విజయవాడ, సెప్టెంబర్ 20,
సంచలన విజయం సాధించిన పుష్ప సినిమాలో ఓ డైలాగ్ ఉంది. దొంగకు పోలీసుకు ఉన్న తేడా బ్రాండేననీ, ఆ బ్రాండే ఇంటి పేరు అని అర్ధం వచ్చేలా ఓ ఇన్ స్పెక్టర్ ఆ డైలాగ్ చెబుతారు. అంటే ఇంటి పేరు లేని వ్యక్తికి సమాజంలో గౌరవం ఉండదని ఆ పాత్ర ద్వారా చెప్పించారు. అయితే ఒక రాష్ట్రానికి ఇంటి పేరు ఆ రాష్ట్ర రాజధానే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాజధాని లేని రాష్ట్రంగా ఇతర రాష్ట్రాలలో ఏపీ పరువు గంగలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు రాజధాని లేని రాష్ట్రం కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారు. వారందరూ మీ రాజధాని ఏదీ ఎంటు తోటి విద్యార్థుల ఎగతాళిని పంటి బిగువున భరిస్తున్నారు. అవమాన భారంతో తలదించుకుంటున్నారు. ఈ పరిస్థితి సాక్షాత్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద కుమార్తెకే ఎదురైంది. ఆయన కుమార్తె హస్తినలో చదువుకుంటోంది. ఆమెను తోటి విద్యార్థులు రాజధాని విషయంలో ఆటపట్టిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడిన జస్టిస్ భట్టు దేవానంద్ కష్టపడి అనుకున్నది సాధించే విషయంలో తెలుగువారికి విశ్వవ్యాప్తంగా ఖ్యాతి ఉందన్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులలో అధిక శాతం మంది తెలుగువారే ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. అయితే ఇప్పుడు విదేశాలలో ఉంటున్న ఏపీ వాసులు, దేశంలో ఇతర రాష్ట్రాలలో చదువుకుంటున్న విద్యార్థులు రాష్ట్రానికి రాజధాని లేకపోవడం వల్ల అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారనీ, వారి గుర్తింపే ప్రశ్నార్థకంగా మారిపోయిందని అంటున్నారు. ఈ విషయాన్ని ఒక సభలో న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ చెప్పారు. ఆయన న్యాయమూర్తిగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. ఆయన వెల్లడించిన ఈ అభిప్రాయం, ఈ ఆవేదన ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.ఇది ఆ న్యాయమూర్తి అభిప్రాయం మాత్రమే కాదనీ, యావదాంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనకు ప్రతిబింబమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేని పరిస్థితి ఏర్పడటానికి జగన్ నిర్వాకమే కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా జగన్ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ అపఖ్యాతి మూటగట్టుకున్నా చూస్తూ ఊరుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానుల మూడు ముక్కలాటకు ఇకనైనా తెరదించి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.అప్రతిహాతంగా కొనసాగుతున్న అమరావతి రైతుల ఆందోళన, కోర్టు తీర్పు లను పరిగణనలోనికి తీసుకుని తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న వితండ వాదానికి స్వస్తి చెప్పాలని సూచిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించినప్పుడు ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు.పైపెచ్చు మద్దతు తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. ప్రస్తుతం మూడు రాజధానులంటూ భీష్మించిన సీఎం జగన్ కూడా నాడు విపక్ష నేతగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించారు. 2014 ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగిస్తానని హామీ కూడా ఇచ్చారు.అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ప్లేట్ ఫిరాయించారు. అమరావతి ఒక్కటే కాదు రాష్ట్రానికి మూడు రాజధానులంటూ కొత్త పాట అందుకున్నారు. జగన్ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించారు. ఆఖరికి కోర్టు కూడా అమరావతి నిర్మించాల్సిందేనని విస్పష్ట తీర్పు ఇచ్చింది.అయినా కూడా మూడు రాజధానులంటూ జగన్ విన్యాసాలు ఆపడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది. ఇంటా బయటా అవమానాలను, పరాభవాలను రాజధాని లేని రాష్ట్ర ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ వాసులు ఎదుర్కొంటున్నారు. వారి అందరి ఆవేదనే హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ మాటల్లో ప్రతిబింబించింది.