హైదరాబాద్, సెప్టెంబర్ 13,
జాతీయ రాజకీయాలలో చక్రంతిప్పుతానంటున్న కేసీఆర్ అందుకు సంబంధించి వరుస భేటీలతో ఇటీవల బాగా బిజీ అయ్యారు. రైతు నాయకులతో సమావేశం తరువాత కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నాయకుడు కుమారస్వామితో ఆదివారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. దాదాపు గంటల సేపు జరిగిన ఈ భేటీలో జాతీయ రాజకీయాలతో పాటు కర్నాటక రాజకీయాలపై కూడా చర్చ జరిగిందని అంటున్నారు.కర్నాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కర్నాటకలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది. కర్నాటకలో పాగా వేయాలని జేడీఎస్ ఉవ్విళ్లూరుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు ఫండింగ్ చేసే విషయంలో కుమార స్వామితో భేటీలో కేసీఆర్ చర్చించినట్లు చెబుతున్నారు. మొత్తంగా జాతీయ రాజకీయాలలో బీజేపీని దీటుగా ఎదుర్కొన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కేసీఆర్ కు కుమారస్వామి మద్దతు పలికారనడంలో సందేహం లేదు.కుమారస్వామితో భేటీ అనంతరం ఇరువురూ కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఇరువురూ కూడా ప్రత్యామ్నాయ జాతీయ అజెండాపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. దేశంలోని మోధావులు, ఆర్థిక రంగ నిపుణులు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు, రైతు సంఘాల నేతలతో చర్చించి జాతీయ అజెండాపై ఒక అభిప్రాయానికి వచ్చామన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ అనుభవం, నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని హెచ్ డీ కుమారస్వామి చెప్పారు. సబ్బండ వర్ణాలనూ కలుపుకుని సుదీర్ఘ కాలం పోరాడి, ఉద్యమించి కేసీఆర్ తెలంగాణ సాధించారని కర్నాటక మాజీ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందుండి నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనీ, జాతీయ రాజకీయాలలో కేసీఆర్ క్రియాశీలక భూమిక పోషించాలనీ, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కుమార స్వామి చెప్పారు. త్వరలోనే కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించాలని నిర్ణయించుకోవడాన్ని స్వాగతించారు. కాగా కుమారస్వామి, కేసీఆర్ ల మధ్య భేటీలో జాతీయ రాజకీయాల చర్చ సంగతి అలా ఉంచితే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు ఆర్థిక చేయూత అందించేందుకు సంబంధించిన లావాదేవీల గురించి కూడా విస్తృతంగా జరిగిందని రాజకీయవర్గాలు అంటున్నాయి.ఇందుకు కుమారస్వామి తన బృందంలో కర్నాటకకు చెందిన పారిశ్రామిక వేత్తను కూడా వెంటబెట్టుకుని రావడమే నిదర్శనమని చెబుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ కు జాతీయ రాజకీయాలలో మద్దతుగా జేడీఎస్ నిలుస్తుందనీ, అందుకు ప్రతిగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన నిధులను (ఎలక్షన్ ఫండింగ్) కేసీఆర్ అందించేట్లుగానూ ఇరువురి మధ్యా ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు.