విజయవాడ, సెప్టెంబర్ 23,
ఇద్దరి లక్ష్యం ఒక్కటే. వైసీపీని ఓడించడం. అధికారంలో ఉన్న వైసీపీని ఓడించాలంటే పొత్తులు అవసరం అన్న సంగతి ఇద్దరికీ తెలుసు. అన్ని విధాలుగా బలంగా ఉన్న జగన్ ను ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది కూడా తెలుసు. వారే టీడీపీ అధినేత చంద్రబాబు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ఇద్దరి మనసులో ఒకటే ఉన్నప్పటికీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో పొత్తుల గురించి ఇప్పుడే బయటపడటం లేదు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఇద్దరూ ప్రయత్నాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే పొత్తులు కుదరాలంటే ఇద్దరూ కొంత దిగి రావాల్సి ఉంటుంది. పట్టువిడుపులతో... ఇద్దరూ పట్టువిడుపులు ప్రదర్శించాల్సి ఉంటుంది. చంద్రబాబు తాము ఇన్నే సీట్లు ఇస్తామని పట్టుబట్టి కూర్చుంటే కుదరదు. తమకు ఇన్నే సీట్లు కావాలని భీష్మించుకుంటే పవన్ కల్యాణ్ కు చెల్లదు. ఇద్దరూ ఒక మెట్టు దిగాల్సి ఉంటుంది. చంద్రబాబు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఖరారు చేశారు. వాటిలో కూడా కొన్ని అనుమానాలున్నాయి. జనసేన బలంగా ఉన్న స్థానాలను చంద్రబాబు ఖచ్చితంగా వదులుకోవాల్సి ఉంటుంది. జనసేన లో కూడా గత కొన్నేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడుతున్న వారు కొందరున్నారు. వారి కోసం పవన్ కల్యాణ్ పట్టుబట్టే అవకాశముంది. 2019 ఎన్నికల్లో తమకు 20 వేలు ఓట్లు దాటిన సీట్లపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిసింది. అవి దాదాపు నలభై నుంచి యాభై నియోజకవర్గాల వరకూ ఉన్నాయంటున్నారు. ఈ స్థానాల్లోనే బస్సు యాత్ర ఉంటుందని కూడా జనసేన నేతలు చెబుతున్నారు. అయితే అన్ని స్థానాలకు టీడీపీ అంగీకరిస్తుందా? అన్నదే ప్రశ్న. యాభై స్థానాలకు బేరం పెడితే కనీసం ముప్ఫయి స్థానాలయినా తీసుకోవచ్చన్న ప్లాన్ కావచ్చు. కానీ జనసేన, బీజేపీకి అన్ని స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించన్నదన్నది వాస్తవం. ఎందుకంటే బీజేపీ తో పొత్తు కుదిరితే మరి కొన్ని స్థానాలను వదులుకోవాల్సి ఉంటుంది. టీడీపీ అధినేత వైసీపీని ఎలాగైనా ఓడించేందుకు, పార్టీ మనుగడ కోసం అంగీకరించినా నేతలు మిత్ర పక్షాల అభ్యర్థుల గెలుపు కోసం సహకరించకపోవచ్చు. ఒకసారి తమ నుంచి నియోజకవర్గం చేజారిపోతే భవిష్యత్ లో క్యాడర్ ఉండదు. ఆ సంగతి టీడీపీ నేతలకు తెలియంది కాదు. అదే జరిగితే అసలుకే మోసం వస్తుంది. అందుకే చంద్రబాబు కూడా ఆచితూచి నియోజకవర్గాల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తు అవసరం. అలాగే పవన్ కల్యాణ్ కూడా ఒంటరి పోటీకి ధైర్యం చేయరు. మరో ఐదేళ్ల పాటు వెయిట్ చేయడం, పార్టీని నడపటం అంత సులువు కాదు. ఇద్దరీదీ ఒకటే ఆలోచన. పొత్తు ఉండాలన్నది. కానీ ఎలా అన్నదే ఇంకా మొదలు కాలేదు. ఇక పవన్ కల్యాణ్ కూడా సమీక్షలు మొదలు పెడుతున్నారు. వచ్చే నెల నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సమీక్ష ప్రారంభించనున్నారు. అది జనసేనకు బలమైన స్థానం. ఆ స్థానంలో టీడీపీ ఇంతవరకూ విజయం సాధించలేదు. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం గెలిచింది. ఈ స్థానం టీడీపీ జనసేనకు ఇచ్చే అవకాశముంది. అందుకే అక్కడి నుంచి పవన్ కల్యాణ్ సమీక్ష మొదలు పెట్టారంటున్నారు. ఇద్దరికీ పొత్తులు కుదురుతాయన్న నమ్మకం ఉంది. ఎవరు తగ్గాలో? ఎక్కడ నెగ్గాలో? అన్నది చర్చల్లో కూర్చుంటే కాని తేలేట్లు కనపించడం లేదు.