నెల్లూరు, సెప్టెంబర్ 13,
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో అంతగా పరిచయం అక్కర్లేని పేరు.ఉమ్మడి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే. గత కొంత కాలంగా ఆయన వైసీసీ కార్యక్రమాలలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. జగన్ కేబినెట్ లో చోటు లభించలేదన్న అసంతృప్తే అందుకు కారణమని వైసీపీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరాఖరికి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి చేతులు కాల్చుకున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తూతూ మంత్రంగానే పాల్గొన్నారు. వైఎస్ మరణం తర్వాత... జగన్ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి సొంతంగా ... వైసీపీని స్థాపించిన సమయంలో నెల్లూరు జిల్లా నుంచి జగన్ పార్టీలో చేరిన తొలి నేతనల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. దాంతో జగన్ ఆయనకు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. అయితే తరువాత ఆ బాధ్యతల నుంచి ప్రసన్నకుమార్ రెడ్డిని తప్పించి కాకాణి గోవర్థన్ రెడ్డికి అప్పగించారు. సరే ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ తొలి కేబినెట్ లో స్థానం ఆశించారు. కానీ భంగపడ్డారు. ఆ భంగపాటును ఎలాగోలా ఓర్చుకున్నా మూడేళ్ల తరువాత జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా తనకు మంత్రిపదవి దక్కకపోవడంతో నొచ్చుకున్నారు. తనకు మంత్రి పదవి దక్కక పోవడం కంటే జిల్లాలో తన కంటే జూనియర్లు.. సబ్ జూనియర్లు అయిన.. మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లకు తొలి కేబినెట్‌లో చోటు దక్కడం.. అలాగే కాకాణి గోవర్థన్ రెడ్డికి జగన్ మలి కేబినెట్‌లో బెర్త్ కేటాయించడం ప్రసన్న కుమార్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని పార్టీ శ్రేణులే చెబుతుంటాయి.ఆ అసంతృప్తి కారణంగానే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతుంటాయి. అయితే హఠాత్తుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్క సారిగా జగన్ ను ఆకాసానికి ఎత్తేస్తున్న చందంగా ప్రశంసల వర్షం కురిపించారు. ఏకంగా సీఎం జగన్ ది ప్రధాన మంత్రి స్థాయి అని పొగిడేశారు. రాష్ట్ర ప్రజలు ఆయనే మరో సారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటూ చేసిన ప్రకటన పార్టీ శ్రేణులనే నివ్వెర పరిచింది. ఇంత కాలం పార్టీలో అసమ్మతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హఠాత్తుగా యూటర్న్ తీసుకుని జగన్ పై పొగడ్తల వర్షం కురిపించడమేమిటా అని ఆశ్చర్య పోయారు. కాగా ప్రసన్న కుమార్ రెడ్డి హఠాత్తుగా జగన్ మీద ప్రశంసల వర్షం కురిపించడానికి ఆయన త్వరలో మరోసారి తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయం తీసుకోవడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డి తూతూ మంత్రంగా పాల్గొనడంపై తాడేపల్లి ప్యాలెస్ నుంచి గట్టిగానే మందలింపులు అందినా కూడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆసక్తి చూపని ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా జగన్ పై ఎక్కడ లేని అభిమానాన్నీ ఒలకబొస్తూ పొగడ్తల వర్షం కురిపించడానికి కారణం ఆయనలో చిగురించిన మంత్రి పదవి ఆశేనని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల కేబినెట్ సమావేశం సందర్భంగా సీఎం జగన్ మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. పార్టీపైనా, తన కుటుంబంపైనా ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు ఆరోపణలు సంధిస్తున్నా మంత్రులు స్పందించడంలేదని జగన్ ఫైర్ అయ్యారు. తన తొలి కేబినెట్‌లో మంత్రులు చలాకీగా ఉండేవారని చెబుతూ, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్లు ప్రస్తావించారు. అదే సందర్భంగాఇప్పటికైనా మంత్రులు తీరు మార్చుకోకుంటే పదవులు పీకేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అదిగో ఆ హెచ్చరికతోనే రాష్ట్రంలో జగన్ తన కెబినెట్ ను మరో సారి పునర్వ్యవస్థీకరిస్తారనే టాక్ జోరందుకుంది. ఈ నేపథ్యలోనే ప్రసన్నకుమార్ రెడ్డి యాక్టివ్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రి పదవిపై ఆశ ప్రసన్న కుమార్ రెడ్డిలోని అసంతృప్తిని మింగేసిందని అంటున్నారు.