YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ 25 మంది లెక్కేంటీ

ఆ 25 మంది లెక్కేంటీ

విజయవాడ, సెప్టెంబర్ 10, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిపై సమీక్ష చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయన తనకున్న ప్రత్యేక మార్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఇక ఎటూ ఐ ప్యాక్ సర్వే ఉండనే ఉంది. తాజాగా లెక్కల ప్రకారం 25 మంది ఎమ్మెల్యేలకు గండం పొంచి ఉందని సమాచారం. 25 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవడం కష్టమని సర్వేల్లో తేలింది. వీరిలో ఎక్కువ మంది తొలిసారి గెలిచిన వారేనని తెలుస్తోంది. వీరి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాని కారణంగా ప్రజలు పార్టీ వైపు మొగ్గు చూపడం లేదని తెలిసింది. నిన్న మొన్నటి వరకూ యాభై మంది వరకూ ఎమ్మెల్యేలు కష్టకాలంలో ఉన్నారని జగన్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. వీరంతా తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని కోరారు. పనితీరు మెరుగుపర్చుకోకుంటే తాను టిక్కెట్ ఇవ్వనని కూడా ఖరాఖండీగా ఆ సమావేశంలో చెప్పారు. అప్పుడే వారికి వార్నింగ్ ఇచ్చారు. కొన్ని పేర్లను కూడా బయటకు చెప్పారు. తన వద్ద సర్వే నివేదిక ఉందని ఆయన చెప్పడంతో వర్క్ షాప్ కు హాజరైన ఎమ్మెల్యేలు షాక్ కు గురయ్యారు. పనితీరు మార్చుకోవడానికి ఆరు నెలల సమయం ఇచ్చారు. అయితే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పుంజుకున్నట్లు జగన్ కు అందిన తాజా సమాచారం మేరకు తేలింది. 25 మంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపర్చుకోవడంతో వారి గ్రాఫ్ నియోజకవర్గాల్లో గ్రాఫ్ పెరిగింది. దీంతో వారు గండం నుంచి తప్పించుకున్నారని తెలిసింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో ఈ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకున్నారని జగన్ కు అందిన సర్వేల ద్వారా తేలింది. మిగిలిన 25 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నారని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. వైసీపీ అధినేతగా జగన్ కేవలం ఐ ప్యాక్ సంస్థ ఇచ్చే సర్వే నివేదికలపై ఆధారపడటం లేదు. ప్రతి నియోజకవర్గంలో జగన్ తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకున్నారు. వారు ఏ పదవుల్లోనూ ఉండరు. జగన్ కు ఎప్పటికప్పుడు నియోజకవర్గం గురించి నివేదికలు అందివ్వడమే వారి పని. దీంతో పాటు ముఖ్య కార్యకర్తల సమావేశాలు జగన్ వరసగా జరుపుతున్నారు. ఇప్పటికే కుప్పం, రాజాం నియోజకవర్గాల సమీక్షను చేశారు. కుప్పంలో భరత్ ను క్యాండిడేట్ గా ఇప్పటికే ప్రకటించారు. అంటే కొంత ఇబ్బంది ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మాత్రం జగన్ ఫైనల్ వార్నింగ్ ఇవ్వనున్నారని తెలిసింది. అప్పటికీ వారు తమ పనితీరు మార్చుకోకుంటే టిక్కెట్ ఇవ్వకూడదన్నది జగన్ నిర్ణయంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts