ఏలూరు, ఆగస్టు 30,
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గందర గోళంలో పడింది. ప్రాజెక్టును ఎప్పటికి పూర్తిచేస్తామో చెప్పలేమని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పదే పదే చెబుతున్నారు. ప్రతిపక్షనాయకుడి హోదాలో జగన్ ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం సీఎంగా ఆయన మాటలకు పొంతన లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అప్పట్లో జగన్ చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్నదానికి ఏమాత్రం పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ఇంత ఆలస్యమా అని నిందించారు. అంచనాలు పెంచేశారని ఆగ్రహించారు. నిర్వాసితుల ముఖాల్లో ఆనందం చూసేందుకు వారి డిమాండ్లు నెరవేర్చలేరా అని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడలేరా? అని నిలదీశారు.అలాంటి జగన్ తన మాట ఇప్పుడు మార్చేశారు. కాడి కింద పడేశారు. మడమ తిప్పేశారు, మాట తప్పేశారు. ఇదంతా నేను ఒక్కణ్ణ్ని చేసేది కాదు కదా కేంద్రాన్ని అడుగుతా.. ఒత్తిడి చేస్తా.. వాళ్లు నిధులిస్తే మీకు అందిస్తా.. లేకపోతే నేనేం చేయగలను అని బేలగా ప్రకటించి చేతులెత్తేశారు. అధికారంలోకి రాగానే పోలవరం అవినీతిని తేల్చేస్తానంటూ ఓ కమిటీని జగన్ నియమించారు. ఆ కమిటీ రేపో మాపో అవినీతి వరద లోతుల్ని తేల్చేస్తుందని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కమిటీ నివేదిక ఇచ్చినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.జగన్ అధికారంలోకి రాగానే పోలవరం పనులను ఆపేశారు. 2019 నవంబరులో రివర్స్ టెండరింగ్ పేరుతో గుత్తేదారును మార్చి, మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి పనులు అప్పగించారు. ఆ తర్వాతైనా పోలవరం పనులు వేగం పుంజుకున్నాయా? అంటే అదీ లేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయలేదు. దీంతో 2019, 2020లలో డయాఫ్రం వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట భారీగా ఇసుక కోత ఏర్పడి ప్రాజెక్టు భవితవ్యానికి పెను సవాల్ విసిరింది.పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసంపైనా జగన్ ఆడిన మాట తప్పారు. పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. ఇప్పటికీ ఆ ప్రకటనకు అతీగతీ లేదు. పునరావాస ప్యాకేజీ రూ. 10 లక్షలకు పెంచుతామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం గరిష్ఠంగా ఎస్టీలకు రూ.6.86 లక్షలు ఇస్తున్నారు. గిరిజనేతరులకు రూ.6.36 లక్షలే ఇస్తున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై రకరకాల గడువులు చెప్పారు. 2021 డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని తొలుత ప్రకటించారు. ఆనక 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తిచేసి నీళ్లిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ మాటలన్నీ నీటిమూటలయ్యాయి.పోలవరం ప్రాజెక్టుపై జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చేతులెత్తేశారు. ప్రాజెక్టు పూర్తిచేస్తామని రెండేళ్లుగా నమ్మించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందంటే సమస్యలు ఎవరి హయాంలో తలెత్తాయనే ప్రశ్నలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలంటే నిధులే కీలకం. ఇప్పటికీ రెండో డీపీఆర్ కు ఆమోదం లేదు. 2019 ఫిబ్రవరిలో 55 వేల 549 కోట్ల రూపాయలకు సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలు ఆమోదించింది. ఆ తర్వాత కేంద్రం దీన్ని రివైజ్డ్ కాస్ట్ కమిటీకి అప్పజెప్పింది. ఆ కమిటీ 47 వేల 726 కోట్ల రూపాయలకు అంచనాలు ఆమోదించింది. పోలవరం తాజా అంచనాలకు ఇంతవరకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపలేదు. కేంద్రం కొర్రీలపై కొర్రీలు వేస్తున్నా ఏపీ సర్కార్ పరిష్కరించుకోలేకపోతోంది. నాడు డీపీఆర్ ఆమోదించు కోలేకపోయారని విమర్శించిన జగన్ ఇప్పుడు.. 'పోలవరం నిధులు కేంద్రం ఇవ్వడం లేదు.. మనం కిందా మీద పడుతున్నాం. వెయ్యి కోట్లో, 2 వేల కోట్లో అయితే నేనే ఇచ్చేసేవాణ్ణి. వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలి. నేనేం చేయగలను' అని ఎదురు ప్రశ్నిస్తుండడం గమనార్హం.ఏపీలో అన్ని ఎంపీ స్థానాల్లోనూ వైసీపీని గెలిపిస్తే.. ప్రత్యేక హోదా సాధిస్తా, కేంద్రం నుంచి అన్నీ తెస్తా అని ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్ రాష్ట్రపతి ఎన్నిల్లోనూ, పలు కీలక బిల్లుల విషయంలో కేంద్రానికి బేషరతుగా ఎందుకు మద్దతు ఇస్తున్నారు? రాజ్యసభలో, లోక్ సభలో ఎందుకు మద్దతిస్తున్నారు? పోలవరం డీపీఆర్-2 ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి ఎందుకు చేయడం లేదు.. అనే విమర్శలు వెల్లువెత్తుతున్నా జగన్ స్పందించడం లేదు.పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు మూడేళ్లుగా అవస్థలు పడుతున్నాయి. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత గోదావరి వరదనీరు వెనక్కి ఎగదన్ని ముంపు గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. నిర్వాసితుల వరద కష్టాలు కళ్లారా చూసినా వరదల సమయానికి కూడా వైసీపీ ప్రభుత్వం కనీసం తొలిదశ పునరావాసం ఎందుకు పూర్తి చేయలేకపోయిందనే ప్రశ్నలు ప్రతిపక్ష టీడీపీ సంధిస్తోంది. తొలిదశలో 20 వేల 946 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 8 వేల 272 కుటుంబాలకే కల్పించింది. పునరావాస కాలనీలు ఇంకా పూర్తికాలేదు. పునరావాస ప్యాకేజీ అందలేదు. వరద ముంపును తట్టుకోలేక నిర్వాసితులు గోకవరం, జంగారెడ్డిగూడెం, చర్ల వంటి చోట్లకు వలస వెళ్లి అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. నెలకు 6 వేల నుంచి 8 వేల రూపాయల వరకు అద్దెలు భరిస్తున్నారు. జగన్ చెప్పినట్లు ‘మా ముఖాల్లో ఆనందం చూడటం అంటే ఇదేనా?’ అని నిర్వాసితులు నిలదీస్తున్నారు. ఏటా వరదల ముందు అందరినీ తరలించేస్తామని మూడేళ్లుగా ప్రణాళికలు రచిస్తున్నా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చపోవడాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి.