విశాఖపట్టణం, సెప్టెంబర్ 6,
బూడి ముత్యాలనాయుడు. మాడుగుల నుంచి రెండోసారి ఎమ్మెల్యే. ఇటీవల కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి కావడంతోపాటు.. ఏకంగా డిప్యూటీ సీఎం హోదా దక్కింది. పొలిటికల్‌గా ఊహించని శిఖరాలకు వెళ్లారంటారు అనుచరులు. కాకపోతే ఎమ్మెల్యేగా ఉన్న ముత్యాల నాయుడు వేరు.. డిప్యూటీ సీఎంగా ఆయన తీరు వేరన్నది దగ్గరగా చూస్తున్నవారి మాట. ఉమ్మడి విశాఖ జిల్లాలో తనదైన మార్కు వేసుకోవాలనే తాపత్రయం ఉన్నప్పటికీ.. బూడికి సంధు దొరకడం లేదట. దీంతో ఉంటే మాడుగుల.. లేదంటే విజయవాడ అన్నట్టుగా మారిపోయింది. మీడియాకు కూడా దూరమే. అలాంటి డిప్యూటీ సీఎంలో ఇప్పుడు మరో కోణం కనిపిస్తోందట.శాఖాపరమైన వ్యవహారాలు.. రాజకీయాలపై ప్రశ్నలు వస్తే సహించలేకపోతున్నారట డిప్యూటీ సీఎం. ఆగ్రహం వ్యక్తం చేయడం.. లేనిపోని సవాళ్లు విసరడం.. చేతనైంది చేసుకోవాలని పరుషంగా మాట్లాడటం చేస్తున్నారట. ఇటీవల జడ్పీ సమావేశంలో నీటి ఎద్దడిపై వేసిన ప్రశ్నలకు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. అక్కడే ఉన్న అధికారులు అవాక్కైన పరిస్థతి. మాడుగులలోనూ బూడి వ్యవహారం ఇదే విధంగా ఉంటోందట. పార్టీ నేతలు కార్యకర్తలపై ఎన్నడూ లేనివిధంగా చిర్రుబుర్రులు ఆడుతున్నారట.రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక కొన్ని సామాజికవర్గాలను ముత్యాల నాయుడు పూర్తిగా పక్కన పెట్టేశారనే అసంతృప్తి పార్టీ వర్గాల్లో ఉందట. పదవుల పంపిణీలో ఈక్వేషన్లు పట్టించుకోలేదని సమాచారం. ఇవి క్రమంగా డిప్యూటీ సీఎంపై వ్యతిరేకత పెంచుతున్నాయనే వాదన ఉంది. రాజకీయంగానూ ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. చోడవరం, మాడుగుల ఇరుగు పొరుగు నియోజకవర్గాలు. ఇక్కడి పరిణామాలు రెండు నియోజకవర్గాలపైన ప్రభావం చూపుతాయి. అటువంటి చోట చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీతో బూడికి విభేదాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం అయ్యాక చోడవరంపైన తనకు ప్రాధాన్యం పెరుగుతుందని బూడి వర్గం లెక్క లేసుకుంది. అనూహ్యంగా హైకమాండ్ ధర్మశ్రీకి డబుల్ ప్రమోషన్ ఇచ్చింది. ప్రభుత్వ విప్‌గా.. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. పార్టీ పరంగా ప్రాధాన్యం ధర్మశ్రీకే దక్కుతోంది.ఇతర నియోజకవర్గాల్లో సమస్యలు కూడా డిప్యూటీ సీఎం దగ్గరకు వచ్చే పరిస్థితి లేదట. అందరూ సీనియర్లు కావడం నేరుగా తమకు కావాల్సిన పనులు చేయించుకునే సామర్ధ్యం ఉంది. గ్రేటర్ విశాఖ జిల్లాకు మంత్రి లేనప్పటికీ ఆ ఖాళీని ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ భర్తీ చేసేశారు. అరకు, పాడేరు ప్రాంతాలకు ఇన్ఛార్జ్ మంత్రిగా అమర్నాథ్ వ్యవహరిస్తున్నారు. దీంతో సహజంగానే ముత్యాల నాయుడు స్పేస్ బాగా తగ్గిపోయిందనే చర్చ ఉంది. పైగా వచ్చే ఎన్నికల నాటికి హైకమాండ్ అవకాశం ఇస్తే ఎంపీగా వెళ్లే యోచనలో ఉన్నారట ముత్యాల నాయుడు. ఈ క్రమంలో జిల్లా మొత్తం మీద తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం ఆయనకు అనివార్యం. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం స్టైల్ మార్చారా…?.అనే చర్చ జరుగుతోంది.