విజయవాడ, సెప్టెంబర్ 19,
ఏపీలో బీజేపీ మల్టీ స్టారర్ సినిమా చేస్తోందా, అంటే అవుననే అంటున్నారు, ఆ పార్టీ పెద్దలు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, మరీ ముఖ్యంగా, 2019 తర్వాత, బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ లో ఎదుగేందుకు, అన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసింది. అయినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా, పార్టీ ఎదిగిందీ లేదు.పెరిగిందీ లేదు.జాతీయ స్థాయిలో తారాజువ్వలా దూసుకుపోతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తడిసిన సీమ టపాసుల తుస్సు మంటోంది. చివరకు ఆటలో అరటి పండుగా మిగిలిపోయింది. ఈ నేపధ్యంలో బీజేపీ, ఇప్పుడు కొత్తగా మరో ప్రయోగాన్ని తెర మీదకు తెచ్చింది. అదే, మల్టీ స్టారర్ రాజకీయ చిత్రం. ఇంతకీ బీజేపీ చూపిస్తానంటున్న సినిమా ఏమిటి? ఆ కథేంటి? ఆ వివరాలలోకి వెళితే .. రంగులు పూసుకునే, వారికి రాజకీయాలు ఎందుకు ? ఇది ఇప్పడు కాదు, ఎప్పుడో 80 వ దశకంలో, విశ్వవిఖ్యాత నందమూరి తారకరామా రావు, తెలుగు దేశం పార్టీ స్థాపించిన సమయంలో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోట్ల విజయభాస్కర రెడ్డి (?) ఈ వ్యాఖ్య చేశారు. నిజానికి, పెద్దాయన కోట్ల ఒక్కరే కాదు, కాంగ్రెస్ నాయకులు మాత్రమే కాదు, ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై అప్పట్లో రాజకీయ విశ్లేషకులు కూడా చాలా వరకు అదే అభిప్రాయం వ్యక్తం చేశారుఅయితే, ఆ తర్వాత ఏమి జరిగింది, ఏమిటి అనేది చరిత్ర. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 11 నెలలలోనే కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. తెలుగు వారి ఆత్మ గౌరవం సాక్షిగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసేతర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాదిపత్యానికి గండి కొట్టారు.కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తెలుగు దేశం పార్టీని రాష్ట్రంలో తిరుగులేని ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. ఒక విధంగా కాంగ్రెస్ ఈ రోజు అనుభవిస్తున్న దురవస్థకు, బీజం అప్పుడే..అక్కడే పడిందని, అక్కడి నుంచే ఇక్కడికి చేరిందని అంటారు. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సినిమా సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలలో కాలు పెట్టేందుకు,అంగుళం జాగా కోసం అష్ట కష్టాలు పడుతున్న బీజేపీ, మల్టీ స్టారర్ పొలిటికల్ పిక్చర్ ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా ఇటునుంచి కాకపోతే, అటు నుంచి నరుక్కు రావాలనే సూత్రాన్ని కమల దళం ఫాలో అవుతుందో ఏమో కానీ, రాష్ట్రంలో ఎదిగేందుకు ఇంతవరకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టిన నేపధ్యంలో, ఇప్పుడు,కొత్త సినిమా ప్లాన్ చేస్తునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సినిమా హీరోలకు కుల సమీకరణాలను జత చేసి కొత్త కథను సిద్ధం చేస్తోందని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారంగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత షా హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇంచుమించుగా రెండు గంటలకు పైగానే ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు. అమిత్ షా ఒక సినిమా హీరోతో అంత సేపు అది కూడా ఢిల్లీ తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకుని మరీ మాట్లాడారంటే, ఎవరు అవునన్నా, కాదన్నా ఆ భేటికీ రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోదు. సరే, అన్నిగంటలు ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారు, ఏమిటి, అన్నది ఎలా ఉన్నా, రాజకీయ వర్గాల్లో మాత్రం, ఆ భేటి వెనక ఏదో ఉందనే ప్రచారం చర్చ అయితే ఇప్పటికీ జోరుగా సాగుతోంది. మరో వంక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అదలా ఉంటే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, జనసేన అధ్యక్షుడు, మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ మధ్య మరో ‘శిఖరాగ్ర’ సమావేశం ఏదో జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ భేటీ అమిత్ షా తో జూనియర్ భేటీకి కొనసాగింపా లేక ఇది ఇంకోటా అనేది ఇంకా క్లియర్ కాలేదు. కానీ ఈ ఇద్దరి భేటీ కూడా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ భేటీ అంతర్యం ఏమిటనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. సినిమా రిలీజ్ ముందు అభిమానుల్లో ఎలాంటి టెన్షన్ ఉంటుందో ఇప్పుడు, ఆ ఇద్దురు ఎందుకు కలుస్తున్నారు, ఏమి మాట్లాడుకుంటారు? అనే విషయంలోనూ అలాంటి టెన్షనే కనిపిస్తోంది. మరో వంక కేంద్ర రక్షణ శాఖ మంత్రి, రాజ్ నాథ్ సింగ్ ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు కుటుంబాన్ని, పరామర్శించారు. పనిలో పనిగా, కృష్ణం రాజు సోదరుని కుమారుడు, హీరో ప్రభాస్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.నిజానికి ప్రభాస్ చాలా కాలంగా బీజేపీ పెద్దలతో టచ్ లోనే ఉన్నారు. గతంలో కృష్ణం రాజు వెంట ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో సమావేసమయ్యారు. అప్పట్లోనే ఆయన బీజీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ప్రభాస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఇపుడు బీజేపీ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇటీవల రాజ్య సభకు నామినేట్ అయిన సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కుటుంబ సహకారం కూడా ఉందని అంటున్నారు. అందుకే, బీజేపీ జాతీయ నాయకులు ఎవరు రాష్ట్రానికి వచ్చినా, సినిమా హీరోల మీద ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. అయితే, బీజేపీ తయారు చేసినట్లు చెపుతున్న స్క్రిప్ట్ చూస్తే, ఆ ముగ్గురు హీరోలకు, ముఖ్యంగా యువతలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు, సామాజిక, కుల సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు చెపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఆయనకు, అన్ని సామాజిక వర్గాలలోనూ అభిమానులు ఉన్నారు. రాజకీయంగా చూసినప్పుడు, ఎన్టీఆర్ మనవడిగా, సహజంగానే కమ్మ సామాజిక వర్గం యువతలో ఆయనకు ప్రత్యేక క్రేజుంది. అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ కు కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక స్థానముంది. ఇక క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ కు ఆ సామాజిక వర్గంలో ఒక ప్రత్యేక స్థానమే ఉంది. ఇలా ప్రధాన సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునేదుకు బీజేపీ మల్టీ స్టారర్ రాజకీయ చిత్రాన్ని తెరకెక్కిస్తోందని అంటున్నారు.అయితే, పవన్ కళ్యాణ్ అయితే ఆల్రెడీ కాల్ షీట్స్ ఇచ్చేశారు, సొంతంగా పార్టీ పెట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? ఒక్క తెలుగులోనే కుండా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆ ఇద్దరు, ఇప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? అంటే డౌటే .. అంటున్నారు.