ఛండీఘడ్, సెప్టెంబర్ 19,
ఛండీగఢ్ యూనివర్సిటీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా.. వీడియో తీసిన సహచర విద్యార్థిని ఆ వీడియోలను అడల్ట్ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసింది. దాదాపు 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలను ఇలా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో 8 మంది అమ్మాయిలు ఆత్మహత్యాయత్నం చేశారని సమాచారం. వీరిలో ఎవరికీ ప్రాణహాని లేదని మొహాలీ సీనియర్ ఎస్పీ వివేక్ సోనీ తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు కారణమైన అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.‘ఒక అమ్మాయి వీడియో తీసి సర్క్యులేట్ చేసింది. ఈ విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ విద్యార్థినిని అరెస్ట్ చేశాం. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు. మెడికల్ రికార్డుల ప్రకారం ఆత్మాహత్యాయత్నం చేసినట్లు కూడా నమోదు కాలేదు’ అని మొహాలీ ఎస్ఎస్పీ తెలిపారు.‘ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరిస్తున్నాం. విద్యార్థుల మెడికల్ రికార్డులను రికార్డ్ చేస్తున్నాం. రూమర్లను ఎవరూ పట్టించుకోవద్దని కోరుతున్నాం’ అని ఏఎస్పీ తెలిపారు. ఛండీగఢ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినులు ఆందోళనలకు దిగడంతో.. విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ స్పందించారు. విద్యార్థులు ఆందోళన విరమించాలని కోరారు.‘‘ఇదెంతో సున్నితమైన అంశం. మన అక్కాచెళ్లెల్లు, మన కూతుళ్ల గౌరవానికి సంబంధించినది. ఈ విషయమై మనతోపాటు మీడియా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ సమాజంగా మనందరికీ ఇది పరీక్ష కూడా’’ అని విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేశారు.ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మనీషా గులాటీ స్పందించారు. ‘ఇది చాలా సీరియస్ విషయం. ఇందులో దర్యాప్తు జరుగుతోంది. నిందితులెవర్నీ వదిలిపెట్టబోమని విద్యార్థుల తల్లిదండ్రులకు మాటిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.ఈ ఘటనలో నిందితురాలైన అమ్మాయి.. చాలా కాలంగా వీడియోలను రికార్డింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని వీడియోలు ఆన్‌లైన్లో లీకయ్యాయి. ఈ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో కొంత మంది అమ్మాయిలు షాక్‌లోకి వెళ్లారు. ఈ వ్యవహారమై ఛండీగఢ్ యూనివర్సిటీ ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన జారీ చేయలేదు. ఈ విషయం బయటకు రాకుండా చూడాలని యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదే విషయమై ఆందోళన చేస్తున్న విద్యార్థులు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఆగ్రహంతో ఉన్న విద్యార్థులు నిందితురాలైన విద్యార్థిపై దాడి చేసే అవకాశం ఉండటంతో.. ఆమెను ఓ గదిలో బంధించారు. ఈ ఘటన తీవ్ర ఆందోళనలకు దారి తీయొచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్తగా యూనివర్సిటీ గార్డులు క్యాంపస్ డోర్లకు తాళాలు వేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆగ్రహంతో ఉన్న విద్యార్థినులు పీసీఆర్ వాహనాలు, పోలీసు వాహనాలపై దాడికి దిగగా.. పరిస్థితిని అదుపులోకి తేవడం కోసం పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.