గుంటూరు, సెప్టెంబర్ 3,
అన్నీ అనుకున్నట్లే జరిగితే, అతి త్వరలోనే, టీడీపీ, బీజేపీల మధ్య మళ్ళీ పొత్తు పొడిచే అవకాశాలున్నాయనే సంకేతాలు రోజు రోజుకు మరింతగా స్పష్టమవుతున్నాయి. బీజేపీ ఏపీ రాష్ట్ర నాయకులు, అబ్బే అలాంటిదేమీ లేదని బుకాయించినా, కేంద్ర నాయకత్వం మాత్రం టీడీపీతో పొత్తు విషయంపై సీరియస్ గానే ఆలోచిస్తోంది. ఇంకా స్పష్టంగా పొత్తు వైపే మొగ్గు చూపుతోందని, ఢిల్లీ మీడియా వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తోంది. మరో వంక, వరస పెట్టి మిత్ర పక్షాలు అన్నీ, ఎన్డీఏని వదిలి పోవడంతో పాత మిత్రులతో కొత్త పొత్తులకు సంబంధించి పునరాలోచించక తప్పని పరిస్థితి బీజేపీకి ఏర్పడిందని, ముఖ్యంగా నితీష్ కుమార్ గుడ్ బై చెప్పిన తర్వాత పార్టీ వ్యూహకర్తలు ఆ దిశగా ఆలోచనలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీలో బీజేపీకి ఉన్నది లేదు,పోయేది లేదు. టీడీపీతో పొత్తు వలన వస్తే అసెంబ్లీలో ఓ నాలుగు, లోక్ సభలో ఒకటో రెండో సీట్లు వస్తే వస్తాయి. వచ్చే విషయం పక్కన పెడితే, పోయేది అయితే అసలే లేదు. అయితే, పొరుగు రాష్ట్రం తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడమే కాకుండా, ఇంకొక్క మెట్టెక్కితే,సునాయాసంగా అధికారంలోకి రాగలమని,బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటుగా, తెలంగాణ బీజేపీలోనూ గట్టి విశ్వాసం ఏర్పడింది. ఇదే విషయంపై బీజేపే సీనియర్ నాయకుడు ఒకరు, బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో బాగా ప్రచారం అయిన స్లోగన్ ‘ఔర్ ఏక్ ధక్కా, మారో ని గుర్తు చేస్తూ ఇంకొక్క దెబ్బ పడితే తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టగలమని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం గట్టిగా నమ్ముతోందని అన్నారు. మరో వంక,తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, జాతీయ రాజకీయాలపై కన్నేసి, కమల దళానికి సవాలు విసురుతున్నారు. నిజానికి ఇప్పటికిప్పుడు, కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీకి సవాలు కాకపోవచ్చును, కానీ, లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ముచ్చటగా మూడవసారి విజయం సాధించి, అయన ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సొంతం చేసుకుంటే మాత్రం ఆయన ప్రభావం జాతీయ రాజకీయాల పై, ఉంటుందని బీజేపీ వ్యూహ కర్తలు లెక్కలు వేస్తున్నారు. సో .. కేసీఆర్ జాతీయ ఆశలను మొగ్గలోనే తుంచేయాలాంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసని ఓడించడం కమల దళానికి అవసరమని, ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే, తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పూర్వ వైభవం కోల్పోయినా, ప్రజల్లో ముఖ్యంగా బీసీల్లో ఆ పార్టీకి ఇంకా పట్టుంది. రాష్ట్ర విభజనకు నేపధ్యంగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 15 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయితే 2018 ఎన్నికలలో కాంగ్రెస్, కోదండ రామ్ పార్టీలతో కలిసి ప్రజా ఫ్రంట్’గా ఏర్పడి పోటీ చేసినా, పెద్దగా ఫలితం దక్కలేదు. కేవలం మూడు శాతం ఓట్లు, రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఆ ఇద్దరు కూడా కారెక్కడంతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. మరో వంక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ సహా అనేక మంది నాయకులూ తెరాస, బీజేపే, కాంగ్రెస్ పార్టీలలో చేరిపోయారు. ప్రస్తుత తెరాస మంత్రివర్గంలో అరడజను మందికి పైగా మాజీ టీడీపీ నేతలే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రస్ ఎమ్మెల్యే సీతక్క సహా చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాజీ టీడీపీ నేతలే.. ఇందులో రేవంత్ రెడ్డి సహా చాలా మంది చంద్రబాబును గౌరవించే.. అభిమానించే వారే ఉన్నారు. తెలంగాణలో ఇంచుమించుగా 32 అసెంబ్లీ నియోజక వర్గాల్లో , ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఆంధ్రా సెటిటర్స్ గెలుపు ఓటములను నిర్ధారించే నిర్ణాయక శక్తిగా ఉన్నారు. సహజంగా సెట్ల్లెర్స్ పై టీడీపీ ప్రభావం ఉంటుందని. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో బీసీలు ఇప్పటికీ టీడీపీ వైపు మొగ్గుచుపుతున్నారని, బీజేపీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో కీలక పదవులు అందుకున్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్ వంటి కొందరు బీసీ నేతలు టీడీపీతో పొత్తు తెలంగాణలో బీజేపీకి కలిసొస్తుందని విశ్లేషిస్తున్నారు. అందుకే బీజేపీ జాతీయ నాయకులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశంతో పొత్తును కోరుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ బీజేపీలోని ఒక వర్గం మాత్రం టీడీపీతో పొత్తును గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే, గత ఎన్నికలలో కేసీఆర్, చంద్రబాబు భుజం మీద సెంటిమెంట్ తుపాకి పెట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన విధంగా రేపటి ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీస్తారని ఈ వర్గం వాదిస్తోంది. అయితే, ఉభయ వర్గాలు కూడా అంతిమ నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వానికి వదిలేసినట్లు చెపుతున్నారు. అలాగే, బీజేపీ జాతీయ నాయకత్వం అంత త్వరగా నిర్ణయం తీసుకోదని, టీడీపీతో పొత్తును బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ ప్రయోజనాల కోణంలోనే చూస్తుందని అంటున్నారు. తెలంగాణలో బీజేపీకి మేలు జరుగుతుందంటే, ఏపీలో పార్టీ లాభనష్టాలను పక్కన పెట్టి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో టీడీపీతో పొత్తుకు టిక్కు పెడుతుందని అంటున్నారు. అదలా ఉంటే, టీడీపీ, బీజేపీ పొత్తు వలన ఏపీలో టీడీపీకి ఏ మేరకు మేలు జరుగుతుందనే విషయంలో, ఇటు పార్టీలో, అటు రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీకి గత ఎన్నికల్లో నిండా ఒక శాతం ఓటు కూడా రాలేదు. ఇప్పుడైనా, రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది అనేందుకు ఎక్కడా దాఖాలాలు లేవు. తిరుపతి లోక సభ, ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, టీడీపీ పోటీలో లేకున్నా, బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్ దక్కలేదు. అయినా, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, అలాగే, ఓ ఐదారు శాతం వరకు ఓటు షేర్ ఉంటుందని భావిస్తున్న జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండడం వలన చేత, టీడీపీ, నాయకత్వం బీజేపీతో పొత్తుకు సిద్ధమైందని అంటున్నారు. ఈ రెండు కారణాల చేతనే, తెలుగు దేశం పార్టీ ఏపీలో బీజేపీతో పొత్తును కోరుకుంటోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే సమయంలో, బీజేపీతో పొత్తు వలన టీడీపీకి నష్టం జరిగే ప్రమాదం లేక పోలేదని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గడచిన ఎనిమిది సంవత్సరాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విభజన హమీలతో సహా, రాష్ట్రానికి మేలు చేసే ఏ ఒక్క మంచి పని చేసింది లేదని, సామాన్య ప్రజలకు కూడా అర్థమై పోయింది. అలాగే, గడచిన మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికృత మానస పుత్రిక మూడు రాజధానుల ప్రతిపాదన సహా, జగన్ రెడ్డి అరాచక పాలనకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందనే అభిప్రాయమే ఆందరిలోనూ వుంది. నిజానికి, 2019 కంటే ఇప్పుడే బీజేపీ పట్ల జనంలో వ్యతిరేకత ఎక్కువగా ఉందని అంటున్నారు.అప్పుడు ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం ఇతరత్రా చేయవలసిన సహాయం చేయక పోవడం వలన, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పట్ల వ్యక్తమైన ప్రజాగ్రహానికి,ఇప్పడు జగన్ రెడ్డి అరాచక పాలను కేంద్ర ప్రభుతం గుడ్డిగా సంర్దిస్తోందనే ఆగ్రహం తోడైంది.ఒక విధంగా ఏపీ ప్రజల్లో బీజేపీ పట్ల డబుల్ ఇంజిన్ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో, టీడీపీ, బీజేపీ పొత్తును సమాన్య ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనే విషయంలో అనుమానాలున్నాయని అంటున్నారు. ఈ అన్నిటినీ మించి గత 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటర్లు, టీడీపీ ఓటమే లక్ష్యంగా, సొంత పార్టీ అభ్యర్ధులు ఉన్నా, వైసీపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని మరిచి పోరాదని అంటున్నారు. ఇప్పడు కూడా పార్టీ జాతీయ నాయకత్వం బలవంతంగా టీడీపీతో పొత్తుకు ఒప్పించినా, బీజేపీ ఓటు, అది ఎంతైనా కానీ, టీడీపీకి పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతుందనే నమ్మకం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాగ్రహం, పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత కుమ్ములాటల నేపధ్యంలో, ప్రజలు టీడీపీవైపు చంద్రబాబు వైపే చూస్తున్నారు. ఈ పరిస్థితిలో బీజేపీతో పొత్తు అవసరమా? అనర్ధమా? అనే విషయంలో తెలుగు దేశం పార్టీ ఒకటికి రెండు సార్లు ఆలోచించు కోవలసిన అవసరం ఉందని అంటున్నారు. నౌ ది బాల్ ఈజ్ ఇన్ టీడీపీ కోర్ట్ ... నిర్ణయం తీసుకోవలసింది, టీడీపీనే కానీ, రాష్ట్రంలో ‘జీరో’ పార్టీ బీజేపీ కాదని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.