కడప, సెప్టెంబర్ 20,
మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి అంత సులువుగా విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. తన తండ్రి హత్యకు న్యాయం జరిగే దాకా ఆమె న్యాయ పోరాటం చేయాలన్న కృత నిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయాలన్న ధ్యేయంతో డాక్టర్ సునీతా రెడ్డి అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. న్యాయం కోసం సునీతారెడ్డి ఎంతదాకా అయినా వెళ్లి అసలు నిందితులకు శిక్ష పడేలా చేసేందుకు వెనుకాడటంలేదు. ఈ క్రమంలోనే వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఏపీలో కాకుండా మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారువేశారు. ఆమె పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వైసీపీ సర్కార్ కు షాక్ ఇస్తూ.. నోటీసులు జారీ చేసింది.తన తండ్రి వివేకానందరెడ్డి హత్య జరిగి మూడేళ్లయినా ఈ కేసు విచారణకు అనుకూల పరిస్థితులు లేవని, దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, నిందితులుగా ఉన్న వారు బెయిల్ పై బయటికి వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని తన పిటిషన్ లో సుప్రీంకోర్టుకు సునీత నివేదించారు. సీబీఐ అధికారుల దర్యాప్తు విషయంలో నిందితులు కడపలో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని సునీతారెడ్డి ఆరోపించారు. ఏపీలో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని, ఈ విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసేలా ఆదేశించాలంటూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం విచారణ చేపట్టింది. సునీతారెడ్డి తరఫున న్యాయవాది సిద్దార్థ లూత్రా సుప్రీం ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. సాక్ష్యాలను చెరిపేసే యత్నం నిందితులు చేస్తున్నారని, ఏపీ సర్కార్ ఈ కేసులో ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని ధర్మాసనానికి న్యాయవాది లూత్రా విన్నవించారు. వివేకా హత్య జరిగి మూడేళ్లయినా ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతికీ నోచుకోలేదని కోర్టుకు వివరించారు. సీబీఐ విచారణకు తోడ్పాటు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. దిగువ స్థాయి పోలీసు యంత్రాంగం కానీ, ప్రభుత్వ అధికార వర్గాలు కానీ సహకరించడం లేదని చెప్పారు. నిందితులు ఒక్కొక్కరూ బెయిల్ పై బయటికి వస్తూ సాక్షులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.వాదనలు విన్న అనంతరం సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. సునీత లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలంటూ సీబీఐ, వైసీపీ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి 2019లో పులివెందులలోని ఆయన సొంత ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి విదితమే.