విజయవాడ, సెప్టెంబర్ 23,
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న లాజిస్టిక్ కారిడార్లకు అనుబంధంగా ఎనిమిది చోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్ హబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ తరహా హబ్‌ల ఏర్పాటుతో కారిడార్లపై ఒత్తిడి తగ్గించవచ్చని భావిస్తోంది. తొలివిడతలో విశాఖపట్నం, అనంతపురంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఆ తరువాత కాకినాడ, కొప్పర్తి, భావనపాడు, రామాయపట్నం, మచిలీ పట్నం, ఒర్వకల్లులోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఎయిర్‌కార్గో కోసం భోగాపురంతో పాటు నెల్లూరు వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయను న్నారు. మరోవైపు విశాఖపట్నం చెన్నై, చెన్నై- బెంగుళూరు, హైదరాబాద్-బెంగుళూరు కారిడార్లలో ఏర్పాటు చేయనున్న లాజిస్టిక్ కారిడార్ల భూసేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది.దీనికోసం 47,575 ఎకరాలు అవసరం ఉండగా, 28,889 ఎకరాలు అందుబాటులో ఉంది. మిగిలిన భూమిని సేకరించాల్సి ఉంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి పోర్టుల ద్వారా సరుకు విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు వీలుగా ఈ కారిడార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావి స్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో తయారవుతున్న ఉత్పత్తులను పోర్టుల ద్వారా ఎగుమతిచేయడం కష్టంగా ఉంటోంది, విశాఖపట్నం లేదా చెన్నై పోర్టుల ద్వారా సరుకు రవాణా చేయాల్సి వస్తోంది. ఇది ఉత్పత్తిదారులకు ఆర్థికంగా ఇబ్బందులు కలిగిస్తోంది ఈ నేపథ్యంలో లాజిస్టిక్ కారిడార్లు కొత్తగా ఏర్పాటు చేయబోయే పోర్టులకు అనుసంధానంగా పనిచేస్తాయని, హబ్‌ల ఏర్పాటు ద్వారా వాటిపై ఒత్తిడి తగ్గించవచ్చని చెబుతున్నారు. ఆయా కారిడార్లలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమల కోసం ప్రభుత్వం ల్యాండ్‌బ్యాంకునూ సిద్ధం చేసింది. ఎపిఐఐసి దగ్గర ఉన్న లెక్కల ప్రకారం పరిశ్రమలకు తీసుకొచ్చేందుకు వీలుగా 48,352 ఎకరాలను వీటికోసం కేటాయించారు. ఈ కారిడార్ల లోనూ లాజిస్టిక్ కారిడార్లలో ఉత్పత్తయ్యే సరుకుకు విమాన మార్గాల ద్వారా పోర్టులకు తరలించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. వీటితోపాటు వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 225 ఎకరాలతో పవర్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్, 1000 ఎకరాల్లో పిఎం మిత్ర పథకం కింద టెక్స్‌టైల్ తయారీ హబ్‌లనూ అభివృద్ధి చేయను న్నారు. వీటికి కావాల్సిన రుణాలు పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం భూములపై ఉన్న ఆంక్షలను ఎత్తేసేదిశగా ప్రణాళికను రూపొందించింది. ప్రభుత్వ కసరత్తు ఎలా ఉన్నప్పటికీ ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉన్నాయని, ప్రోత్సాహకాలు అందడం లేదని, వీటి విషయంలో ప్రభుత్వం ఒక్కోచోట ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని పారిశ్రా మిక వేత్తలు చెబుతున్నారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.