అనంతపురం, ఆగస్టు 24,
జీపు మీద జీన్స్ టీ షర్ట్‌తో.. కూలింగ్ గ్లాసులు పెట్టుకుని.. నాలుగు గుర్రాలను పట్టుకుని స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈయన ఎవరో కాదు.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఈ ఫొటోను చూపిస్తూ తిరుపతి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాంతో కేతిరెడ్డిని ఎందుకు జనసేనాని టార్గెట్ చేశారనే చర్చ జరుగుతోంది. ఫొటో వెనక కథ గురించి ఆసక్తిగా ఆరా తీస్తున్నారు కొందరు.ఇది చాలా పాత మ్యాటర్.. ఎమ్మెల్యే కేతిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. స్థానికంగా ఉన్న కొందరు విడుదలు చేసి ఫోటోలు ఇవి. ధర్మవరం చెరువుకు ఆనుకుని ఉన్న.. ఒక కొండ వద్ద ఎమ్మెల్యే భారీ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని.. ఆ స్థలాలను దళిత రైతుల నుంచి లాక్కున్నారని గతంలో కొందరు ఆరోపించారు. అక్కడే ఇంద్ర భవనాన్ని నిర్మించారనేది ఆరోపణ. కోట్లు విలువ చేసే కార్లు, గుర్రాలు, బోటింగ్‌లు ఏర్పాటు చేసుకున్నారని.. ఇన్ని షోకులకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలకు కేతిరెడ్డి గతంలో చాలాసార్లు వివరణ ఇచ్చారు. డాక్యుమెంట్సూ చూపించారు. అయినప్పటికీ వివాదాం అడపాదడపా రగులుతూనే ఉంది.కరోనా సమయంలో హార్స్ రైడింగ్ నేర్చుకునేందుకు గుర్రాలు తెప్పించుకున్నానని.. ఆ తరువాత తిరిగి ఇచ్చేశానన్నారు కేతిరెడ్డి. అలాగే బోటింగ్ ఒక్కటే ఉందని.. అది లక్షలు.. కోట్లు అని ప్రచారం చేయడంపై మండిపడ్డారు. ప్రస్తుతం ఈ అంశాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టేకప్ చేశారు. ధర్మవరానికి చెందిన జనసేన నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డి పార్టీలో యాక్టివ్. సేవ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో పర్యటించారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న మధుసూదన్ రెడ్డి రాయలసీమలో చేపట్టే కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఆయనే కేతిరెడ్డి గురించి పవన్ కల్యాణ్‌కు చెప్పినట్టు తెలుస్తోంది.కేతిరెడ్డి ఫోటో చూపిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలు.. దళిత గిరిజన భూములు కాజేసి.. ఇలా రాజసం అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. దీంతో రాష్ట్రంలో అందరి దృష్టి ఆ ఫోటో పై పడింది. ఒక ఎమ్మెల్యే గురించి ఫోటో పట్టుకుని మాట్లాడటం చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంపై కేతిరెడ్డి గతంలో ఇచ్చిన వివరణ పవన్ కల్యాణ్ గమనించారో లేదో అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆ వివరణ చూసి ఉన్నా.. విశ్వసించలేదోమో అని అనుకుంటున్నారట. ఇప్పుడు జనసేనానే కొత్తగా సమస్యను తిరగదోడటంతో కేతిరెడ్డి స్పందన ఏంటనేది ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఒక ఫొటో.. పాత అంశాన్ని సరికొత్తగా చర్చల్లోకి తీసుకొచ్చింది.