విజయవాడ, సెప్టెంబర్ 13,
అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రభుత్వం తన కసరత్తు ప్రారంభించింది. పూలింగ్ గ్రామాలతో పాటు మూడు నాన్ పూలింగ్ గ్రామాలను కూడా కొత్తగా ఏర్పాటు చేసే అమరావతి మున్సిపాల్టీలో కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా గ్రామ సభలు నిర్వహించి.. ప్రజాభిప్రాయాన్ని స్వీకరించే ప్రక్రియకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అయితే తొలి రోజు జరిగిన మూడు గ్రామసభల్లోనూ ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకతే ఎదురైంది.అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పోరేషన్ పేరుతో కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ భావించింది. అప్పట్లో రాజధాని పరిధిలోని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తే.. వాటిల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ క్రమంలో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. మంగళగిరి పరిధిలోని ఓ మూడు గ్రామాలను విలీనం చేసుకుని తాడేపల్లి-మంగళగిరి మున్సిపాల్టీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాజాగా అమరావతి మున్సిపాల్టీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలో సీఆర్డీఏ పరిధిలోని పరిధిలోని తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామాలతో అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఈ 22 గ్రామాల్లో మూడు నాన్ పులింగ్ గ్రామాలు కూడా ఉన్నాయి. హరిశ్చంద్రపురం, వడ్లమాను, పెద పరిమి గ్రామాలను కూడా కలుపుకుని అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటు చేయాలనుకుంది. ఇందులో 19 గ్రామాలు తుళ్లూరు పరిధిలోకి వస్తే.. మిగిలిన మూడు గ్రామాలు మంగళగిరి పరిధిలోకి వస్తాయి.ఈ క్రమంలో సదురు గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు ప్రభుత్వం విడతలవారీగా గ్రామ సభలు నిర్వహించ తలపెట్టింది. దీంట్లో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు గ్రామ సభలను నిర్వహించాలని భావించింది. దానికి అనుగుణంగా సోమవారం లింగాయపాలెం, ఉద్దండరాయుని పాలెం, హరిశ్చంద్రపురం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించింది. ఈ మూడు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో ప్రభుత్వ ప్రతిపాదనకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. లింగాయపాలెం గ్రామంలో మొత్తం 79 మంది గ్రామసభకు హాజరవ్వగా.. ఒక్కరు మినహా మిగిలిన వారంత ప్రభుత్వ ప్రతిపాదిత అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఇక మిగిలిన రెండు గ్రామాలు ఉద్దండరాయుని పాలెం, హరిశ్చంద్రపురంలలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ తీర్మానం చేశారు. వీటిల్లో ఉద్దండరాయుని పాలెం బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సొంత గ్రామం కావడం గమనార్హం. అలాగే నాన్ పూలింగ్ గ్రామంగా ఉన్న హరిశ్చంద్రపురంలో కూడా ప్రభుత్వ ప్రతిపాదనను గ్రామస్తులు వ్యతిరేకించారు.ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని.. రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదని.. ఇచ్చిన పట్టాలు ఎందుకు పనికి రాకుండా ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో అప్పు తీసుకునేందుకు కూడా వీలు లేని విధంగా రిటర్నబుల్ ప్లాట్ల పట్టాలు ఉన్నాయని మండిపడ్డారు. అలాగే జగన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి అసైన్డ్ భూములకు సంబంధించిన కౌలు అందలేదని అధికారుల వద్ద ప్రస్తావించారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు కౌలు అందక.. ఇటు వ్యవసాయం చేసుకోలేక.. రాజధాని ప్రాంత రైతులు.. రైతు కూలీలు నానా తిప్పులు పడుతున్నారన్నారు. ఈ సమయంలో మున్సిపాల్టీలో విలీనానికి అంగీకరిస్తే.. నరేగా పనులు కూడా అందవని.. ఈ పరిస్థితుల్లో తాము విలీనానికి అంగీకరించేదే లేదని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేశాక.. ఆ తర్వాత 29 గ్రామాలతో కూడిన మున్సిపాల్టీకి మాత్రమే తాము అంగీకరిస్తామని గ్రామస్తులు తెగేసి చెప్పారుఇక నాన్ పూలింగ్ గ్రామమైన హరిశ్చంద్రపురం కూడా దాదాపు ఇదే తరహా స్పందించింది. 29 గ్రామాలతో కూడిన మున్సిపాల్టీని ఏర్పాటు చేస్తే.. అప్పుడు ఏర్పడే అర్బన్ లోకల్ బాడీలో తాము విలీనం కావడానికి సిద్దమని హరిశ్చంద్రపురం గ్రామస్తులు అధికారులకు చెప్పారు. ఇవే విషయాలను నోట్ చేసుకున్న అధికారులు.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తొలి రోజు నిర్వహించిన గ్రామ సభలు సజావుగానే సాగాయి. ఇక రెండో రోజు దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజు పాలెం గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించనున్నారు.