YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఠారెత్తిస్తున్న ఎండలు

ఠారెత్తిస్తున్న ఎండలు

రెండురోజులుగా తీవ్రస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు సూర్యాపేట జిల్లా అల్లాడిపోతోంది. ఉదయం ఏడు గంటలకే మొదలైపోతున్న టెంపరేచర్లు మధ్యాహ్నం సమయానికి నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. సాయంత్రం ఆరు వరకూ వేడిమి ఎఫెక్ట్ ఉంటోంది. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇక ఆది-సోమవారాల్లో ఎండ విపరీతంగా ఉంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదైనట్లు అధికారులు సైతం చెప్పారు. సూర్యాపేటలో ఆదివారం ఏకంగా 43.9 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంటోంది. మే మూడో వారం నుంచి చివరి రోజుల వరకూ ఎండలు ఎక్కువగా ఉండడం సాధారణమే. అయితే ప్రజలు మాత్రం టెంపరేచర్ల ధాటిని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటల నుంచే రోడ్లపై సందడి తగ్గిపోతోంది. మధ్యాహ్నమైతే కర్ఫ్యూవాతావరణమే నెలకొంటోంది. ప్రజలంతా ఇళ్లు, కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. అత్యవసర పనులను కూడా వాయిదా వేసుకుంటున్న వారు ఉన్నారంటే ఎండ తీవ్రత ఎంతగా ఉందో ఈజీగానే అర్ధం చేసుకోవచ్చు.  

 

ఉష్ణతాపాన్ని జయించేందుకు ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ఇదిలాఉంటే రోజువారీ కూలీలు, చిరువ్యాపారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇంటి పట్టున ఉంటే వారికి రోజు గడవడం కష్టం దీంతో ఎండల్లోనే మాడిపోతూ పనులు చక్కబెట్టుకుంటున్నారు. మరోవైపు ఎండల పెరిగిపోవడంతో శీతలపానీయాలు, కొబ్బరిబొండాలు విక్రయదారుల బిజినెస్ ఆశావహంగా ఉంది. ప్రజలు కూల్ డ్రింక్స్, మజ్జిగ, కొబ్బరిబొండాలు సేవించేందుకు పోటీపడుతున్నారు. దీంతో ఆయా విక్రయదారులకు ఆదాయం బాగానే ఉంటోంది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల సూర్యాపేటకే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి. దీంతో ప్రజారోగ్యం ప్రభావితమవుతోంది. అందుకే ఎండలో తిరగవద్దని, వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని లేదంటే ఇంట్లోనే ఉండాలని స్పష్టంచేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి.. వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్తున్నారు. డీ హైడ్రేషన్ కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related Posts