చెన్నై, ఆగస్టు 1,
మిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అనంతరం అన్నాడీఎంకే పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. పార్టీలో నాయకత్వ పోరుతో అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి తమిళనాడు పర్యటనలో భాగంగా ఓపీఎస్ వర్గం ఏర్పాటు చేసిన హోర్డింగ్ చర్చనీయాంశంగా మారింది. ఈ హోర్డింగ్‌లో ప్రధాని మోడీ, అమిత్ షా ఫొటోలు ఉండటం రాజకీయంగా ఊహగానాలు మొదలయ్యాయి. పన్నీర్ సెల్వం త్వరలోనే కాషాయ గూటికి చేరే అవకాశాలున్నాయని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. ప్రధాని మోడీ 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెన్నై వస్తున్న నేపథ్యంలో పన్నీర్ సెల్వం వర్గం కాంచీపురంలో ఓ పెద్ద హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. ఆ హోర్డింగ్‌లో ఓ వైపు ప్రధాని మోడీ, మరోవైపు అమిత్ షా అభివాదం చేస్తున్న ఫొటోలు.. మధ్యలో ఓపీఎస్ ఫొటో ఉండటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా ఈ ఫొటోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఓపీఎస్ బీజేపీ లో చేరుతారని కొందరు పేర్కొంటుండగా.. మరికొందరు బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని పేర్కొంటున్నారు. బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకుని వారి ద్వారా పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకేలో కోల్పోయిన పరపతిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటున్నారు.అన్నాడీఎంకే పార్టీలో గత కొంతకాలంగా అంతర్గత పోరు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పోరులో పన్నీర్ సెల్వం పై.. ఎడప్పాడి పళనిస్వామి పై చేయి సాధించారు. ఇటీవల జరిగిన ఏఐఏడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికయ్యారు. ఆ తర్వాత అన్నాడీఎంకే కీలక నేతల పదవులను రద్దు చేయటంతో పాటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, ఆయన మద్దతుదారులను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. అయితే.. ఈ తీర్మానాన్ని ఓపీఎస్ ఖండించి.. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా పళనిస్వామిని, కేపీ మునుస్వామిని తానే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఓపీఎస్ ప్రకటించారు.దీనిపై పన్నీర్ సెల్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. జులై 11న జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో తనను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ ఓపీఎస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ నిర్ణయంపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. కానీ, ఇందులో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించి.. పన్నీర్ సెల్వం పిటిషన్లపై మూడు వారాల్లోగా తీర్పు వెలువరించాలని మద్రాసు హైకోర్టును ఆదేశించింది.