విజయవాడ, సెప్టెంబర్ 6,
వైసీపీ రెబల్ ఎంపీకి ప్రాణహాని ఉందంటూ దాదాపు 70 మంది ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. సొంత పార్టీ నుంచే ఆయన ప్రాణానికి ముప్పు ఉందన్న ఆందోళనను వారా లేఖలో వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఆయనకు తన సొంత నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి లేదని వారా లేఖలో పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ భీమవరంలో అల్లూర విగ్రహావిష్కరణకు హాజరైన సంగతి తెలసిందే. ఈ సందర్బంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలు దేరిన రఘురామకృష్ణం రాజులను ఆయన ప్రయాణిస్తున్న రైలు బోగీని దగ్ధం చేసైనా హతమార్చాలని చూశారని ఆ ఎంపీలు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, అంతకు ముందు సీఐడీ కస్టడీలో చిత్ర హింసలకు గురి చేశారనీ పేర్కొంటూ రఘురామరాజు గతంలో ఎంపీలకు లేఖలు రాసిన సంగతి విదితమే. ఆ లేఖలకు స్పందించిన వివిధ పార్టీలకు చెందిన దాదాపు 70 మంది ఎంపీలు ప్రధానికి లేఖ రాశారు.అలాగే కనీసం ఏడుగురు కేంద్ర మంత్రులు కూడా ఇదే విషయాన్ని లేఖ ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన ఆయన తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తీరు హింసే నా ఆయుధం, హింసే నామార్గం అన్నట్లుగా ఉందని అన్నారు. అన్న క్యాంటిన్ల ధ్వసం ఘటనలను చూస్తుంటే ఈ ప్రభుత్వానికేమైంది అనిపించక మానదన్నారు.అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేయడం అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని విమర్శించారు. పరిస్థితులు ఇలాగే ఉంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ ముందుకు వచ్చే పరిస్థితి అనివార్యమౌతుందన్నారు. ఏపీ ప్రభుత్వానికి కోర్టుల మీద కానీ, కోర్టు తీర్పుల మీద కానీ గౌరవం ఉన్నట్లు కనబడటం లేదన్నారు.ఇక రిషి కొండ తవ్వకం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మరీ దారుణంగా ఉందన్నారు. రిషికొండపై ప్రకృతి విధ్వంసానికి సంబంధించి తాను సుప్రీం కోర్టును ఆశ్రయించగా, హైకోర్టులో ఉన్న కేసులో ఇంప్లీడ్ కావాలని సూచించిందని పేర్కొన్నారు. అయితే తన న్యాయవాది ఉమేష్ చంద్రకు రుషికొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుమతి లేదంటూ నిరాకరించారని రఘురామ రాజు అన్నారు.