YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీకి మూడు రాజధానుల బిల్లు...?

అసెంబ్లీకి మూడు రాజధానుల బిల్లు...?

విజయవాడ, సెప్టెంబర్ 3, 
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకున్న మూడు రాజధానుల బిల్లును మళ్ళీ తెస్తుందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ మానస పుత్రికకు మళ్ళీ ప్రాణం పోయాలని అనుకుంటున్నారా? అంటే, అధికార వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నవంబర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది.సమబందించి  దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్ర  అడ్వకేట్ జనరల్, ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పాత బిల్లును ఉపసంహరించుకుంటూ తెచ్చిన కొత్త బిల్లును సభ ఆమోదం తెలిపింది. అయితే, అప్పుడే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని, సాంకేతికంగా బిల్లును వెనక్కి తీసుకున్నా, మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అంతే కాదు, ఉపసంహరించుకున్న బిల్లు స్థానంలో మరింత పక్కా బిల్లును త్వరలోనే తీసుకొస్తామని ప్రకటించారు.ఇదంతా చరిత్ర, అయితే ఇప్పడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఈ నెల మూడవ వారంలో మొదలయ్యే, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో  మూడు రాజధానుల బిల్లును మళ్ళీ ప్రవేశ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇంతవరకు అధికారికంగా అసెంబ్లీ సమావేశాల  తేదీలు ఖరారు కాలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈ నెల మూడవ వారంలో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నెల 7న జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీల పై తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అలాగే,ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులతో పాటుగా, మరోసారి మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని మొదటి సారిగా 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మండలిలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆందోళన  చేపట్టారు ఈ రోజుకు కూడా అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతూనే వుంది. ఎండా వానలు, ప్రకృతి వైపరీత్యాలతో  పాటుగా కొవిడ్ మహమ్మారిని కూడా తట్టుకుని అమరావతి రైతులు, మహిళలు విభిన్న రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు.న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరున అమరావతి రైతులు చారిత్రక పాదయాత్ర నిర్వహించారు. కాగా, సెప్టెంబర్ 12వ తేదీకి ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తిఅవుతున నేపధ్యంలో అదే రోజు నుంచి మరోసారి రైతులు, మహిళలు మరో మహా పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. ఈ సారి అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా సూర్యభగవానుడు కొలువైన అరసవల్లి వరకు అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు పేరున మరో మహా పాదయత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరో వంక  తెలుగు దేశం, బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు అన్నీ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాలుపంచుకున్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మొండిగా ముందుకు పోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల చివర్లో జరిగే  అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో  ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లు విషయంలో ఇటు ప్రజల్లో అతి పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠను రేపుతోంది.

Related Posts