YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహూల్... ఊ అంటారా... ఊహూ అంటారా

రాహూల్... ఊ అంటారా... ఊహూ అంటారా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23, 
రాబోయే రోజుల్లో కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు, ఇదే  కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన ప్రశ్న. నిజానికి, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామ చేసినప్పటి నుంచి,కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఖాళీగానే వుంది.అనివార్య పరిస్థితుల్లో సోనియా గాంధీ, తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా ఆమె పార్టీ బాధ్యతలను నిర్వహించలేక పోతున్నారు. ఓ వంక వయో భారం, మరో వంక అనారోగ్యం, ఆమెను వెంటాడుతున్నాయి.ఈ కారణంగా ఆమె క్రియాశీలంగా వ్యవహరించలేక పోతున్నారు. మరో వంక పార్టీ సీనియర్ నాయకులు ఒకరొకరుగా పార్టీని వదిలి పోతున్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముహుర్తహం ఖరారు చేసింది. ఓ 15/20 రోజుల క్రితం పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ అనివార్యమైతే అక్టోబరు 17న పోలింగ్‌ జరుగుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో అర్హులైన పార్టీ సభ్యులు ఎవరైనా పోటీ చేయవచ్చని, పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే ఎవరు పోటీ చేస్తారు? అసలు ఎవరైనా పోటీ చేస్తారా? అనే విషయంలో ఇంతవరకు అయితే స్పష్టత లేదు. ఓ వంక  కాంగ్రెస్ ఎంపీ శశి  థరూర్ సహా మరికొందరి పేర్లు వినిపిస్తున్నా,ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా, ఖాయంగా పోటీ చేస్తామని ప్రకటించలేదు.అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం ఏమిటి అనే విషయంలో మొదటి నుంచి ఉన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. నిజానికి, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలోనే తమ మనసులోని మాటను స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు మరోమారు తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు  గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తులు పార్టీ అధ్యక్ష బాద్యత తీసుకోవాలని, సిడబ్ల్యూ సమావేశంలోనే తెగేసి చెప్పారు. మూడేళ్ళుగా అయన అదే మాట మీదున్నారు.  అయినా, ఇంకెవరు ముందుకు రాకపోవడం వల్లనే, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా నెట్టుకొస్తున్నారు. మరో వంక ఆమె నిరాసక్తత కారణంగానే కావచ్చును కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా స్వతంత్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విమర్శలు ఎదుర్కుంటున్నారు. రాహుల్ గాంధీ అప్రకటిత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని, జీ23 నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ సందిగ్ధ వైఖరి కారణంగానే పార్టీ నష్ట పోయిందని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. నిన్న మొన్న పార్టీని వదిలి వెళ్ళిన, పార్టీ సీనియర్  నాయకుడు గులాంనబీ ఆజాద్,ఇంకా పార్టీలోనే ఉన్నఆనంద శర్మ, మనీష్ తివారీ వంటి ఇతర సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ నిర్వాకం వల్లనే పార్టీ కోలుకోలేని విధంగా బలహీనమైందని, మండి పడుతున్నారు.నిజానికి, ఇప్పటికైన రాహుల గాంధీ తెగించి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు, సై’ అంటే అధ్యక్ష ఎన్నిక అవసరమే ఉండదు. కానీ ఇప్పటికీ అయన దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు.  అధ్యక్షుడిని అవుతానో లేదో ఎన్నిక జరిగినప్పుడు స్పష్టత వస్తుంది. అప్పటివరకు వేచి చూడండి” అంటూ, అటూఇటూ కాని, సమాధానం ఇచ్చారు. అంతే కాదు, “ఒకవేళ పోటీచేయకుంటే విలేకరులు తనను అడగొచ్చని.. అందుకు జవాబు చెబుతాను” అంటూ మరో మెలిక పెట్టారు. అంటే రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్డమయ్యారని అనికోవాలా?  లేదని సరిపుచ్చుకోవాలో’ అర్థం కాక కాంగ్రెస్ శ్రేణులే తలలు పట్టుకుంటున్నాయి. అదలా ఉంటే రాహుల గాంధీ సాగిస్తున్న, భారత్ జోడో యాత్ర లక్ష్యం విషయంలోనూ అదే సందిగ్దత వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నాయకులు, ఓ వంక ఇది రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్న యాత్ర కాదని అంటారు. మరో వంక, యాత్ర ద్వారా రాహుల్ గాంధీ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తున్నారని అంటున్నారు. అదెలా ఉన్నప్పటికీ, అధ్యక్ష పదవి విషయంలో సందిగ్దత తోలిగితేనే కానీ, కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటన్నది తేలదని, రాహుల్ గాంధీ, ఇప్పటిలా బాధ్యతలు లేని అధికారం చెలాయించాలని కోరుకుంటే, పార్టీ పరిస్థితి కూడా  ఇప్పటిలానే దినదిన ప్రవర్తమానంగా దిగాజారుతుందని అంటున్నారు.

Related Posts