నెల్లూరు, ఆగస్టు 1,
కయ్యాలు.. కవ్వింపులు. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ప్రస్తుతం ఇదే సీన్. ఒకరేమో డిప్యూటీ సీఎం.. ఇంకొకరేమో ప్రభుత్వ సలహాదారు. ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది యవ్వారం. మొన్నటి వరకు కేడర్ తిట్టుకుంటే.. ఇప్పుడు ముఖ్య నేతల వంతు వచ్చింది.ఈయన నారాయణస్వామి. ఏపీ డిప్యూటీ సీఎం. ఈయనేమో.. ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారు, మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి. ఇద్దరూ అధికార వైసీపీ నాయకులే. కానీ ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఛాన్స్ దొరికితే కయ్‌మంటున్నారు. నోటికి పనిచెప్పడంలో తగ్గేదే లేదన్నట్టుగా ఉంటున్నాయి వాళ్ల మధ్య విమర్శల బాణాలు. అప్పట్లో విభేదాలను తేలికగా తీసుకున్నా.. ఇటీవల అవి శ్రుతిమించినట్టు చెబుతున్నారు.నారాయణస్వామి గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పెద్దగా చర్చల్లో లేరు. డిప్యూటీ సీఎం అయ్యాక మాత్రం తరచూ వార్తల్లో ఉంటున్నారు. ప్రజల అటెన్షన్ కోరుకుంటున్నారో ఏమో.. నారాయణ స్వామి ఏదో విధంగా వివాదాల్లోకి వస్తున్నారు కూడా. చిత్తూరు జిల్లాలో గ్రూపు పాలిటిక్స్ డోస్ ఎక్కువే అయినా.. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అవి తారాస్థాయికి చేరాయి. గంగాధర నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్‌ఆర్ పురం, కార్వేటి నగరం మండలాల్లో తెల్లారి లేస్తే చాలు వైసీపీలో గ్రూపు రాజకీయాలు సెగలు రేపుతున్నాయి.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమలంలో భాగంగా జనాల్లోకి నారాయణ స్వామి వెళ్తున్నా.. స్థానిక వైసీపీ నేతలు ఆయనకు సహకరించడం లేదట. దాంతో తూతూ మంత్రంగా పని కానిచ్చేస్తున్నారు. కొన్ని మండలాల్లో అయితే నేతల మధ్య వాగ్యుద్ధం సాధారణమైపోయింది. జనాల సంగతేమోకానీ.. సొంత పార్టీ నాయకులనే డిప్యూటీ సీఎంను నడిరోడ్డుపై నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్గానికి.. ప్రభుత్వ NRI సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి వర్గానికి మొదటి నుంచి పడటం లేదు. ఆ విభేదాలు క్షేత్రస్థాయిలో ఏదో ఒక రూపంలో బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా మండల కమిటీ అధ్యక్షుల నియామకంతో ముఖ్య నేతలే తిట్టుకుంటున్న పరిస్థితి ఉంది. పెనుమూరు మండల వైసీపీ అధ్యక్షుడిగా విజయకుమార్‌రెడ్డిని నియమించారు. ఇది జ్ఞానేంద్రరెడ్డి సొంత మండలం. తన సమీప బంధువు సురేష్‌రెడ్డికి పార్టీ పదవి ఇప్పించుకోవాలని చూశారట. ఆ ప్రయత్నాలకు నారాయణస్వామి చెక్ పెట్టినట్టు టాక్.రెండు వర్గాలు ప్రస్తుతం కత్తులు దూసుకుంటున్నాయి. జ్ఞానేంద్రరెడ్డి వర్గానికి చెందిన దేవరాజులరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుచరుడు AMC మాజీ ఛైర్మన్ కండిగ మధురెడ్డిల మధ్య తిట్లు ఓ రేంజ్‌లో సాగాయి. ఆ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రధాన నేతల మధ్య నెలకొన్న విభేదాల తీవ్రత అందరికీ తెలిసింది. మండల కమిటీలను మార్చే ప్రసక్తే లేదని నారాయణస్వామి చెబుతున్నారట. దానికి జ్ఞానేంద్రరెడ్డి గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈ పంచాయితీ జిల్లా వరకే ఆగుతుందో.. తాడేపల్లి వరకు వెళ్తుందో కానీ.. నేతల పట్టు చూస్తుంటే మాత్రం అగ్గి గట్టిగానే రాజుకుంటోంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.