోత వర్షాలు, వరదల కారణంగా రాజస్థాన్‌లో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. వర్షాల కారణంగా చాలా నష్టం జరిగిందని స్పష్టం చేశారు. మరోవైపు రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. జోధ్‌పూర్, కోటా, అజ్మీర్, ఉదయ్‌పూర్ డివిజన్‌లలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.భారత వాతావరణ శాఖ ప్రకారం, ఉదయం 8.30 గంటలకు ముగిసిన 24 గంటల్లో అజ్మీర్ రాష్ట్రంలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. టోంక్‌లోని అలీఘర్‌లో 7 సెం.మీ, భిల్వారాలోని అసింద్‌లో 6 సెం.మీ, ప్రతాప్‌గఢ్‌లో 5 సెం.మీ, కరౌలీలోని సపోత్ర మరియు జైపూర్‌లోని బస్సీలలో ఒక్కొక్కటి 4 సెం.మీ వర్షపాతం నమోదైంది.