YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గడ్కరీ ఉద్వాసన తో మారుతున్న లెక్కలు

గడ్కరీ ఉద్వాసన తో మారుతున్న లెక్కలు

న్యూఢిల్లీ, ఆగస్టు 25, 
నితిన్ గడ్కరీ తిరుగుబావుటా ఎగురవేయనున్నారా? బీజేపీలో చీలిక అనివార్యమా? మోడీ, షా ద్వయం తీరు పట్ల పార్టీలో గూడుకట్టుకున్న అసమతి భగ్గుమంటుందా? ఈ ప్రశ్నలకు పరిశీలకులు ఔననే అంటున్నారు. నితిన్ గడ్కరీకి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలికిన తరువాత పార్టీలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. మోడీ, షా ద్వయం పార్టీలో ఎవరినీ సొంతంగా ఆలోచించడానికి కానీ, స్వతంత్రంగా పని చేయడానికి కానీ అవకాశం ఇవ్వడం లేదన్న అసంతృప్తి, అసమ్మతి పార్టీలో గూడు కట్టుకుని ఉన్నాయనీ, అయితే గడ్కరీకి పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించకపోవడంతో కేబినెట్ లో స్వతంత్రంగా పని చేసే ఏకైక మంత్రిగా, మోడీ విధానాలలోని లోపలను ఎత్తి చూపగలిగే ధైర్యం ఉన్న నాయకుడిగా పేరొందిన ఒకే ఒక్కడికి పొమ్మనకుండా పొగపెట్టేందుకు రంగం సిద్ధమైందని పార్టీ శ్రేణులకు సైతం అవగతమైంది.గడ్కరీ పార్టీలో బలమైన నేతగా, అత్యధికులకు ఇష్టమైన నాయకుడిగా ఎదిగారు. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలలో మోడీ నాయకత్వం పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల అసంతృప్తి బాగా వ్యక్తమైన సమయంలో మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధానిగా గడ్కరీ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు కూడా చెబుతారు. పైగా నితిన్ గడ్కరీ నాగపూర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన నేత. నీటికీ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వ్యక్తి. అటువంటి గడ్కరీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గించేయడమంటే.. పార్టీకి సిద్ధాంత పునాదిని వేసిన ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తిరస్కరించడమేగా పార్టీలోని పలువురు భావిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వం రెండూ మోడీ, షా ద్వయమే అన్నట్లగా పరిస్థితి మారిపోయింది. గతంలో కాంగ్రెస్ ను వ్యక్తిపూజ అంటే విమర్శలు గుప్పించిన బీజేపీలో ఇప్పుడు అదే పరిస్థితి ఉందని బీజేపీలోని ఒక వర్గం గట్టిగా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో గడ్కరీకి పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలకడంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి.గడ్కరీ తన అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేస్తే ఆయనతో గొంతు కలిపేందుకు పార్టీలో చాలా మంది సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికే ఖాళీ అయిపోయిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా గడ్కరీ నాయకత్వం కింద పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్నాయని అంటున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తీరు పట్ల మోడీ షా ద్వయం వ్యవహార తీరును గతంలో పలుమార్లు గడ్కరీ తప్పుపట్టిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా శివసేన విషయంలో మోడీ షా ద్వయం వ్యవహరించిన తీరును గడ్కరీ వ్యతిరేకించారని అంటున్నారు. రాజకీయాలంటే కేవలం అధికారం కోసం వెంపర్లాట మాత్రమే కాదని ఒకింత నిర్వేదంగా వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే.గడ్కరీ ఎవరు ఔనన్నా కాదన్నా బీజేపీలో కీలక నేత. నంబర్ గేమ్ లో ఉండరు కానీ, ఆయనను కాదనే వారు కానీ కాదని అనగలిగే వారు కానీ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ కు అత్యంత ఆప్తుడు. నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయనకు బోలెడంత పలుకుబడి కూడా ఉంది. గతంలో ఆర్ఎస్ఎస్ మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్నకు గడ్కరీ పేరే చెప్పింది. మోడీకి రీప్లేస్ మెంట్ ఎవరంటే ఎవరైనా గడ్కరీ పేరే చెబుతారు. అటువంటి గడ్కరీ రాజకీయాలపై వైరాగ్యం ప్రదర్శించారు.  ఎందుకొచ్చిన రాజకీయాలు? ఎవరి కోసం అంటూ వేదాంతం వల్లించారు. అదేదో స్వగతంలోనో.. సన్నిహితుల దగ్గర పిచ్చాపాటీ మాట్లాడుతూనో కాదు. ఒక సభలో. అదీ మాజీ పొలిటికల్ లీడర్ గిరీష్ గాంధీ సన్మాన సభలో. గడ్కరీ అంతటి వారు రాజకీయాలపై అంతటి వైరాగ్యం ప్రదర్శించడంతో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అధికార బీజేపీలో బలమైన నాయకుడు ఒక్క సారిగా రాజకీయం అంటేకేవలం అధికార దాహం, పదవీ వ్యామోహం అంటూ వ్యాఖ్యానించే సరికి ఒక్క సారిగా బీజేపీలో కలకలం రేగింది.గడ్కరీ అలా మాట్లాడడానికి కారణమేమిటన్న చర్చ మొదలైంది. రాజకీయం అంటే అధికార దాహం, పదవీ వ్యామోహం అన్న మాటలు ఆయన ఎవరిని టార్గెట్ చేసి అని ఉంటారా అన్న అనుమానాలు ఒక్క సారిగా బీజేపీలోనే కాదు అన్ని రాజకీయ పార్టీలలోనూ కలిగాయి.  సామాన్య జనం కూడా గడ్కరీ వ్యాఖ్యలు మర్మమేమిటన్న చర్చల్లో మునిగిపోయారు.  కేంద్రంలో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలో ఉన్న బీజేపీలో అత్యంత కీలక నాయకుడు ఏమిటీ రాజకీయం కేవలం అధికార వ్యామోహం అంటే ఉలిక్కిపడేవారు అందులోనే ఎక్కువగా ఉంటారు. సమాజి హితం, అభివృద్ధి దిశగా మార్పు, పురోగతి ఇవే రాజకీయాల లక్ష్యంగా ఉండాలని, గతంలో అలాగే ఉండేవని చెప్పిన గడ్కరి ఇప్పుడు రాజకీయాల అర్ధం పూర్తిగా మారిపోయిందన్నారు. రాజకీయాలంటే అధికారాన్ని అనుభవించడమే అన్నట్లు ప్రస్తుత పరిస్థితి తయారైందనీ, అందుకే తాను రాజకీయాలలో కొనసాగుతూ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ గడిపేయాలా సమాజం కోసం పని చేయాలా అన్న ఆలోచనలో ఉన్నానని చెప్పారు.ఈ వ్యాఖ్యల తరువాతే ఆయనకు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానం గల్లంతైంది. దీనిని బట్టే గడ్కరీ వ్యాఖ్యలు మోడీ, షా ద్వయం భుజాలు తడుముకునేలా చేశాయని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే పార్లమెంటరీ బోర్డులో స్థానం కోల్పియిన తరువాత కూడా గడ్కరీ తన అసమ్మతి గళాన్ని విప్పడం కొనసాగించారు. పార్టీ ఈ రోజు అధికారంలో ఉందంటే అందుకు వాజ్ పేయి, అద్వానీల కృషి, వేసిన పునాదే కారణమని అన్నారు. నాగపూర్ లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన బీజేపీ జాతీయ స్థాయిలో బలోపేతం కావడానికి వాజ్ పేయి, అద్వానీ వంటి వారే కారణమన్నారు. లోక్ సభలో కేవలం రెండు స్థానాలున్న బీజేపీ ఈ రోజు జాతీయ స్థాయిలో అత్యధిక రాష్ట్రాలలో అధికారం చేజిక్కంచుకోగలిగిందంటే అందుకు వారి కృషే కారణమనిపేర్కొన్నారు.వాజ్‌పేయి, అద్వానీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటివారితోపాటు కార్యకర్తల కృషి కారణంగానే నేడు మోదీ నాయకత్వంలో పార్టీ అధికారంలో ఉందని పేర్కొన్నారు.రాజకీయ నాయకులు ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తారని.. అయితే, దేశాన్ని, సమాజాన్ని నిర్మించాలనుకునే సమాజిక, ఆర్థిక సంస్కర్తలు దూరదృష్టితో ఆలోచిస్తారనీ, వారి విజన్  శతాబ్దం మేలు గురించి కూడా ఆలోచిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన   గతంలో ముంబైలో ఒక సదస్సులో వాజ్ పేయి చేసిన ప్రసంగాన్ని గుర్తించారు. ‘చీకటి ఏదో ఒక రోజున తొలగిపోతుంది, సూర్యుడు బయటకు వస్తాడు, కమలం వికసిస్తుందని వాజ్ పేయి అన్నారనీ, ఆ రోజు ఆ సదస్సులో తానూ ఉన్నాననీ గుర్తు చేసుకున్నారు. గడ్కరీ వ్యాఖ్యల వెనుక ప్రస్తుత పరిస్థితులు మారుతాయనీ త్వరలోనే మార్పు తప్పదన్న సంకేతం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఆ మార్పు తన నాయకత్వంలోనే మొదలౌతుందన్న సంకేతం కూడా గడ్కరీ మాటల వెనుక ఉందని అంటున్నారు రాత్రికి రాత్రి మహారాష్ట్రలో ప్రభుత్వం మారిపోవడం, నిన్నటి దాకా బీజేపీపై విమర్శలతో నిప్పులు చెరిగిన శివసేనలోని ఒక వర్గం బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని గడ్కరీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  రాష్ట్రాలలో అధికారం కోసం మోడీ సర్కార్ వేస్తున్న ఎత్తులు, పన్నుతున్నవ్యూహాలపై గడ్కరీ అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. గడ్కరీ రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యల టార్గెట్ నిస్సందేహంగా మోడీయే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా ఒక సారి గడ్కరీ.. నాయకుడనే వాడు విజయాలకే కాదు పరాజయాలకు కూడా బాధ్యత వహించాలని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు గడ్కరీ ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన వెంట నడవడానికి బీజేపీలోని ఒక బలమైన వర్గమే కాదు. గడ్కరీ మద్దతుగా నిలవడానికి పలు రాష్ట్రాలలో బీజేపీ యేతర పార్టీలూ సిద్ధంగా ఉన్నాయి.ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ గడ్కరీ నాయకత్వాన్ని గట్టిగా కోరుకుంటున్నాయి. ఇక మోడీని గట్టిగా వ్యతిరేకించే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలా చాలా మంది ముఖ్యమంత్రులు గడ్కరీ నాయకత్వంలో పార్టీలో చీలిక వస్తే కనుక గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సదా సిద్ధమన్న సంకేతాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే గడ్కరీ తన అసమ్మతి గళాన్ని మరింత గట్టిగా వినిపించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పార్టీలో మోడీషా ద్వయం ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా గడ్కరీతో గళం కలిపేందుకు, కలిసి అడుగు వేసేందుకు బీజేపీలోని ఒక వర్గం సిద్ధంగా ఉందనీ, ఆర్ఎస్ఎస్ కూడా గడ్కరీనే సమర్ధిస్తోందని అంటున్నారు. అదే జరిగితే గడ్కరీ నాయకత్వాన్ని సమర్ధించేందుకు ఎన్డీయే నుంచి వైదొలగిన భాగస్వామ్య పక్షాలే కాదు, ఇప్పటికీ కొనసాగుతున్న పార్టీలూ, బీజేపీని గట్టిగా వ్యతిరేకించే పార్టీలూ కూడా ముందుకు వస్తాయని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. మోడీ, షాలకు వ్యతిరేకంగా కమలం పార్టీలో తిరుగుబావుటా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు. ఆ తిరుగుబాటు గడ్కరీ నేతృత్వంలోనే మొదలౌతుందనీ అంటున్నారు.

Related Posts