ఛండీఘడ్, సెప్టెంబర్ 19,
హర్యానా దివంగత ముఖ్యమంత్రి దేవీవాల్ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటికీ ఇప్పటికే ఆహ్వానం అందింది. కాంగ్రెస్ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూ ఉన్నది. ఆ పార్టీ హాజరుకావడంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ ఆ పార్టీ హాజరైనట్లయితే కేసీఆర్ హాజరుకాకపోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఆబ్సెంట్ అవుతుందనే అంచనాతో ఈ ఈవెంట్‌కు కేసీఆర్ హాజరు కావడానికే ఆసక్తి చూపుతున్నట్లు ఢిల్లీలోని పలు పార్టీల వర్గాలు పేర్కొన్నాయి. టీఆర్ఎస్ నుంచి మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. రానున్న లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని యాంటీ-బీజేపీ శక్తులన్నింటినీ ఒకే వేదిక మీదకు తేవడానికి ఈ నెల 25న 'సమ్మాన్ దివస్' పేరుతో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడు సహా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే, శిరోమణి అకాలీదళ్ నాయకులు ప్రకాశ్ సింగ్ బాదల్, నేషనల్ కాన్ఫరెన్సు నేత ఫరూక్ అబ్దుల్లా తదితరులను ఐఎన్ఎల్‌డీ ఆహ్వానించింది. కాంగ్రెస్‌కు ఆహ్వానం పంపలేదని ఐఎన్ఎల్‌డీ వర్గాలు పేర్కొంటున్నా ఆఫీషియల్‌గా మాత్రం ఆ విషయాన్ని బహిర్గతం చేయడంలేదు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి తదితరులను కూడా ఐఎన్‌ఎల్‌డీ ఆహ్వానించింది.బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఈ వేదిక మీదకు వస్తున్నందున జాతీయ రాజకీయాల్లో దీన్ని బలమైన అస్త్రంగా వాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేతల్లో చాలా మందితో కేసీఆర్ ఇప్పటికే విడివిడిగా సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలతో పాటు దేశంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులను, బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రాష్ట్రాల హక్కులు, అధికారాలను హరిస్తున్న తీరు తదితరాలన్నింటిపై చర్చించారు. ఇటీవల బిహార్ వెళ్ళి సీఎం నితీష్ కుమార్‌తో, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఆశాజనకంగా జరగలేదన్న ఆరోపణలు ఎలా ఉన్నా కలిసి పనిచేయాలనే కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.కాంగ్రెస్, బీజేపీలకు సమదూరంలో ఉండాలన్నది కేసీఆర్ విధానంగా ఉన్నందున ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ గైర్హాజరైతే మాత్రమే వెళ్ళాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని భావిస్తున్న కేసీఆర్ ఈ ప్లాట్‌ఫారంను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. త్వరలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, హర్యానా తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున నేషనల్ పార్టీ పేరుతోనే అక్కడ పోటీ చేయాలన్నది టీఆర్ఎస్ ఉద్దేశం. 'సమ్మాన్ దివస్' వేదిక మీదకు యాంటీ-బీజేపీ వైఖరితో ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీలు కలవనున్నందున వాటి సహకారంతో అక్కడ పోటీ చేయడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నది గులాబీ బాస్ ఆలోచన అని టీఆర్ఎస్ వర్గాల సమాచారం.ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల్లోని ప్రధానమైన ప్రాంతీయ పార్టీల నేతలు వస్తున్నందున రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పరస్పర సహకారంతో, పొత్తులతో పోటీ చేయాలనే చర్చలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ వ్యతిరేక వైఖరితోనే ఈ పార్టీలు ఒకదాని సాయాన్ని మరొకటి తీసుకుని స్థానికంగా స్వప్రయోజనాలను నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. హర్యానాలో దీర్ఘకాలం పాటు అధికారంలో ఉండి ఇప్పుడు దూరమైన ఐఎన్ఎల్‌డీ 'సమ్మాన్ దివస్' వేదిక ద్వారా మరోసారి రాజకీయంగా బలపడాలనుకుంటున్నది. హర్యానాలో ఐదుసార్లు సీఎంగా పనిచేసి వివిద అవినీతి ఆరోపణలపై పదేళ్ళ జైలు శిక్షను అనుభవించి ఇటీవలే బైటకు వచ్చిన ఐఎన్ఎల్‌డీ నాయకుడు ఓం ప్రకాష్ చౌతాలా ఇప్పటికే నితీష్ కుమార్‌తో సమావేశమయ్యారు.ఆ తర్వాత నితీష్ కుమార్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో చర్చలు జరిపారు. వీరంతా బీజేపీ పట్ల వ్యతిరేకతో ఉన్నందున 'సమ్మాన్ దివస్' పేరుతో ఫతేబాద్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకావడం ద్వారా బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవిస్తుందనే క్లారిటీతో ఉన్నారు. ఐఎన్ఎల్‌డీ నాయకుడు చౌతాలా, ఆయన కుమారుడు అభయ్ కూడా పార్టీకి మళ్లీ శక్తిని సమకూర్చి అధికారంలోకి రావచ్చనే ఆలోచనలతో ఉన్నారు. ఐఎన్ఎల్‌డీ, జేడీయూ, టీఆర్ఎస్ నేతల సమిష్టి సహకారం బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసి బలమైన ప్రత్యామ్నాయానికి పురుడు పోస్తాయా అనేది కీలకంగా మారింది.ఈ కార్యక్రమానికి వెళ్ళడం ద్వారా ఈ పార్టీల సహకారంతో ఆయా రాష్ట్రాల్లో రైతాంగ, దళిత సెక్షన్ల ప్రజలతో బలమైన సంఘాలను ఏర్పాటుచేయవచ్చని, వారికి సంబంధించిన అంశాలతో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయవచ్చన్నది టీఆర్ఎస్ ఆలోచన. వీలైతే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ రాష్ట్రాల్లో పోటీ చేయడం ద్వారా టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు సాధించవచ్చని భావిస్తున్నది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఎజెండా గురించి చాలా మంది ప్రాంతీయ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చించినందున ఫతేబాద్‌లో జరిగే చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఫ్యూచర్ పాలిటిక్స్ కు ఈ వేదిక ఉపయోగపడుతుందని, సద్వినియోగం చేసుకునే దిశగా టీఆర్ఎస్ ఆలోచిస్తున్నది