విజయవాడ సెప్టెంబర్ 13,
వైసీపీలో అసంతృప్తి నేతల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఎంత సేపూ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే కారణమని చెబుతూ ఉండటం, వచ్చే ఎన్నికలలో ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలకు పార్టీ టికెట్లు ఇచ్చేది లేదని ప్రకటనలు చేస్తుండటంతో ఎమ్మెల్యేలు, నాయకులలో అసంతృప్తి గూడు కట్టుకుంటున్నది. ప్రభుత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న వాస్తవాన్ని గ్రహించకుండా ఎంత సేపూ తమనే ప్రజల ముందు పని చేయని నేతలుగా నిలబెట్టడం పట్ల వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది.ఈ నేపథ్యంలోనే వారు పక్క చూపులు చూస్తున్నారని పార్టీ శ్రేణులే బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్న పరిస్థితి ఏదో ఒకటి రెండు నియోజకవర్గాలకే పరిమితం కాలేదనీ, రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉందనీ చెబుతున్నారు. తాజాగా కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ నేత, గత రెండు ఎన్నికలలోనూ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన బొంతు రాజేశ్వరరావు జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి.పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యుఎస్ మాజీ సలహాదారు అయిన బొంతు రాజేశ్వరరావు హైదరాబాద్ లో జనసేన కార్యాలయానికి వెళ్లి మరీ పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోవడం ఖాయమని వైసీపీ, జనసేన వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒక్క బొంతు రాజేశ్వరరావు అనే కాకుండా వైసీపీపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేతలు పలువురు జనసేన వైపు చూస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితి దాదాపు ఏపీ వ్యాప్తంగా ఉందంటున్నారు. అసలు వైసీపీ అసంతృప్తులు మొదటిగా తెలుగుదేశం వైపే చూడాల్సి ఉన్నప్పటికీ, ఇంత కాలం ఆ పార్టీపై, ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆ పార్టీలో తమకు సముచిత స్థానం లభిస్తుందా అన్న అనుమానం వారిలో ఉండటంతోనే జనసేన వైపు చూస్తున్నరని కూడా అంటున్నారు.అదీ కాక తెలుగుదేశం పార్టీలో చేరినా, ఆ పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్న నాయకులను కాదని తమకు చాన్స్ రాదన్న అనుమానం కూడా వారిని జనసేన వైపు చూసేలా చేస్తోందని అంటున్నారు. ఇటీవలి కాలంలో జనసేనలోకి చేరికలు ఎక్కువగా వైసీపీ నుంచే ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. గుడివాడ నుంచి కొడాలి నాని సన్నిహితులుగా పేరు పడిన పాలంకి బ్రదర్స్ ,. తాజాగా రాజోలు నియోజకవర్గం నుంచి గత రెండు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు జనసేన గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివరామిరెడ్డి అనే వైసీపీ నేత కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి చెందిన మరి కొందరు నేతలకు కూడా జనసేనతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.