విశాఖపట్నం
ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల సొమ్ముతో అమలు చేస్తున్న పథకాలన్నీ... తన సొమ్ముతో అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఎద్దేవా చేశారు.గత మూడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధులపై వైకాపా ప్రభుత్వం నేటికీ లెక్కలు చూపించలేదని ఆరోపించారు. ప్రభుత్వ భూములు, కార్యాలయాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి తీసుకుంటున్న రుణాలు భవిష్యత్తులో తిరిగిచెల్లించాలంటే చాలా కష్టతరమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో పొత్తు కొనసాగుతుందన్నారు.వీధి వ్యాపారులకు కేంద్రమే 10 వేలు రుణం మంజూరు చేస్తుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నతోడు పథకంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నామన్నారు. కేంద్రం నిధులతో నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పరిశీలించామన్నారు. ఎనిమిదేళ్ల ప్రధాన మోదీ పాలనలో దేశంలో అనేక సంక్షేమాభివృద్ధి పనులు జరిగాయన్నారు.