విజయవాడ, ఆగస్టు 30,
ఉత్తరాదిలో ఒక వెలుగు వెలుగుతున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా స్థానం సంపాదించుకోడానికి చేయని ప్రయత్నం లేదు. పన్నని వ్యూహం లేదు. ఉత్తరాది నేతల చేతుల్లో ఉండే పార్టీగా పేరు పడిన బీజేపీ దక్షిణాదిలో ఒక్క కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉంది. తెలంగాణలో పాగా వేసేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు తరచూ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ నగరాలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉనికే నామమాత్రం అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా బీజేపీ నేతలు ఏపీని కూడా ఎలాగైనా చిక్కించుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రేశ్ ను అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని విభజిత ఏపీ ప్రజలు నిట్ట నిలువునా పాతేశారు. అలాగే ఏపీ విభజనకు తోడ్పడి, ఆ తరువాత రాష్ట్రానికి రావలసిన విభజన హామీలకు ఎగనామం పెట్టిన బీజేపీ అన్నా కూడా ఆంధ్ర ప్రజలలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. అందుకే బీజేపీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఏపీలో విజయం సాధించిన దాఖలాలు దాదాపు మృగ్యం. గతంలో కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టినా బీజేపీకి ఏమీ ఒరగలేదు. తర్వాత అదే సామాజికవర్గానికే చెందిన సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించినా బీజేపీ పెద్దల పాచిక పారలేదు. ఎన్ని రకాల పిల్లి మొగ్గలు వేసినా బీజేపీ ఆటలు ఏపీలో అరటిపండు మాదిరిగానే మిగిలిపోయాయి(ఆటలో అరటి పండు). ఈ నేపథ్యంలోనే బీజేపీ మరో కొత్త వ్యూహానికి పదును పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలు, తరగతుల్లోని నాయకులకు తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల ఏదో ఒక మేరకు ప్రభావితం చేయగల కాపు సామాజికవర్గం ఓట్లను వచ్చే ఎన్నికల నాటికి అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ వివిధ మార్గాల్లో యత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే కాపు సామాజికవర్గంలో బలీయమైన మద్దతు ఉన్న వంగవీటి రాధాకు తాము అనుకూలమనే సంకేతాలు బీజేపీ నేతలు పంపుతున్నారు. దివంగత కాపు నేత వంగవీటి రంగా కుమారుడిగా రాధాకు ఆ సామాజికవర్గంలో మంచి పలుకుబడి ఉందనేది నిస్సందేహం. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న వంగవీటి రాధా అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. అక్కడి నుంచి వైసీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీలో చేరి, అదే పార్టీలో కొనసాగుతున్నారు.టీడీపీలో వంగవీటి రాధా ఉన్నప్పటికీ ఆయనకు సరైన గుర్తింపు లేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో అప్పుడప్పుడు వినవస్తుంటాయి. టీడీపీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి తనకు ఉన్నట్లు ఏనాడూ రాధా స్వయంగా బయటికి చెప్పలేదు. అయినప్పటికీ వంగవీటి రాధాను తమ వైపు తిప్పుకుని కాపు సామాజికవర్గం ఓట్లను రాబట్టుకోవాలనే యోచనతో బీజేపీ పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడ రాజకీయ వర్గాల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.‘వంగవీటి రాధా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పడం కష్టం. టీడీపీలో ఉన్నానని రాధా చెబుతున్నా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ వస్తుందనే గ్యారంటీ లేదు. అందుకే రాధా మా పార్టీలోకి వస్తే.. ఆయన భవిష్యత్తు బాగుంటుంది’ అని విజయవాడలోని ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు కూడా రాధా ప్రొఫైల్ గురించి వాకబు చేసినట్లు చెబుతున్నారు. రాధాయే గనుక బీజేపీలోకి వస్తే.. ఆయన కోరుకున్న స్థానంలో పార్టీ టిక్కెట్ ఇప్పించే బాధ్యత సోము వీర్రాజు తీసుకున్నారంటున్నారు. ఈ విషయమే రాధాకు ఏదో ఒక విధంగా చేరవేసి, ఆయనను బీజేపీలో చేర్చుకునే యత్నాలు మొదలయ్యాయని సమాచారం. బీజేపీ యత్నాలు సఫలమై, ఆ పార్టీలో రాధా చేరితే.. ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోందో చూడాలి మరి.