విజయవాడ, సెప్టెంబర్ 12,
సీఎం జగన్ మరో సారి తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారా? ఇటీవల కేబినెట్ సమావేశం అనంతరం ఆయన కొందరు మంత్రులను ఉద్దేశించిన నేరుగా, మరి కొందరిపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు, వ్యక్తం చేసిన ఆగ్రహం, మంత్రి పదవులు పీకేస్తా జాగ్రత్త అంటూ చేసిన హెచ్చరికలను బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తుంది.ఆయన హెచ్చరికల అనంతరం కూడా కేబినెట్ మంత్రులలో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో మంత్రివర్గాన్ని మరో సారి పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. మోస్ట్లీ నవంబర్ లో జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతారనీ, ప్రస్తుత కేబినెట్ లో కనీసం అరడజను మందికి ఉద్వాసన తప్పదనీ కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా సుదీర్ఘ ఎదురు చూపుల అనంతరం గత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పర్యాటక శాఖ మంత్రి పదవి దక్కిన రోజాకు తదుపరి పునర్వ్యవస్థీకరణలో అంటే నవంబర్ లో ఆమె పదవికి ఎసరు వచ్చే అవకాశం ఉందనీ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. మరో మహిళా మంత్రి విడదల రజనికి కూడా ఉద్వాసన తప్పకపోవచ్చునని అంటున్నారు. రోజాపై జిల్లాలోనే కాకుండా, మంత్రి పదవి చేపట్టిన తరువాత ఆమె వ్యవహారశైలిపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తారనీ, ఇక మరో మహిళా మంత్రి విడదల రజనీ అయితే సామాజిక మాధ్యమంలో సొంత ప్రచారంపై పెడుతున్న శ్రద్ధ, పార్టీ వ్యవహారాలలోనూ, విపక్ష విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలోనూ చూపడం లేదన్నది జగన్ భావనగా చెబుతున్నాయి. అందుకే జగన్ ఆరు నెలల వ్యవధిలోనే తన మంత్రివర్గాన్ని మరో సారి పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయానికి వచ్చారంటున్నారు.ఆరు నెలల కిందట జగన్ కొత్త టీమ్ ను ఎంపిక చేసిన సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి. 2019 ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేబినెట్ కూర్పు చేసిన సందర్భంగా ఈ కేబినెట్ ను రెండున్నర సంవత్సరాలు మాత్రమేననీ, రెండున్నర సంవత్సరాల అనంతరం కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకుంటాననీ జగన్ విస్పష్టంగా చెప్పారు. అన్నట్లుగా సరిగ్గా రెండున్నర సంవత్సరాలకే కాకుండా మూడేళ్లు కావస్తుండగా జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. అయితే ఆయన ముందుగా చెప్పిన విధంగా మొత్తం కేబినెట్ ను మార్చేయలేదు.కొందరు పాతవారిని కొనసాగిస్తూ కొందరిని తప్పించి కొత్తవారికి స్థానం కల్పించారు. ఈ కారణంగానే ఉద్వాసనకు గురైన మంత్రులలో అసంతృప్తి భగ్గు మందికొందరు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరి కొందరు మౌనం దాల్చి తన నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తంగా జగన్ 2.0 టీమ్ లో గట్టిగా మాట్లాడేవారు కానీ, విపక్ష విమర్శలను దీటుగా ఎదుర్కొనేవారు కానీ లేరన్న భావన సీఎం జగన్ లోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే జగన్ సతీమణి భారతిపై ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భంగా కేబినెట్ సహచరులే కాదు.. పార్టీలో ఎవరూ కూడా దీటుగా స్పందించకపోవడంతో జగన్ లో అసహనం కట్టలు తెంచుకుందంటున్నారు.ఆ కారణంగానే కేబినెట్ సహచరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మరోసారి మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించి నోరున్న మంత్రులకు చోటు కల్పించాలన్న నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనివార్యమని నిర్ధారణ అయిన తరువాతనే కొడాలి నాని మళ్లీ తన గొంతు సవరించుకున్నారనీ, చంద్రబాబుపై, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పూర్వంలా పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి మంత్రివర్గంలో పదవి కోల్పోయిన కొడాలి నానికి మలి పునర్వ్యవస్థీకరణలో పదవి గ్యారంటీ అని పరిశీలకులు అంటున్నారు.