ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న పెట్రోలు, డీజెల్ ధరలను తగ్గించే దిశగా కేంద్రం యోచిస్తుంది. ప్రభుత్వం పెట్రోలుపై విధించిన సుంకాలను తగ్గించే ప్రణాళికలు వేస్తున్నట్టు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న ఫలితంగానే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలు పెంచక తప్పడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.పెరుగుతున్న పెట్రోలు, డీజెల్ ధరలను నిశితంగా గమనిస్తున్నామని, ప్రజలపై భారం పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విషయంలో అతి త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని అన్నారు. ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియమ్ ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్) తీసుకున్న నిర్ణయాల కారణంగానే చమురు ఉత్పత్తి తగ్గిందని, అందువల్లే ధరల భారం ప్రజలపై పడిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇరాన్ పై అమెరికా ఆంక్షలు కూడా క్రూడాయిల్ మార్కెట్ పై ఒత్తిడిని పెంచుతున్నాయని ఆయన అన్నారు.కాగా, కర్ణాటక ఎన్నికలకు ముందు 19 రోజుల పాటు పెట్రో ఉత్పత్తుల ధరలను సవరించని చమురు సంస్థలు, ఆపై ఒక్కసారిగా ధరలను పెంచుతూ రాగా, భారత చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి ధరలు చేరుకున్న సంగతి తెలిసిందే.