తిరుపతి, జూలై 29,
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబుతో పాటు ఆయన కుమార్తె మంచు లక్ష్మీ ఇటీవల సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో దాదాపు రెండు గంటల పాటు వీరు భేటీ అయ్యారు. ఈ భేటీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఈ భేటీపై మీడియాలో పలు కథకాలు వెల్లువెత్తయాయి. చిత్తూరు జిల్లాలో మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యా నికేతన్‌లో సాయిబాబ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి చంద్రబాబును మోహన్ బాబు ఆహ్వానించారంటూ టీడీపీ వర్గాలు ఈ భేటీ వెనుక అసలు కారణాన్ని క్లియర్ కట్ గా చెప్పేశాయి. కేవలం ఆహ్వానించడానికి వెళ్లి రెండు గంటల సేపు ఎందుకు సమావేశమయ్యారు? ఈ రెండు గంటల భేటీలో వీరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటి? అన్న ప్రశ్నలకు ఎవరికి తోచిన విధంగా వారు సమాధానాలు ఇచ్చుకుంటున్నారు. వీరి మధ్య ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు.. టాలీవుడ్‌లో చోటు చేసుకున్న పరిణామాలు.. ఆగస్ట్ 1 నుంచి సినిమా షూటింగ్‌ల బంద్.. తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు పోలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా చంద్రబాబుకు మోహన్ బాబు వివరించినట్లు తెలుస్తోంది. అదీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు చంద్రబాబుకు మోహన్ బాబు చెప్పినట్లు సమాచారం. మంచు ఫ్యామిలీ నుంచి చిన్న కుమారుడు లేదా కుమార్తె మంచు లక్ష్మీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు... కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీకి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజల్లో మంచి పేరే ఉంది. దీంతో జిల్లాలో సైకిల్ పార్టీకి మంచు ఫ్యామిలీ మద్దతు లభించినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీ తరువాత మోహన్ బాబు కుటుంబం నుంచి మంచు లక్ష్మి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది