కాకినాడ, సెప్టెంబర్ 13,
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో వైసీపీ సీటుకోసం ఫైట్ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. సీటు మీద కన్నేసిన ఆ మాజీ ఎమ్మెల్యేనే అసమ్మతి గ్యాంగ్ వెనుక ఉండి నడిపిపిస్తున్నారని నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్.ప్రత్తిపాడు వైసిపి ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ 2019లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. పార్టీలు ఏవైనా ఇక్కడ పర్వత, వరుపుల, ముద్రగడ ఫ్యామిలీలే విజయం సాధిస్తూ ఉంటాయి. ముందు నుంచి పర్వత ఫ్యామిలీ టిడిపిలో ఉండేది. ప్రస్తుత ఎమ్మెల్యే చిన్నాన్న పర్వత చిట్టిబాబు గతంలో టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున వరుపుల సుబ్బారావు, టిడిపి తరఫున చిట్టిబాబు బరిలో నిలవగా సుబ్బారావు విజయం సాధించారు. ఆ తర్వాత చిట్టిబాబు చనిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వరపుల సుబ్బారావు టిడిపికి జై కొట్టి 2019 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో తిరిగి ఫ్యాన్ కిందకు వచ్చేసారు.. అప్పటికే ప్రత్తిపాడులో పర్వత చిట్టిబాబు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కి వైసీపీ టిక్కెట్ కన్ఫమ్ చేసేసారు. ఆ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసినప్పటికీ పదవి కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు వరుపుల. అయితే, పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా, తనకు గుర్తింపు లేదని భావిస్తున్నారట వరుపుల. ఆయన పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పిల్లి మొగ్గలు వేసే నేతలను చేరదీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మరో చిన్నాన్న పర్వత రాజబాబు శంఖవరం ఎంపీపీ గా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్యేకు అసలు పడదట. గత ఎన్నికల్లో రాజబాబు భార్య ఎమ్మెల్యే సీటు కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు.. కానీ అవకాశం దక్కకపోవడంతో ఎం పీ పీ పదవి ఇచ్చి బుజ్జగించారునియోజవర్గంలో ప్రత్తిపాడు, శంకవరం, రౌతులపూడి, ఏలేశ్వరం మండలాలు ఉన్నాయి. ఎమ్మెల్యే సొంత బాబాయి ఇప్పటికే, తిరుగుబాటు బావుటా ఎగరేస్తే, తాజాగా మరో ఎంపీపీ కూడా అందులో చేరారు. తాజాగా రౌతులపూడి ఎంపీపీ బహిరంగంగానే ఎమ్మెల్యే పై కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే కనీసంగా కూడా తమను పట్టించుకోవడం లేదని మండల పరిషత్ సమావేశంలో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మెజార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి పార్టీలో ఉన్న వారిని కాకుండా ఆయనతో పాటు వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులకు సైతం దానికి తగ్గట్లుగా ఆదేశాలిస్తున్నారట నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే ఫైనల్ అని తాను చెప్పిన వారికి పనులు చేసి పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారట. దాంతో లోకల్ లీడర్లు ఎమ్మెల్యే పై కుత కుత లాడిపోతున్నారట. పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాకుండా ఆయన మనుషులను చేరదీయడంపై సమావేశాలు పెట్టుకుంటున్నారట. పార్టీకి కాకుండా తనకు ప్రయారిటీ ఇవ్వాలన్న ఆయన కామెంట్స్ పై ఫ్యాన్ పార్టీ క్యాడర్లో పెద్ద చర్చే నడుస్తోందట. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలతో పాటు మాజీ ఎమ్మెల్యే శిబిరాలలో ఎవరి వైపు వెళ్ళాలో కేడర్ తేల్చుకోలేకపోతోందట . దీంతో ఫ్యాన్ పార్టీలో మూడు పంచాయతీలు ఆరు సమావేశాలు అన్నట్లు తయారయ్యిందట పరిస్థితి