న్యూఢిల్లీ, జూలై 28,
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీల ఆశలకు కేంద్ర ప్రభుత్వం గడి కొట్టింది. 2026 వరకు సీట్ల సంఖ్యలను పెంచలేమని పార్లమెంట్ లో కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అడిగిన ప్రశ్నకు బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు లేనట్లేనని, నియోజకవర్గాల సంఖ్యను పెంచాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక వేళ ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సంఖ్యను పెంచాలంటే రాజ్యంగ సవరణ అవసరం అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు అంశం ఉందని దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై తెలుగు రాష్ట్రాల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. విభజన చట్టం 2014లోని సెక్షన్ 26(1) రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 15కి పక్షపాతం లేకుండా శాసనసభ సీట్ల సంఖ్య కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెంచాలని సూచిస్తున్నాయి. తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 153కి, ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలను 225కు పెంచాలని చట్టంలో పొందుపరిచారు. అయితే రాజ్యంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించే వరకు రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యను తిరిగి సర్దుబాటు చేయరాదని మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. విభజన చట్టం ప్రకారం సీట్ల సర్దుబాటు చేయాలంటే దానికోసం రాజ్యంగంలోని ఆర్టికల్ 170ని సవరించాల్సి ఉంటుందని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.అసెంబ్లీ స్థానాల పెంపుపై తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు గంపెడు ఆశలు పట్టుకున్నాయి. గతంలో ఈ విషయంలో చంద్రబాబు కొంత ప్రయత్నం చేసినా.. సక్సెస్ రాలేదు. ఆ తర్వాత ఈ అంశంపై కేసీఆర్ ప్రయత్నాలు చేసినా.. ముందుకు సాగలేదు. తాజాగా కశ్మీర్ లో సీట్ల పెంపుతో తెలంగాణలో కూడా నియోజకవర్గాల సంఖ్య పెంచాలంటూ కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారనే టాక్ వినిపించింది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగితే ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి వచ్చే వారికి టికెట్ల సర్దుబాటు విషయంలో కొంత ఊపిరి పీల్చుకోవచ్చనేది రాజకీయ పార్టీల ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెద్దదిగా ఉండాలని పార్టీలు కోరుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలో ఆశలకు గండికొడుతూ అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో లేదని మరోసారి స్పష్టం చేయడం హాట్ టాపిక్ అయింది. మరి కశ్మీర్ విషయంలో సీట్ల సంఖ్యను పెంచిన కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల విషయంలో నిబంధనల పేరుతో అడ్డు చెప్పడంపై కేసీఆర్, జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి