న్యూయార్క్, ఆగస్టు 30,
చందమామపైకి ఆర్టెమిస్ 1 పేరుతో అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన మూన్ మిషన్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ ప్రయోగానికి ఆటంకాలు ఎదురయ్యాయని తెలుస్తోంది. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది.అయితే ఈ ప్రయోగానికి ఉపయోగించే ఇంధన ట్యాంకర్లో లీకేజీలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ఈ కారణంగా పలుమార్లు ప్రయోగానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరిస్తూ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు నాసా తొలుత ప్రకటించింది. అయితే, చివరికి రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేయక తప్పలేదు. అయితే, అనుకున్న విధంగా సోమవారం(ఆగస్టు 29)న ప్రయోగం నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. తదుపరి తేదీపై త్వరలోనే స్పష్టత ఇస్తామని నాసా వెల్లడించింది.ఫ్లోరిడాలోని నాసా కెనెడీ అంతరిక్ష కేంద్రంలో ఇప్పటికే లాంచ్‌పాడ్‌పై రాకెట్‌ను రెడీగా ఉంచారు. పిడుగులు తాకినా రాకెట్‌కుగాని, ఓరియన్ క్యాప్సూల్‌కుగాని నష్టం వాటిల్లలేదని నాసా తెలిపింది. రాకెట్ ప్రయోగం ఇక పూర్తవుతుందని భావించిన నేపథ్యంలో రాకెట్లో ఇంధనం లీక్ అయినట్లు గుర్తించారు. సూపర్ కోల్డ్ హైడ్రోజన్, ఆక్సిజన్ లీక్ అవ్వడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేశారు. రీహార్సల్స్ నిర్వహించినప్పుడు ఇంధన లీకేజీ జరిగింది. ఉదయం, నాలుగు ప్రధాన ఇంజిన్లు, పెద్ద ఇంధన ట్యాంకు ఉన్న ప్రాంతంలో పగుళ్లు లేదా లోపాలు గుర్తించినట్లు నాసా అధికారులు వెల్లడించారు. వాస్తవానికి ఈ మిషన్ వ్యవధి.. 42 రోజులు, 3 గంటల.. 20 నిమిషాలు పడుతుంది. 1.3 మిలియన్ మైళ్లు ప్రయాణిస్తుంది. అక్టోబర్ 10న వ్యోమనౌక కాలిఫోర్నియా తీరానికి చేరువలో ఫసిఫిక్ మహాసముద్రంలో పడుతుంది. ప్రయోగం తిరిగి ఎప్పుడు నిర్వహిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.