విజయవాడ సెప్టెంబర్ 2,
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. అసలు ఏపీలో ఆ పార్టీ ఉన్నదన్న స్పృహ కూడా హైకమాండ్ లో కన్పించడం లేదు. అందుకే ఏ విషయాల్లోనూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ మ్యాప్ లో అసలు ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు కన్పించలేదు. కొంతకాలం క్రితం ఏపీ పై దృష్టి పెడతారని ప్రచారం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని చర్చలు కూడా జరిపింది. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఏపీ ఊసే టెన్ జన్ పథ్ నుంచి విన్పించడం లేదు.ఒకానొక దశలో ప్రస్తుతం ఉన్న పీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ ను కూడా తప్పిస్తారని ప్రచారం జరిగింది. రెడ్డి సామాజికవర్గం నేతలకు పీసీసీ బాధ్యతలను అప్పగించాలని అధిష్టానం యోచించిందన్న వార్తలు వచ్చాయి. కానీ ఇంత వరకూ పీసీసీ చీఫ్ ను మార్చలేదు. ఏపీలో వైసీీపీ, టీడీపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఆ రెండింటి మధ్య బీజేపీ, జనసేన పార్టీలు తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు అసలు ఏపీలో సీన్ లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీకి ప్రత్యేకమైన ఓటు బ్యాంకు అంటూ లేకుండా పోయింది. గత రెండు ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. లెఫ్ట్ పార్టీలతో పోటీ పడుతూ... వామపక్ష పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతుంది. పోనీ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాలన్నా ఎవరూ దరి చేయరని పరిస్థితి. సో సోలోగానే కాంగ్రెస్ పోటీ చేయాల్సి ఉంటుంది. ఒంటరిగా పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. దేశంలోనే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ కొద్దో గొప్పో బలంగా ఉన్న రాష్ట్రాల్లో బలోపేతం కావాలని ప్రయత్నిస్తుంది. తెలంగాణ పై ఎక్కువ ఫోకస్ పెట్టినా పెద్దగా ప్రయోజనం లేదు. నేతల మధ్య వైషమ్యాలతో ఆ పార్టీ ఎదగలేక పోతుంది. ఏపీలో మాత్రం నేతలు, ఓట్లు లేకపోవడంతో పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది. కొందరు సీనియర్ నేతలున్నా వారు రాజకీయంగా సన్యాసం తీసుకున్నట్లే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వారు సాహిసించే పరిస్థితి లేదు. రాజకీయాలపై కొంత ఆశ ఉన్నవారు ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పక్కకు తప్పుకున్నారు. మిగిలిన ఉన్న కొద్దిమంది పైకి చెప్పకపోయినా రాజకీయంగా రిటైర్మెంట్ అయినట్లే భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఏపీలో బలపడే అవకాశాలు కన్పించడం లేదు. అందుకే అక్కడ పార్టీ ఒకటి ఉందన్న విషయాన్ని కూడా మర్చి పోయినట్లున్నారు. ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమెన్ చాందీ ఏపీకి వచ్చే నెలలు గడుస్తుంది. ఇది చాలదూ ఏపీలో పార్టీపై ఏమేరకు ఫోకస్ పెడుతుందో అర్థం చేసుకోవడానికి?