YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అధికార పార్టీలో రాజకీయ సెగలు

అధికార పార్టీలో రాజకీయ సెగలు

ఒంగోలు, సెప్టెంబర్ 8, 
అధికారపార్టీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఇంటిపోరు మొదలైందా? మొన్నటి వరకు ద్వితీయశ్రేణి నేతలతో పొసగలేదా? టికెట్‌ ఆశిస్తున్న మరో నాయకుడి తీరు టెన్షన్‌ పెడుతోందా? ఎమ్మెల్యేకు పోటీగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారా? పార్టీ కొత్త బాధ్యతలు అప్పగించినా ఎమ్మెల్యేకు నిద్ర కరువైందా?బుర్రా మధుసూదన్‌ యాదవ్‌. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే. ఇదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత సత్యనారాయణరెడ్డి.. ప్రస్తుతం రెడ్డి కార్పొరేషన్‌ ఛైర్మన్‌. ఈ ఇద్దరు అధికార పార్టీ నాయకుల మధ్యే రాజకీయం వేడి సెగలు రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని మధుసూదన్‌ యాదవ్‌ చూస్తుంటే.. ఈ దఫా లోకల్‌ లీడర్‌కే ఛాన్స్‌ ఇవ్వాలని సత్యానారాయణరెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. దీంతో వైసీపీ శిబిరంలో కొత్త సమీకరణాలు.. పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయంపై ఆసక్తి పెరుగుతోంది. బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ 2014లోనూ ఇదే కనిగిరిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వాస్తవానికి ఆయన సొంతూరు కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలంలో ఉంది. ఈ అంశాన్నే సొంతపార్టీలోని ఎమ్మెల్యే వైరివర్గం చర్చకు పెడుతోంది. లోకల్‌.. నాన్‌ లోకల్‌ అని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోంది. ఈ వర్గపోరు రెండు శిబిరాల మధ్య కొత్త పుంతలు తొక్కుతోంది కూడా. ప్రస్తుతం గణేష్‌ నవరాత్రి వేడుకలు వీరి మధ్య రాజకీయ వేడుకలుగా మారిపోయాయి. ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌తోపాటు సత్యనారాయణరెడ్డి కూడా పోటాపోటీగా ఉత్సవాలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఓపెన్‌గానే కామెంట్స్‌ చేస్తున్నారట సత్యనారాయణరెడ్డి.ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్నారు. TTD బోర్డు సభ్యుడు కూడా. అధిష్ఠానం దృష్టిలో ఉన్నప్పటికీ.. కనిగిరి వైసీపీలో క్రమేపీ పెరుగుతున్న వ్యతిరేకతే కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదట్లో సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన సామాజికవర్గానికి చెందిన ఓ జడ్పీటీసీ కొందరితో కలిసి వేరు కుంపటి పెట్టుకున్నారు. జిల్లా వైసీపీ నేతలతో టచ్‌లో ఉండి ఆ జడ్పీటీసీ కనిగిరిలో రాజకీయాలు చేస్తున్నారట. ఇప్పుడు రెడ్డి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సత్యనారాయణరెడ్డి వంతు వచ్చింది. ఆయన మాత్రం లోకల్‌ నినాదాన్ని గట్టిగా నమ్ముకున్నారు. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలు, శ్రేణులతో టచ్‌లోకి వెళ్తున్నారట.తనకు మద్దతిచ్చే పార్టీ నేతలతో కలిసి కనిగిరిలో సత్యనారాయణరెడ్డి పర్యటనలు చేయడం వైసీపీలో చర్చగా మారింది. నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన వినాయక మండపాల నుంచి ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌కు, సత్యనారాయణరెడ్డికి ఆహ్వానాలు వెళ్లాయట. ఆ పిలుపులు అందుకుని.. మందీమార్బలంతో మండపాల దగ్గరకు వెళ్తున్నారు. పోటాపోటీగా నినాదాలు హోరెత్తిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కనిగిరి వైసీపీ టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే దక్కుతుందో.. లోకల్‌ నినాదం వర్కవుట్ అయ్యి సత్యనారాయణరెడ్డికి ఛాన్స్‌ ఇస్తారో కానీ.. స్థానిక రాజకీయం మాత్రం సెగలు రేపుతోంది. పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు బుర్రకు బుర్రా పదును పెడతారో లేదో అనే చర్చ ఉంది. మరి కనిగిరి వైసీపీలో ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts