కాకినాడ, సెప్టెంబర్ 6,
సుదీర్ఘకాలంలో రాజకీయాల్లో ఉన్న కుటుంబం అది.గెలుపోటములకు సంబంధం లేకుండా జనాలతో కలిసి ఉన్నారు.అలాంటి ఫ్యామిలీ చేరితే స్థానికంగా పార్టీకి తిరుగుండదని వైసీపీ భావిస్తోందా?ఫ్యాన్ కిందకి వెళ్లిపోవటానికి ఆ ఫ్యామిలీ కూడా సిద్ధం అవుతోందా?ముద్రగడ కుటుంబం అడుగులెటు పడుతున్నాయి.1978 నుంచి 1989 వరకు నాలుగు సార్లు ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది 1994 లో తొలిసారి ఓటమి చెందిన ఆయన 1999, 2004 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీ గా పోటీ చేయగా ఒక సారి గెలిచి మరొక సారి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 2009 లో కాంగ్రెస్ తరపున ప్రత్తిపాడు నుంచి పోటీ చేయమని ఆఫర్ వచ్చింది. తనను ఓడించిన ప్రత్తిపాడులో మళ్ళీ పోటీ చేయనని పిఠాపురంలో అదృష్టం పరిష్కరించుకున్నారు. కానీ ప్లేస్ మారినా రిజల్ట్ మాత్రం మారలేదు. ఏమైందో ఏమో 2014 లో ఏదో ఒక పార్టీ తరపున బరిలో దిగుదామని చివరి వరకు ప్రయత్నం చేసి మళ్లీ ప్రత్తిపాడు బరిలో ఇండిపెండెంట్ గా పోటీచేసినా నెగ్గలేకపోయారు ముద్రగడ.ఈ ఓటమి తర్వాత కాపు ఉద్యమానికి నాయకత్వం వహించారు ఈ మాజీ మంత్రి. 1978 నుంచి 2014 వరకు యాక్టివ్ పాలిటిక్స్ చేసిన ఆయన తర్వాత లేఖలకే పరిమితమయ్యారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మధ్యలో ఒకటి రెండు సార్లు వైసీపీలో చేరుతారని ప్రచారం కూడా జరిగింది. కానీ పొలిటికల్ గా ఎటువంటి స్టెప్ తీసుకోలేదు. ముద్రగడకు ఇద్దరు కొడుకులు బాలు, గిరిబాబు. బాలు అనారోగ్యంతో పెద్దగా యాక్టివ్ గా ఉండడు రెండో కొడుకు గిరిబాబు రాజకీయాలు వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. కాకినాడ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాపు ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు లో ఆరుగురు కాపు ఎమ్మెల్యేలే. కొన్ని దశాబ్దాలుగా ఎంపీ స్థానం పార్టీలతో సంబంధం లేకుండా ఆ వర్గం ఖాతాలో పడుతోంది. జిల్లాలో జనసేన ప్రభావం కూడా కొన్ని నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న అధికార పార్టీ పెద్దలు వచ్చే ఎన్నికల్లో ముద్రగడ ఫ్యామిలీని ప్రతిపాడు బరిలో నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. దానికి సంబంధించి జిల్లా నేతలు ముద్రగడ దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లారట. కానీ, తనకు మళ్ళీ రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారట. దాంతో అధికార పార్టీ నేతలు ప్లాన్ బి అమలు చేస్తున్నారనే
గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్లాన్ బీ లో భాగంగా పద్మనాభం చిన్న కొడుకు గిరిబాబుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారట వైసీపీ నేతలు. మీరు పార్టీలోకి రండి పెద్దాయనను వెనకనుంచి మద్దతు ఇవ్వమనండి మిగతాదంతా మేము చూసుకుంటామని అన్నారట. దాంతో గిరిబాబు తండ్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారనే టాక్ నడుస్తోంది. ప్రత్తిపాడు లో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి మూడు వర్గాలు ఆరు గుంపులుగా తయారైంది. ఇక్కడ ఎమ్మెల్యేగా పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. 2014లో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే గెలిచిన వరుపుల సుబ్బారావు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వేరే పార్టీలోకి వెళ్లి 2019 లో అక్కడ సీటు రాకపోవడంతో తిరిగి ఫ్యాన్ కిందకు చేరిపోయారు. నియోజకవర్గంలో ప్రస్తుతం ఎవరి వర్గం వారు మెయింటైన్ చేస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే వీటన్నింటికీ చెక్ పెట్టాలని లెక్కలు వేస్తున్నారట. అధికార పార్టీ ఇచ్చిన ఆఫర్ తో ముద్రగడ కొడుకు వైసీపీలో చేరటానికి పావులు కదుపుతున్నారట. మేం వైసీపీలో చేరతాం.మీరు వెనుక నుంచి నడిపించండి అని ముద్రగడకు చెప్తున్నాడట..175సీట్లు టార్గెట్ పెట్టుకున్న వైసీపీ ఇప్పటినుంచే ఎన్నికల ఎత్తుగడలు వేస్తోందని ముద్రగడ ఫ్యామిలీపై పెట్టిన ఫోకస్ తో అర్థమవుతోంది. కాపునేతగా ముద్రగడ ఫాలోయింగ్ రాష్గ్ర వ్యాప్తంగా కలిసిరావాలంటే, ఆ ఫ్యామిలీ నుంచి పార్టీలోకి ఎవరో ఒకరు చేరితే మంచిదనే ఆలోచన వైసీపీలో ఉంది. ఎంత ప్రయత్నించినా పెద్దాయన ఒకే చెప్పకపోవటంతో, ప్రత్యామ్నాయంగా, ఆయన ఇంట్లోంచే ఇంకొకరిని లాగాలని చూస్తోంది. అది సక్సెస్ అయితే, ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన దూకుడుకి కళ్లెం వేయవచ్చనేదే వైసీపీ స్ట్రాటెజీగా కనిపిస్తోంది.మొత్తానికి ముద్రగడ ఫ్యామిలీని పార్టీలోకి తీసుకురావడానికి వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోందని టాక్ వినిపిస్తోంది.. ఆయన కొడుకు ద్వారా కథ నడుపుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి ముద్రగడ కూడా ఓకే చెప్పినట్లు చెవులు కోరుక్కోంటున్నారు అనుచరులు. మరి ఈ ఎపిసోడ్ కి ఎప్పటికీ ఎండ్ కార్డు పడుతుందో చూడాలి..