న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20,
కాంగ్రెస్ నాయకత్వాన్ని కుదిపేసిన జీ-23లో ఒకరైన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్… పార్టీలో సంస్కరణల గురించి ఇటీవల ప్రస్తావించారు. వచ్చే నెల జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు శశి థరూర్ సుముఖంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగడాన్ని థరూర్ స్వాగతించారు. అది పార్టీకి మంచిదని వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్.. సోనియా గాంధీతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కొందరు యువ కార్యకర్తలు రూపొందించిన ఆన్‌లైన్ పిటిషన్‌కు ఆయన అంగీకారం తెలిపిన అనంతరం ఈ భేటీ జరగడం గమనార్హం.కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతిని సమాచారం. సంస్కరణల కోసం ఒత్తిడి చేస్తున్న నేతల బృందంలో థరూర్ కూడా ఉన్నారు. ఈ ఏడాది మే 15న చేపట్టిన ఉదయ్‌పూర్ నవ్ సంకల్ప్ ప్రకటనను పూర్తిగా అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షపదవికి పోటీ చేసే అభ్యర్థులు బహిరంగంగా ప్రతిజ్ఞ చేయాలని ఈ ఆన్‌లైన్ ప్రకటనలో ఉంది. ఈ అప్పీల్‌పై 650 మందికి పైగా సంతకాలు చేశారని శశిథరూర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సోనియాగాంధీతో ఏం చర్చించారన్నది శశి థరూర్ వెల్లడించలేదు. కానీ సోనియా గాంధీ శశిథరూర్ పోటీ చేయొచ్చని అనుమతి ఇచ్చినట్లు పలు వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ ఈ నెల 24న ప్రారంభం కానుంది. 30 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. అవసరమైతే అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహిస్తారు. ఫలితాన్ని అక్టోబర్ 19న ప్రకటించారు.ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తుండగా.. కొన్ని రాష్ట్రాల అధ్యక్షులు రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు. అధ్యక్షుడి ఎంపికను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే వదిలేయాలని మూడు రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. దీంతో మళ్లీ గాంధీ కుటుంబసభ్యులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలనే పిటిషన్‌కు శశిథరూర్ బహిరంగంగా మద్దతు తెలిపారు. పార్టీలో సంస్కరణల కోసం డిమాండ్ చేసిన ఆయన.. ఈ విషయంపై 2020లోనే సోనియాకు లేఖ రాశారు.