విజయవాడ, సెప్టెంబర్ 28,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. అసెంబ్లీ సాక్షిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతోపాటు ఇతర పార్టీల నేతలలూ విమర్శలు గుప్పించారు. చివరకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన సోదరి, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, జగనన్న వదిలిన బాణం సైతం ముమ్మాటికి తప్పేనని విస్పష్టంగా చెప్పేశారు.
అయితే ఈ వ్యతిరేకత అంతటితో ఆగలేదు. హెల్త్ యూనివర్శిటీకి వైయస్ఆర్ పేరు పెట్టడం వైసీపీలోని నాయకులు, కార్యకర్తలు సైతం అంగీకరించలేకపోతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి కొడాలి నాని అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిర్ణయంపై రగిలిపోతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌వి పిల్ల చేష్టల్లా ఉన్నాయంటూ కొడాలి నాని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారని చెబుతున్నారు. ఇన్నాళ్లు జగన్ ఏదీ మాట్లాడమంటే.. మీడియా ముందు మాట్లాడాననీ. కానీ తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు మీద ఉన్న హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెడతానంటే మాత్రం తాను సమర్ధించలేననీ, అయినా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జిల్లాలోనూ, సొంత నియోజకవర్గంలోనూ మొహం చూపుకునే పరిస్థితి లేకుండా పోయిందని కొడాలి నాని వాపోతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ , జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరిపై జగన్ ఆదేశాల మేరకు విమర్శలు చేశాననీ, ఇంకా చేయమన్నా చేస్తాను కానీ, ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్థిస్తూ మాత్రం మాట్లాడటం తన వల్ల కాదని ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. వచ్చేది ఎన్నికల సీజన్.. కావడంతో ఈ నేపథ్యంలో ఆచి తూచి అడుగులు వేయాలని.. కానీ ఇవేమి పట్టించుకోకుండా.. స్ జగన్ ఏ రోజు ఏ పిచ్చి నిర్ణయం తీసుకుని సమర్ధించమంటూ హుకుం జారీ చేస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందని ఆయన తలకొట్టుకుంటున్నట్లు కొడాలి నాని సన్నిమితులు చెబుతున్నారు.
హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ముందుగానే కొడాలి నానికి సమాచారం ఉందని అంటున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజు.. ఈ పేరు మార్పు వ్యవహరంపై ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాలంటూ..నానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి నేరుగా ఫోన్ కూడా వచ్చిందని చెబుతున్నారు. కానీ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో జగన్ తో ఏకీభవించలేకపోతున్న కొడాలి నాని ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా మాట్లాడటం ఇష్టం లేకే అసెంబ్లీకి ఆ రోజు డుమ్మా కొట్టారని నాని సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు.. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఇంత రచ్చ నడుస్తున్నా... కొడాలి నాని నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంపై తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు ఆగ్రహంతో ఉన్నారంటున్నారు.జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొడాలి నాని విపక్ష నేతలపై ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. అయితే మంత్రిపదవి పోగానే మాత్రం సైలెంటైపోయారు. మంత్రి పదవి ఊడిపోయిన తొలి రోజుల్లో తన నియోజకవర్గంలోని తన సొంత పశువుల పాకలో విశ్రాంతి తీసుకున్నారు. లేదా అజ్ణాత వాసం చేశారు. ఆ ఫొటోలు అప్పట్లో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇటీవలి కాలంలో జగన్ మళ్లీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరిస్తారనీ, గత కేబినెట్ లో నోరున్న మంత్రిగా గుర్తింపు పొందిన నానికి చాన్స్ ఉంటుందనీ వార్తలు రావడంతో ఆయన మళ్లీ గొంతు సవరించుకున్నారు. వరుస మీడియా సమావేశాలలో విపక్ష నేతలపై గతం కంటే ఎక్కువగా బూతుల వర్షం కురిపించేశారు. ఇక మంత్రిపదవి పక్కా అనుకునే లోగానే ఉరుములేని పిడుగులా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశం నాని ఆశలపై నీళ్లు చల్లిందని చెప్పాలి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు మద్దతుగా నాని నోరు విప్పకపోవడం.. సన్నిహితుల వద్ద జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేయడంతో ఇక కొడాలి నానికి మాజీ మంత్రి అనేది శాశ్వత హోదాగా మిగిలిపోక తప్పదని పార్టీ వర్గాలే అంటున్నాయి. నాడు కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ పేరే ఇప్పుడు ఆయన రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి కల్పించిందని.. ఇది ఆ(ఎన్టీఆర్) దేవుడి స్క్రిప్టేననీ నాని వ్యతిరేకులు సెటైర్లు వేస్తున్నారు.