హైదరాబాద్, ఆగస్టు 29,
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో మళ్లీ చేరేందుకు రంగం సిద్ధమయిందన్న ప్రచారం ఢిల్లీలో గుప్పుమంటోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించినప్పుడు ఈ మేరకు ప్రాథమిక చర్చలు జరిగాయని.. చంద్రబాబు ఢిల్లీలో ఉన్నప్పుడే లోకేష్… హోంమంత్రి అమిత్ షాతో సీక్రెట్ మీటింగ్ జరిగిందని తెలుస్తోంది. ఈ మేరకు మొత్తం చర్చలు పూర్తయ్యాయని దసరాలోపే ఎన్డీఏలో టీడీపీ చేరవచ్చని చెబుతున్నారు. బీజేపీ హైకమాండ్ ఈ అంశంపై స్పష్టమైన సర్వేలు చేయించుకుందని చెబుతున్నారు . బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి పెద్దగా మేలు జరగదు కానీ పార్లమెంట్ ఓట్లు భారీగా పెరుగుతాయన్న రిపోర్టులు అందాయి. అదే సమయంలో ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి. సుదీర్ఘ కాలంగా మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, జేడీయూతో పాటు అకాలీదళ్ కూడా గుడ్ బై చెప్పింది. ఇప్పుడు బలమైన పార్టీ అంటూ ఎన్డీఏలో లేదు. అందుకే టీడీపీ విషయంలో బీజేపీ ఆసక్తిగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన వైసీపీ అధినేత.. కూడా టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని లాబీయింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వారి ప్రయత్నాలకు సానుకూల ఫలితం లభించకపోవడంతోనే… విజయసాయిరెడ్డి .. టీడీపీతో మళ్లీ బీజేపీ కలుస్తుందని అనుకోవడం లేదని .. దరిద్రాన్ని ఎవరైనా తెచ్చి పెట్టుకుంటారా అని నిష్టూరమైన కామెంట్లు చేశారు. ఎన్డీఏలో వైసీపీ చేరడానికి సిద్ధమైనా .. బీజేపీ ఆ విషయంలో ఆసక్తిగా లేదని చెబుతున్నారు. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పులు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.