విజయవాడ, సెప్టెంబర్ 12,
టీడీపీ వ్యవస్థాపకుడు, తన కన్న తండ్రి, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీకి ఆయన కుమార్తె, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి దగ్గర అవుతారనే చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతోంది. ఎన్నికల్లో గెలవడమే ముఖ్యం. అది బీజేపీ లక్ష్యం. ఎవరికైనా కొన్నాళ్లు సమయం ఇస్తుంది. వారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తే క్షణం కూడా ఆలోచించదు. వెంటనే చర్యలకు దిగుతుంది. ఇప్పుడు పురంద్రీశ్వరి పరిస్థితి కూడా అంతే. పురంద్రీశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆమెకు రాజ్యసభ పదవి ఇస్తారనుకున్నారు. కానీ ఉన్న పదవుల నుంచి తప్పించడం అవమానకరమే. ఆమెకు గత ఏడాది ఛత్తీస్‌ఘడ్, ఒడిశా ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు. అయితే ఒడిశా బాధ్యతల నుంచి తప్పించిన అధినాయకత్వం తాజాగా ఛత్తీస్‌ఘడ్ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించడం చర్చనీయాంశంగా మారింది.ఛత్తీస్‌ఘడ్ కు రాజస్థాన్ కు చెందిన ఓం మాధర్ ను అధిష్టానం ఇన్‌ఛార్జిగా నియమించింది. పురంద్రీశ్వరి తాము అనుకున్నట్లు పనితీరును ప్రదర్శించడం లేదన్న అభిప్రాయం అధినాయకత్వంలో వ్యక్తమవుతుంది. వచ్చే ఏడాది ఛత్తీస్‌ఘడ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇన్‌ఛార్జిని మార్చడం పార్టీ నాయకత్వానికి అనివార్యమయింది. అక్కడ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలంటే పురంద్రీశ్వరి తో సాధ్యం కాదని అధిానాయకత్వం భావించింది. అందుకే ఆమెను తప్పించి ఓం మాధుర్ ను నియమించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ప్రాధాన్యం తగ్గుతోందనే అభిప్రారం వ్యక్తం అవుతోంది. ఎన్టీఆర్ వారసురాలిగా యూపీఏ ప్రభుత్వంలో పురందేశ్వరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఒకసారి ఆమెకు యూపీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రిగా సముచిత స్థానం ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత పురందేశ్వరి బీజేపీలో చేరారు. బీజేపీ అధిష్టానం కూడా పురందేశ్వరికి ఒకింత ప్రాధాన్యత ఇచ్చిందనే చెప్పాలి. ఎనిమిదేళ్లుగా బీజేపీలోనే ఆమె కొనసాగుతున్నారు.కానీ.. కొన్ని నెలలుగా పురందేశ్వరి కుటుంబంలోనూ, రాజకీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆమె తండ్రి స్థాపించిన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పకపోయినా.. తన ఏకైక కుమారుడు చెంచురాం హితేష్ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంటుకుని ఆమె తెలుగుదేవం గూటికి చేరాలన్న యోచనలో ఉన్నారని ఆమె సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో ఆమె తన కుమారుడి రాజకీయ ప్రవేశం తెలుగుదేశం పార్టీ ద్వారా జరగాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. తన ఏకైక కుమారుడి కోసం పురందేశ్వరి సమీప భవిష్యత్తులో ఎలాంటి కీలక నిర్ణయమైనా తీసుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం.. పురందేశ్వరికి పార్టీలో ప్రాధాన్యం తగ్గించినట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం పురందేశ్వరిని ఒడిశా పార్టీ బాధ్యతల నుంచి తప్పించిన బీజేపీ అధిష్టానం తాజాగా ఛత్తీస్ గఢ్ పార్టీ ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి కూడా ఉద్వాసన పలికిందంటున్నారు.ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబుతో కొన్నేళ్లుగా రాజకీయంగా విభేదించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు- పురందేశ్వరి కొద్ది రోజులుగా కుటుంబంలో జరిగిన పరిణామాల్లో దగ్గరయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు చంద్రబాబు దంపతులు వెళ్లి పరామర్శించారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కుమార్తె ఎంగేజ్ మెంట్ సందర్భంగా తోడల్లుళ్లు చంద్రబాబు- వెంకటేశ్వరరావు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. అంతే కాకుండా కాసేపు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వెంకటేశ్వరరావు- పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణించినప్పుడు కూడా చంద్రబాబు, దగ్గుబాటి దగ్గరుండి అన్ని కార్యక్రమాలూ నిర్వహించారు. ఇలాంటి సందర్భాల్లో దగ్గుబాటి- నారా కుటుంబాల మధ్య మళ్లీ సఖ్యత ఏర్పడిందనే అంచనాలు వస్తున్నాయి. పురందేశ్వరి బీజేపీ వ్యవహారాలకు గతంలోలా పెద్ద ప్రాధాన్యం చూపించడం లేదనే అంచనాకు ఆ పార్టీ అధిష్టానం వచ్చిందనే వ్యాఖ్యలు బీజేపీ వర్గాల నుంచి వస్తున్నాయి. దాంతో పాటు బీజేపీ అధినాయకత్వం పట్ల పురందేశ్వరి కూడా అసంతృప్తితో ఉన్నారంటున్నారు. నిజానికి పురందేశ్వరి సమర్థతను గుర్తించిన బీజేపీ హైకమాండ్ ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించింది. పురందేశ్వరి అధ్యక్షతన ‘ఏపీలో విస్తృత చేరికల కమిటీ’ ఏర్పాటు చేసినా ఫలితం లేదనే అభిప్రాయం బీజేపీ ముఖ్య నేతల్లో ఉందనే వాదన కూడా వస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా బీజేపీలో ప్రాధాన్యం ఇచ్చినా.. పార్టీకి మేలు జరిగేలా ఆమె వ్యవహరించలేకపోతున్నారనే అనుమానం బీజేపీ వర్గాల్లో ఉందంటున్నారు. వలసల కమిటీ చైర్మన్ గా పురందేశ్వరి తన తండ్రి స్థాపించిన పార్టీ టీడీపీ నుంచి ఒక్క నాయకుడిని కూడా బీజేపీ వైపు తీసుకురాలేకపోయారనే అసంతృప్తి హై కమాండ్ లో ఉందంటున్నారు. ఎన్టీఆర్ కుమార్తె అయినా.. కేంద్ర మంత్రిగా సమర్థంగా పనిచేసినట్లు రుజువు చేసుకున్నా.. పురందేశ్వరికి తగిన ప్రాధాన్యం బీజేపీలో దక్కలేదనేది ఆమెతో పాటు ఆమె అనుచరులు కూడా చెబుతున్నారు. ఏపీ నుంచి రాజ్యసభ సీటు కూడా పురందేశ్వరికి ఇవ్వలేదు. మొత్తం మీద అటు బీజేపీ అధిష్టానం, ఇటు పురందేశ్వరి మధ్య గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలో ఆమె రాజకీయ భవిష్యత్తుపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పురందేశ్వరి తన తండ్రి స్థాపించిన పార్టీ టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి. ఈ క్రమంలో పురందేశ్వరి బీజేపీకి ఝలక్ ఇస్తారా? టీడీపీ వైపు అడుగులు వేస్తారా? అనేది త్వరలో తేలిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.