YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో టఫ్ ఫైట్ తప్పదంటున్న సర్వేలు

ఏపీలో టఫ్ ఫైట్ తప్పదంటున్న సర్వేలు

విజయవాడ, సెప్టెంబర్ 6, 
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏమవుతుంది?  అధికార వైసీపీ సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. విపక్ష తెలుగుదేశం పార్టీకి సీట్ల సంఖ్య బాగా పెరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన జనసేనకు ఈ సారి నాలుగు నుంచి ఐదు స్థానాలు రావచ్చు. కొన్నిస్థానాలలో తెలుగుదేశం, వైసీపీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంటుంది. పొత్తులు లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ వేరు వేరుగా పోటీ చేస్తే పరిస్థితి ఇది. అలా కాకుండా పొత్తులు పొడిచి పోటీలోకి దిగినా పై ఫలితాలలో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు.శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ తాజాగా శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేలో తేలిన ఫలితమిది..   శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్, 02.06.2022 -03.09.22 మధ్య నిర్వహించిన,  ‘మూడ్ ఆఫ్ ది ఏపీ’  సర్వే ప్రకారం  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం పార్టీ 95 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది, అలాగే వైసీపీ 75 స్థానాలలో గెలుపొందుతుంది. ఇక జనసేప పార్టీకి 5 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. శ్రీ ఆత్మ సాక్షి ( ఎస్ఎఎస్)  గ్రూప్ ఏదో సర్వే చేశాం అంటే చేశాం అన్నట్లు కాకుండా, ఇంచు మించుగా నెలరోజుల వ్యవధిలో మూడు దఫాలుగా, అన్ని వర్గాల ప్రజలను, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను వ్యక్తిగతంగా కలిసి, 43 అంశాలకు సంబంధిచి  సేకరించిన ప్రజాభిప్రాయం అధాంగా శాస్త్రీయంగా నిర్వహించింది. ఓటర్లను విభిన్న ప్రాతిపదికల ఆధారంగా  20 వర్గాలుగా విభజించి ప్రతి నియోజక వర్గంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను ప్రాధాన్యతా క్రమంలో సేకరించి  మరీ నిర్వహించిన సర్వే. నెల రోజుల వ్యవధిలో మూడు దశలుగా నిర్వహించిన ఈ సర్వే ఫలితం వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉందని ఆత్మసాక్షి సర్వే ఒక ప్రకటనలో తెలిపింది. సర్వేలో అత్యధికులు బీజేపీ, తెలుగుదేశం పొత్తు పట్ల అయిష్టత వ్యక్తం చేశారని పేర్కొంది. అదే సమయంలో తెలుగుదేశం, జనసేన పొత్తు పట్ల సుముఖత వ్యక్తం చేశారని సర్వేలో తేలిందని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన 2024 ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటే తాము మద్దతు పలుకుతామని 55శాతం మంది, మద్దతు ఇవ్వబోమని 35శాతం మంది చెప్పగా, సుముఖత, వ్యతిరేకత వ్యక్తం చేయని వారి శాతం 5గా ఉంది. ఇక బీజేపీ, జనసేనలతో తెలుగుదేశం పొత్తు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన వారు 56శాతం మంది కాగా, మద్దతు పలుకుతామని చెప్పిన వారి శాతం 30గా ఉంది. మరో 14శాతం మంది మాత్రం ఏమో తెలియదు అని చెప్పారని శ్రీఆత్మసాక్షి సర్వే పేర్కొంది.ఇక జనసేన, బీజేపీ పొత్తు విషయంలో ఏకంగా 62శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. కేవలం 31 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. అదే పొత్తులు లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ వేరువేరుగా పోటీ చేస్తే వైసీపీకి 43శాతం, తెలుగుదేశంకు 44.5శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందనీ ఇక జనసేనకు అయితే 9శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని సర్వే తేల్చింది. ఇక సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ నిశబ్ద ఓటు (ఎస్వీఎఫ్) 1.5శాతంగా ఉందని పేర్కొంది. గత ఎన్నికలలో పోలిస్తే, వైసీపీ దాదాపు ఏడు శాతం   (6.95 శాతం) ఓట్లను కోల్పోతోంది. 2019 ఎన్నికలలో ఇంచుమించుగా 50 ( 49.95) శాతం ఓట్లు పొందిన వైసీపీ ఓటు షేర్ ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే, 43 శాతానికి పడిపోతుంది. టీడీపీ ఓటు  షేర్, గత ఎన్నికలలో పోలిస్తే 5 శాతానికి పైగా(5.25 శాతం) పుంజుకుని, 39.26 శాతం నుంచి 44.5 శాతానికి చేరుతుందని సర్వే సూచిస్తోంది. అదే విధంగా, జనసేన ఓటు షేర్ కూడా ఇంచుమించుగా రెండు శాతానికి పైగా (2.03 శాతం) వరకు పెరుగుతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.గత ఎన్నికలో 6.7 శాతం ఓట్లు మాత్రమే పోలైన జనసేనకు, ఈసారి 9 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే తేల్చింది. అంటే,సర్వే లెక్కల ప్రకారం చూస్తే, వైసీపే కోల్పోయే ప్రతి ఓటు, నేరుగా టీడీపీ లేదా జనసేన ఖాతాలో చేరుతోంది. అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటర్ల పై బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రభావం దాదాపు శూన్యమని సర్వే చెబుతోంది. మరో వంక 1.5 శాతంగా ఉన్నఎటు పోతుందో తెలియని నిశ్శబ్ద ఓటు ( సైలెంట్ ఓటు ఫ్యాక్టర్, ఎస్ వీఎఫ్) కీలకంగా మారనుందని సర్వే పేర్కొంది.మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి శృంగభంగం తప్పదని శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి విజయం నల్లేరుమీద బండి నడక కాదనీ తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నప్పటికీ కనీసంలో కనీసం 38 స్థానాలలో అధికార, విపక్షాల మధ్యా పోటీ హోరాహోరీగా ఉంటుందని పేర్కొంది.  తెలుగుదేశం 77 స్థానాలలో, వైసీసీ 56 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందనీ, జనసేన నాలుగు స్థానాలలో విజయం సాధించవచ్చనీ సర్వే పేర్కొంది.ఇక ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం  తెలుగుదేశం 6, వైసీపీ 2, విజయనగరం తెలుగుదేశం 4, వైసీపీ 3, విశాఖపట్నం తెలుగుదేశం 6, వైసీపీ 5, తూర్పు గోదావరి తెలుగుదేశం 8, వైసీపీ 4, జనసేన 2, పశ్చిమ గోదావరి తెలుగుదేశం 8, వైసీపీ 3, జనసేన 2 స్థానాలలో విజయం సధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం 7 స్థానాలలోనూ, వైసీపీ నాలుగు స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో అయితే తెలుగుదేశంకు పది స్థానాలలో విజయావకాశాలు మెండుగా ఉంటే, వైసీపీకి నాలుగు స్థానాలలో విజయావకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల పోటీ హోరాహోరీగా ఉంటుందని సర్వే పేర్కొంది. అలాగే ప్రకాశం జిల్లాలోనూ అత్యధిక స్థానాలలో తెలుగుదేశం పార్టీకే విజయావకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 7 స్థనాలలో తెలుగుదేశం, నాలుగు స్థానాలలో వైసీపీ గెలుపొందే చాన్స్ ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైసీపీకి ఒకింత మొగ్గు కనిపిస్తోంది. ఈ జిల్లాలో వైసీపీకి ఐదు చోట్ల విజయం సాధించే అవకాశాలు ఉంటే తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలలో విజయం సాధిస్తుంది. కడపలో తెలుగుదేశం పార్టీ ఒక స్థానంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనీ, వైసీపీ ఐదు స్థానాలలో విజయం సాధిస్తుందనీ పేర్కొన్న సర్వే మిగిలిన నాలుగు స్థానాలలోనూ ఇరు పార్టీల మధ్యా నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ ఉంటుందని పేర్కొంది.కర్నూలులో వైసీపీ, టీడీపీలకు చెరో ఐదు స్థానాలలోనూ విజయావకాశాలు ఉంటే నాలుగు స్థానాలలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందని సర్వే పేర్కొంది. అలాగే చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి 5, వైసీపీకి 6 స్థానాలలో విజయావకాశాలు ఉండగా, మూడు స్థానాలలో పోరు హోరాహోరీగా ఉంటుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలలోనూ వైసీపీకి 6 స్థానాలలోనూ విజయావకాశాలు ఉండగా, ఒక చోట పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. మొత్తానికి ఆత్మసాక్షి సర్వే ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వే తేల్చింది. అదే సమయంలో గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీకి ఓటు షేర్ గణనీయంగా తగ్గిపోతుందనీ, అదే సమయంలో తెలుగుదేశం బలంగా పుంజుకుంటుందనీ తేల్చింది. ఇక బీజేపీ, తెలుగుదేశం పొత్తు విషయంలో ప్రజలలో అంత సానుకూలత లేదనీ సర్వే వెల్లడించింది. మొత్తం మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ విజయానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే పేర్కొంది.

Related Posts