విజయవాడ, సెప్టెంబర్ 3,
కమెడియన్ అలీకి త్వరలో నామినేటెడ్ పోస్టు ఖాయం. ఎస్, వింటున్నది నిజమే, గిల్లుకుని గిచ్చుకుని చూసుకోవలసిన అవసరం లేదు. మీరు అనుకోవచ్చును, అబ్బో మూడేళ్ళుగా ఈ మాట వింటూనే ఉన్నాం గానీ ఇంకో మాటుంటే చెప్పమని మీరు అంటే అనవచ్చును,కానీ, బట్ షూర్.. అలీ ఇంటికి అల్లుడు వచ్చిన వేళా విశేషమో మరేమో కానీ,(ఈ మధ్యనే అలీ తమ కుమార్తె వివాహం చేశారు)ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కాదంటే అందుకు సమానమైన మరో నామినేటెడ్ పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు వైసీపీ సర్కిల్స్ లో ఘట్టిగా వినిపిస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫైల్ మీద పోస్ట్ రాసి, సంతకం పెట్టడం మాత్రమే మిగిలుందని, అంటున్నారు.అయితే ఒక్క ఆలీకేనా ఈ అదృష్టం అంటే, కాదుట, అలీకంటే ఎక్కువగా జగన్ రెడ్డిని భుజాన మోసే, పోసాని కృష్ణ మురళీకి కూడా నామినేటెడ్ పోస్టు ఖాయమని, అది కూడా అతి త్వరలోనే విడుదలవుతుందని అంటున్నారు. ఆలీకి వక్ఫ్ బోర్డు చైర్మన్ పోస్టు ఇస్తే, పోసానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఇవ్వచ్చని అంటున్నారు. నిజానికీ ,అలీ, పోసానీలతో పాటుగా మోహన్ బాబు ఫ్యామిలీ, పృధ్విరాజ్ గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ రెడ్డి ఒక్క పృద్వీని మాత్రమే ఎస్వీబీసీ టీవీ చానల్ చైర్మన్ పదవికి నామినేట్ చేశారు. అది కూడా మూడు నాళ్ళ ముచ్చటగానే ముగిసి పోయింది. ఆయనపై ఏవో ఆరోపణలు రావడంతో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కన పెట్టేశారు. పృధ్విరాజు పార్టీకి దూరమయ్యారు.అటు మోహన్ బాబు కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలీ, పోసాని మాత్రం ఇంకా పార్టీని వదల కుండా చకోర పక్షుల్లా జగన్ రెడ్డి దయకోసం, కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జబర్దస్త్ రోజా మంత్రి పదవికోసం ఎంతగా తాపత్రయ పడ్డారో, అంతకంటే ఎక్కువగా అలీ, పోసాని నామినేటెడ్ పదవుల కోసం తాపత్రయ పడుతున్నారని అంటారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆలీని ఒకటికి రెండు సార్లు ఇంటికి పిలిచి మరీ ఒట్టి చేతులతో పంపించారు. రెండు మూడు సార్లు ఆయనకు పదవులు కేటాయించినట్టు ప్రచారం సాగింది. తొలుత రాజ్యసభ, ఆ తరువాత కేబినెట్ హోదాతో సమానమైన వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి అలీకి కేటాయించనున్నారన్న ప్రచారం జరిగింది.అలీ దంపతులు కలిసిన సందర్భంలో మీకు గుడ్ న్యూస్ చెబుతానంటూ స్వయంగా జగన్ చెప్పడంతో పాపం అలీ అమాయకంగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే గుడ్ న్యూస్ ఏదీ అలీ చెవిన పడలేదు. ఇప్పుడు మరోసారి ఆయనకు పదవి కేటాయించనున్నారన్న ప్రచారం అయితే సాగుతోంది. అలాగే పోసాని కృష్ణ మురళీ జగన్ రెడ్డిని వెనకేసుకొచ్చె క్రమంలో జనసేన పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఆయనను టార్గెట్ చేస్తూ పవన్ ఫాన్స్ చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు. అఫ్కోర్స్, అయన తక్కువతినలేదనుకోండి. అయినా, ఒక విధంగా జగన్ రెడ్డికి మద్దతుగా నిలిచినందుకు పోసాని సినిమా అవకాశాలు పోగొట్టుకున్నారు. అయినా నామినేటెడ్ పదవి రాలేదు. ఇంతలోనే మూడేళ్ల వైసీపీ పాలన ముగిసి పోయింది. మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఇప్పటికే పూర్తిగా అడుగంటి పోయాయి. అయినా, ఇప్పటికీ అదిగో ఇదిగో అంటున్నారే తప్ప పదవులు మాత్రం కేటాయించలేదు. అయితే ఇప్పడు ఆలీతో పాటుగా, పోసానికి నామినేటెడ్ పదవులు ఇచ్చేసినట్లే అనుకోమంటున్నారు. అయితే ఇప్పటికే ఒకటికి రెండుసార్లు భంగపడిన అలీ మాత్రం వస్తే చూద్దాంలే .. అన్నట్లుగానే ఉన్నారని అంటున్నారు. అవును మరి, జగన్ రెడ్డి అయినా మరొకరు అయినా అందరినీ అన్ని వేళలా మోసం చేయలేరు కదా.. దట్సిట్..