న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6,
గుర్తుండే ఉంటుంది.రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిని నిలిపేందుకు, కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, వామపక్షాలు సహా సుమారు ఓ 20 వరకు పార్టీలు సమాలోచనలు జరిపాయి. అదికూడా ఒకసారి కాదు. దఫ దఫాలుగా మూడు నాలుగుసార్లు సమావేశమయ్యారు. చర్చలు జరిపారు. సంప్రదింపులు సాగించారు.ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, లెఫ్ట్ నేతలు సీతారాం ఏచూరి, డి.రాజ... ఇలా ఒకరని కాదు, విపక్ష్లాల ముఖ్య నేతలంతా రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధి కోసం సుదీర్ఘంగా చర్చలు, సంప్రదింపులు జరిపారు. అలా సమావేశమైన ప్రతిసారి ఒక పేరు పైకి రావడం, వారు‘సారీ’ చెప్పి తప్పించుకోవడం ఒక ప్రహాసనంగా సాగింది. ముందు మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రతిపాదించారు, ఆయన నో..అన్నారు.ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లు ప్రస్తావన కొచ్చాయి.. ఆ ఇద్దరు కూడా .. సారీ ..చెప్పి తప్పుకున్నారు.చివరాఖరుకు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా నాలుగో కృష్ణుడిగా తెరపై కొచ్చారు. ఓటమి ఖాయమని తెలిసినా, పోటీచేశారు. ఓడిపోయారు. అయితే, ఇప్పడు ఇదంతా ఎందుకు చెపుతున్నట్లని, మీరు అడిగితే అడగవచ్చును. నిజమే, 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కర్చీఫ్ వేయడానికి, ఆనాటి రాష్ట్రపతి ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులుగా తెరపై కొచ్చి వెళ్ళిన వరస కృష్ణుల కథకు డైరెక్ట్ గా ఏ సంబంధమ లేక పోవచ్చును కానీ, కొంచెం లోతుగా చూస్తే బీరకాయ పీచు సంబంధం ఏదో ఉన్నట్లే ఉందని పిస్తోంది.. నిజానికి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రధాని మోడీని గద్దెడించాలనే బలమైన ఆకాంక్ష గాంధీల నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీ వరకు విపక్ష నేతలు అందరిలో వుంది.అదే సమయంలో అందరికీ, అది ఏ ఒక్కరి వల్లో, ఎ ఒక్క కూటమి వల్లనే అయ్యే పని కాదని కూడా తెలుసు. అందుకే, 2024 నాటికి అందరూ కలిసి ఏకమై మోడీ ఓడించే ‘పవిత్ర’ యజ్ఞానికి అంకురార్పణగానే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధి ఆలోచన పురుడు పోసుకుంది. అయితే, ఆ ప్రహసనం, ఆ తర్వాత అదే పంధాలో సాగిన ఉప రాష్టపతి ఎన్నిక ప్రహసనం ఎలా ముగిసిందో అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం సాగిన విఫల యత్నంగా మిగిలి పోయినా, అది అయ్యే పని కాదని ‘క్లియర్ కట్’ గా అందరికీ తెలిసి పోయినా, ప్రతిపక్ష పార్టీలు, పట్టు వదలని విక్రమార్కునిలా, భేతాళుడి శవాన్ని, కథలను మోస్తూనే ఉన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు, బీజేపీ యేతర ప్రభుత్వాన్ని గద్దె పై కూర్చో పెట్టేదుకు, ఎవరి ప్రయాణాల్లో వారున్నారు. అదేమీ తప్పుకాదు కానీ, 2024 ఎన్నికల ముఖ్యచిత్రంపై ప్రధాని రేసులో నిలుస్తున్న, కృష్ణుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ససేమిరా అంటున్న రాహుల్ గాంధీ మొదలు, పట్టుమని పది మంది ఎంపీలు లేని, తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ వరకు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ , ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇలా ఇప్పటికే ఓ అరడజను మంది వరకు ప్రధాని రేసులో ఉన్నారు. ఇప్పడు,అ జాబితాలో, బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధినేత నితీష్ కుమార్ పేరు కూడా చేరింది. నిన్న మొన్నటి వరకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఎ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ ఈ మధ్యనే కమలానికి కటీఫ్ చెప్పి, ఆర్జేడీ, కాంగ్రెస్ కుతమితో జట్టు కట్టారు. ఇపుడు ఆయన కూడా, ‘పీఎం రేస్ 2024’లో కర్చీఫ్ వేశారు. అందుకే మళ్ళీ ఇప్పడు పౌరాణిక నాటకాల్లో, ఒకే పాత్రను నలుగురైదుగురు వేసినప్పుడు, ఒకటో కృష్ణుడు, రెండవ కృష్ణుడు వచ్చి పోయినట్లుగా, ఇప్పడు ప్రధాని రేసులో మరో కృష్ణుడిగా నితీశ్ రంగ ప్రవేశం చేశారు. అయితే చివరాఖరకు ఉట్టి కొట్టే కృష్ణుడు ఎవరో .. ? ఇదీ అసలు సిసలు భేతాళ ప్రశ్న