YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ..

జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ..

విజయవాడ, సెప్టెంబర్ 8, 
జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్‌ షా ఎందుకు కలిశారో ఏమో.. అప్పటి నుంచి ఏపీ బీజేపీ నేతలు ఆయన నామస్మరణే చేస్తున్నారు. సందర్భం ఏదైనా సరే.. జూనియర్ పేరునే ప్రస్తావిస్తున్నారు. నిన్నటి వరకు పవన్ కల్యాణ్ పేరును కలవరించే కమలనాథులు ఇప్పుడు జూనియర్ వెంట పడటం ఆసక్తికరంగా మారింది.గత నెల 21న మునుగోడు బహిరంగ సభకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అప్పటి వరకు బీజేపీతో కానీ బీజేపీ నేతలతో కానీ ఎటువంటి సంబంధాలులేని జూనియర్‌ను ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ అమిత్‌ షా కలవడంపై ఇప్పటికీ రకరకాల విశ్లేషణలు నడుస్తూనే ఉన్నాయి. షా ఎందుకు జూనియర్ ను కలిసారన్నది ఇంత వరకు అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. విషయం ఏదైతేనేమి… పొలిటికల్ మైలేజీని పట్టేయడమే ముఖ్యం అనుకున్నట్టున్న నాయకులంతా జూనియర్ జపం చేస్తున్నారు.ఎందుకు కలిసారన్న సంగతి అటుంచితే.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌ మీద ఎక్కడాలేని అభిమానం, ఆప్యాయత, ప్రేమ కురిపిస్తున్నారు. ఇలా చేయడానికి వాళ్లు సమయం సందర్భం కూడా చూసుకోవడం లేదు. విజయవాడలోని ఏపీ బీజేపీ కార్యాలయంలో గురుపూజోత్సవం జరిగింది. అందులో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు పాల్గొన్నారు. గురువుల గొప్పతనాన్ని వివరించడానికి ఆయన ఏం చేశారో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్‌ను, ఆయన నేర్చుకున్న భరతనాట్యాన్ని.. ఆయన బాల నటుడిగా నటించిన బాల రామాయణాన్ని ఉదాహరణగా చెప్పారు వీర్రాజు.రాజమండ్రిలో ప్రెస్‌మీట్‌ పెట్టిన సోము వీర్రాజు అక్కడా జూనియర్ ప్రస్తావన తెచ్చారు. పార్టీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెబుతూనే.. ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించుకుంటామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ చీఫ్‌.సోము వీర్రాజే కాదు… బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా ఇదే లైన్‌లో ఉన్నారు. వీర్రాజు చేసిన కామెంట్స్‌తో విభేదించలేదు.. అవుననీ చెప్పలేదు. కానీ కమలనాథుల శ్రుతి మాత్రం ఒకే ట్యూన్‌లో ఉంది.ఏపీలో బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఏం అన్నా.. బీజేపీ నేతలు ఆయన చుట్టే తిరుగుతూ ఆయన పేరే ప్రస్తావిస్తూ ఉంటారు. ఓట్లు చీలకుండా ఉండాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని పవన్ అంటే… టీడీపీతో కుదరబోదని బీజేపీ నేతలు చెబుతారు. కానీ పవన్‌ను ఏం అనే వాళ్లు కాదు. ఈ మధ్య బీజేపీ నేతల మనసు జూనియర్ ఎన్టీఆర్‌ వైపు మళ్లినట్టుంది. పవన్‌ను వదలిలేసి జూనియర్ ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎన్టీఆర్ మనసులో ఏం ఉందో ఏమో.. ఏపీ బీజేపీ నాయకులు మాత్రం ఆయన్ను.. ఆయన పేరును వాడేస్తున్నారు.
ఇక నితిన్ కాదు నిఖిల్
మరో వైపు తెలంగాణ బీజేపీ నేతలు పొరపాటు పడ్డారా? సినిమా హీరోల విషయంలో తడబడ్డారా? అంటే బీజేపీలో ఇదే ప్రచారం జరుగుతుంది. నిఖిల్ కి బదులు నితిన్ ను ఆహ్వానించారన్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బీజేపీలో ఈ అంశం పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఆ కార్కక్రమం ముగియకుండానే వరంగల్ నుంచి నేరుగా బయలు దేరి హైదరాబాద్ నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు.ఆయన నితిన్ ను కలుస్తారని ముందుగానే వార్తలు వచ్చాయి. ఆ ప్రకారమే సినీ హీరో నితిన్ జేపీ నడ్డాను కలిశారు. కాసేపు ముచ్చటించి వెళ్లిపోయారు. నితిన్ తాను పార్టీ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ జేపీ నడ్డా కలవాలనుకుంది నితిన్ ను కాదట. కార్తికేయ 2 హీరో నిఖిల్ ని అట. కార్తికేయ 2 సినిమా బాలివుడ్ లోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆయనను కలవాలని జేపీ నడ్డా భావించారంటున్నారు. ఆయన పొరపాటున బీజేపీ నేతలకు నిఖిల్ కు బదులు నితిన్ పిలవాలని అనడంతోనే ఈ తప్పిదం జరిగిందంటున్నారు. అయితే పేరులో కన్ఫ్యూజన్ అయిన బీజేపీ నేతలు నిఖిల్ ను బదులు నితిన్ ను పిలిచారంటున్నారు. తెలంగాణలో హీరో నిఖిల్ ఫేమస్ కావడంతో ఆయననే కలవాలనుకుంటున్నారని భావించి బీజేపీ నేతలు పిలిచారట. కానీ వాస్తవానికి జేపీ నడ్డా కలవాలనుకున్నది మరో హీరో నిఖిల్ ని అని అంటున్నారు. నిఖిల్ కు, నితిన్ కు తేడా తెలియని బీజేపీ నేతలు నితిన్ ను పిలిచారన్న టాక్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది.

Related Posts