విజయవాడ, ఆగస్టు 1 ,
తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు స్థానానికి అభ్యర్థి దొరికేశాడు. ఆయన రాజకీయాలకు కొత్తేమీ కాకపోయినా ఆ వాసనలు మాత్రం ఉన్నాయి. బలమైన సామాజికవర్గంతో పాటు ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయన పేరును దాదాపు ఖరారు చేశారంటున్నారు. ప్రస్తుత విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఆయన సోదరుడిని ఎంపిక చేసినా రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఖచ్చితంగా గెలిచే స్థానం. అందుకే ఈసారి పోటీకి ఆయనను పార్లమెంటు సభ్యుడిగా దింపాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. కేశినేని నాని రెండు దఫాలు టీడీపీ నుంచి విజయం సాధించారు. వరస విజయాలు వెనక ఆయన కన్నా పార్టీకున్న ఓటు బ్యాంకే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వ్యాపారాలన్నీ మూసివేసుకున్న తర్వాత కేశినేని నాని ఫక్తు రాజకీయ నేతగా మారారు గతంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, గద్దె రామ్మోహన్ లాంటి వంటి వారు ఉన్నా కృష్ణా జిల్లాలో ఎలాంటి రాజకీయ ఇబ్బందులు తలెత్తలేదు. వారు అందరినీ కలుపుకుని పోయేవారు. కానీ కేశినేని నానిని దాదాపు ఎక్కువ మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన వల్ల అనేక శాసనసభ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గ్రూపులుగా తయారైంది. దీంతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కేశినేని నానిని తప్పించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే నానిని అసహనానికి గురయ్యేటట్లు చేశారు. పార్టీ నాయకత్వం అందులో సక్సెస్ అయిందనే చెప్పాలి. కేశినేని నాని స్వచ్ఛందంగా తప్పుకుంటే విజయవాడలో పార్లమెంటు అభ్యర్థులకు కొదవ లేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు పోటీ పడతారు. గెలిచే సీటు కావడంతో సహజంగానే ముందుకు వస్తారు. అయితే ఈసారి ఎవరికీ ఇబ్బందిలేని నేతను ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పెద్దగా పార్లమెంటు నియోజకవర్గాన్ని పట్టించుకోక పోయినా పరవాలేదు కాని, ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే ఉండకూడదన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే సినీ నిర్మాత చలసాని అశ్వనిదత్ పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలిసింది. 2004లో అశ్వినీదత్ విజయవాడ పార్లమెంటులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్ గా లేకపోయినా టీడీపీకి బలమైన సానుభూతిపరుడు. సామాజికవర్గం కూడా కలసి వస్తుంది. అదే సమయంలో ఆర్థికంగా ఏడు నియోజకవర్గాల అభ్యర్థులను ఆదుకునే సత్తా ఉన్న వ్యక్తి. అందుకే ఇటీవల అశ్వినీదత్ వైసీపీ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారంటున్నారు. సినీ పరిశ్రమలో ఉండి రెండేళ్లకు ముందే అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారంటే దత్తుగారికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. మొత్తం మీద బెజవాడ ఎంపీ అభ్యర్థిగా అశ్వినీదత్ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.