న్యూఢిల్లీ ఆగష్టు 27
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే వంద రోజుల కన్నా తక్కువ కాలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవీ బాధ్యతలు చేపట్టిన వారి జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. ఇవాళ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ లలిత్ ఈ ఏడాది నవంబర్ 8వ తేదీ వరకు ఆ పదవిలో ఉండనున్నారు. అంటే ఆయన 74 రోజుల పాటు సీజేగా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. 100 రోజుల్లోపు రిటైర్ కానున్న సీజేల్లో ఆరవ వ్యక్తిగా జస్టిస్ లలిత్ నిలవనున్నారు. సాధారణంగా సుప్రీం కోర్టు జడ్జీలు 65 ఏళ్లుకు రిటైర్ అవుతారు. ఇక హైకోర్టు జడ్జీలు మాత్రం 62 ఏళ్లకు రిటైర్ అవుతుంటారు.ఇక అత్యల్ప కాలం సీజేగా చేసిన మిగితా సీజేల వివరాలను తెలుసుకుందాం. జస్టిస్ కమల్ నరైన్ సింగ్ అతి తక్కువ రోజులు సీజేగా చేశారు. ఆయన కేవలం 18 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. 1991, నవంబర్ 25వ తేదీ నుంచి 1991 డిసెంబర్ 12వ తేదీ వరకు సీజేఐగా జస్టిస్ కమల్ చేశారు. ఇక జస్టిస్ ఎస్ రాజేంద్ర బాబు 30 రోజుల పాటు సీజేఐగా చేశారు. 2004 మే 2వ తేదీ నుంచి 2004 మే 31 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత జస్టిస్ జే సీ షా 36 రోజుల పాటు సుప్రీం సీజేగా చేశారు. 1970, డిసెంబర్ 17వ తేదీ నుంచి 1971 జనవరి 21 వరకు సీజే బాధ్యతల్ని నిర్వర్తించారు.జస్టిస్ జేబీ పట్నాయక్ 41 రోజుల పాటు సుప్రీంకోర్టు సీజేగా చేశారు. 2002, నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఆయన ఆ బాధ్యతల్ని నిర్వర్తించారు. జస్టిస్ ఎల్ ఎం శర్మ 86 రోజుల పాటు సీజేఐగా చేశారు. 1992 నవంబర్ 18వ తేదీ నుంచి 1993 ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఆయన ఆ బాధ్యతల్ని నిర్వర్తించారు.