కాకినాడ, ఆగస్టు 29,
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైసీపీ రాజకీయాలు ఉన్నట్టుండి రసకందాయంలో పడుతున్నాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా కొండేటి చిట్టిబాబు ఉన్నారు. 2014లో ఓడి.. 2019లో గెలిచి.. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు చిట్టిబాబు. అమలాపురం ఎంపీగా ఉన్న చింతా అనురాధ.. పి.గన్నవరం నుంచి జడ్పీటీసీగా గెలిచి జడ్పీ ఛైర్మన్ అయిన విప్పర్తి వేణుగోపాలరావులు ఈ మధ్య నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారట. ముగ్గురూ ఒకే పార్టీ అయినప్పటికీ ఎవరి వర్గాన్ని వాళ్లు మెయింటైన్ చేస్తున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ తెచ్చుకోవాలి.. పి.గన్నవరంలో పోటీ చేసి గెలవాలి. ఎంపీ అనురాధ మాత్రం తనకోసం కాకుండా.. తన భర్త తాళ్ల సత్యనారాయణ మూర్తిని పోటీ చేయించేందకు శ్రమిస్తున్నట్టు పార్టీ వర్గాల టాక్. జిల్లాలో పి.గన్నవరం ఉందా లేదా అన్నట్టుగా ఉండే ఇక్కడి రాజకీయం.. నేతల ఎత్తుగడలతో రంగులు మారుతోంది.ఎంపీ అనురాధ భర్త సత్యనారాయణ మూర్తి ప్రస్తుతం పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కమిషనర్‌గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారన్న సంకేతాలు ఇస్తున్నారట. ఇందుకోసం నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండేందుకు తన తండ్రి చింతా కృష్ణమూర్తి పేరు మీద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చింతా కృష్ణమూర్తి 2009లో పిఆర్పి తరుపున అమలాపురం అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఇక విప్పర్తి వేణుగోపాలరావు రిటైర్డ్ సివిల్ ఇంజనీర్. గత ఎన్నికల్లో పి.గన్నవరం వైసీపీ సీటు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. జడ్పీ ఛైర్మన్ అయ్యాక దూకుడు పెంచేశారు. మొన్నటి ఎన్నికల్లో ఏదో తేడా వచ్చింది కానీ.. ఈసారి అలా జరగబోదని విప్పర్తి అంటున్నారట. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కంటే పైస్థాయి కావడంతో వేగంగానే పావులు కదుపుతున్నారట.ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తగ్గేదే లేదంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాను ఉండగా వేరొకరికి ఎందుకు అవకాశం ఇస్తారనేది ఆయన వాదన. తనకు వ్యతిరేకంగా వర్గాలను నడిపిస్తోంది ఎవరో తెలుసని చెబుతున్నారు చిట్టిబాబు. పరిషత్ ఎన్నికల్లో అయినవిల్లి జడ్పీటీసీగా తన కుమారుడిని బరిలోకి దింపేందుకు చివరి వరకు ప్రయత్నించారు ఎమ్మెల్యే. కానీ.. ప్రత్యర్థి వర్గం ఆయనకు చెక్ పెట్టింది. మంత్రి విశ్వరూప్ అనుచరుడికి టికెట్ ఇచ్చారు. ఆ ఎపిసోడ్ తర్వాత నియోజకవర్గంలో పార్టీ కేడర్ వర్గాలుగా విడిపోయిందని టాక్. పైకి కలిపే ఉన్నట్టు బిల్డప్ ఇచ్చినా.. తెరవెనక గట్టిగానే పనులు చక్కబెడుతున్నారట నేతలు.నియోజకవర్గంలో వైసీపీ సమావేశాలు అంటారు కానీ.. ఎవరి మీటింగ్ వాళ్లదే. వ్యక్తిగత అజెండాలే అక్కడ కీలకం. అధికారులకు సైతం ఈ మూడు పవర్ పాయింట్లతో చిర్రెత్తికొస్తోందట. ఒకరు చెప్పిన పనిని మరొకరు అడ్డుకోవడం.. సన్నాయి నొక్కులు నొక్కడం ఎక్కువైందట. ఏమైనా ఉంటే వాళ్లూ వాళ్లూ తేల్చుకోవాలి కానీ.. మధ్యలో ఈ డోలక్ ఏంటనేది పి.గన్నవరంలోని అధికారుల మాటగా ఉందట. స్థానిక సంస్థల్లోని వైసీపీ ప్రజాప్రతినిధులు సైతం ఎవరి వైపు మొగ్గు చూపితే ఏమౌతుందో అని లోలోన ఆందోళన చెందుతున్నారట. మొత్తానికి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతల ఫీట్స్ పీక్స్‌కు చేరుకుని ట్రాయాంగిల్ ఫైట్‌ను మరిపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.