నెల్లూరు, సెప్టెంబర్ 10,
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఉప రాష్ట్రపతి పదవి నుంచి విరమించుకున్న తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టేది లేదని ప్రకటించిన వెంకయ్య ఇప్పుడు తన అభిమానుల కోసం జిల్లాల్లో పర్యటిస్తూ తన పాత మిత్రులను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా ఆయనకు సన్మాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా ఆయన రాజమండ్రిలో జరిగిన సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు.రాజకీయాల నుంచి దూరమవ్వాల్సి రావడం తనను తీవ్రంగా బాధించిందని, చిన్నప్పుడే కన్నతల్లికి దూరమైన తనను కన్నతల్లి లాంటి పార్టీ ఉన్నతస్థానానికి తీసుకువెళ్లిందని రాజమండ్రిలో జరిగిన సమావేశంలో వెంకయ్య వ్యాఖ్యానించారు. తాజాగా ఆయనకు గుంటూరులో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
ప్రజల మధ్య ఉండి పనిచేయడమంటే తనకు ఎంతో ఇష్టమని, ఉప రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే ఆంక్షలన్నీ పక్కనపెట్టి దేశం మొత్తం పర్యటించానని గుంటూరు సమావేశంలో వెంకయ్య అన్నారు. పత్రికలు, వైద్యం, విద్య తదితర విభాగాలన్నీ ఒక మిషన్ కోసం నడిచేవని, ఇప్పుడు మాత్రం కమీషన్ కోసం నడుస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చట్టసభల్లో ఉండేవారు తమ భాషను హుందాగా ఉపయోగించాలని, దుర్భాషలాడటంకానీ, ఇతరత్రా పదాలు కానీ వాడొద్దని సూచించారు. తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ చట్టసభల స్థాయిని తగ్గించడం మంచిది కాదని హితవు పలికారు. దేశంలో ఏం జరుగుతోంది అనే విషయమై ప్రపంచమంతా మనవైపే చూస్తోందనే విషయాన్ని గుర్తెరిగి మరింత బాధ్యతగా ఉండాలన్నారు.దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని గాంధీజీ ముందుకు నడిపించినా చాలామంది పోరాట యోధులకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని వెంకయ్య అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి కర్తవ్యపథ్‌ను ప్రారంభించడంతోపాటు నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారనే విషయాన్ని గుర్తుచేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో మిగతావారి పాత్ర కూడా తక్కువేం కాదన్నారు. మాతృభాషను మృతభాషగా చేయవద్దని, మొదటి ప్రాధాన్యం మాతృభాషకే ఇవ్వాలని, పరిపాలన కూడా తెలుగులోనే ఉండాలన్నారు. మాతృభాషలో చదివినవారు ఉన్నతస్థాయికి ఎదుగుతున్నారని, ఇంగ్లిషు, హిందీతోపాటు ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని సూచించారు.జనంతో కలిసి ఉండాలనే తపన వెంకయ్య నాయుడికి తీరినట్లు లేదని, ఉప రాష్ట్రపతి పదవి నుంచి విరమించిన తర్వాత కూడా సభలు, సమావేశాలు జరుగుతుండటంపై ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రియాశీల రాజకీయాలను నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత మళ్లీ ఇవేంటని చర్చించుకుంటున్నారు. విజయవాడలో జరిగే సమావేశంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. వెంకయ్యనాయుడికి రాష్ట్ర పతి పదవి దక్కుతుందని తెలుగువారు భావించినా ఆయన ఉప రాష్ట్రపతి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకు ఇష్టం లేకపోయినా ఆ పదవిని పార్టీకోసం చేపట్టిన సంగతి తెలిసిందే.