తిరుపతి, సెప్టెంబర్ 28,
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాలి. అయితే ప్రధాన ప్రత్యర్థులైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన కార్యకలాపాలు పరిశీలిస్తే ఇప్పటి నుంచే యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ, జనసేన కన్నా వైసీపీ మాత్రం ఏ క్షణంలోనైనా ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంది. ముందస్తుకు వెళ్లడమే వైసీపీకి మంచిది అన్నట్లుగా పలువురు నేతల నుంచి కూడా సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరకంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే విజయం సులువుగా దక్కుతుందని అధినేతకు చెబుతున్నారు. లబ్ధిదారులకు నేరుగా నగదు ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా నగదును వివిధ పథకాల రూపేణా పంపిణీ చేస్తోంది. అమ్మ ఒడి, చేయూత, విద్యా దీవెన తదితర పథకాలకు లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా నగదును జమ చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం నెలకొందని భావిస్తున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లోను ఘనవిజయం సాధించామని, ఇదే ఊపును ఎన్నికలవరకు కొనసాగించాలంటే కష్టమవుతుందని, ముందస్తుకు రావడమే మంచిదని పలువురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ రాజకీయ సలహాదారులకు తెలియజేస్తున్నారు. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోను పార్టీ పటిష్టంగా ఉందని, ముఖ్యమంత్రి జగన్ అభిలషించినట్లుగా రెండోసారి అధికారంలోకి రావాలంటే కొంచెం ముందుకు జరగడమే మంచిదంటున్నారు. ఇతర పార్టీలను కుదురుకోనివ్వకూడదు.. ముందస్తుకు సంబంధించి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఆ పార్టీలో ఇంకాస్త వేడిని రగిలించింది. షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ లో జరిగే ఎన్నికలకు సంబంధించిన సమయం తెలుగుదేశం, జనసేనకు సరిపోతుందని, వారు ఈలోగా అన్ని నియోజకవర్గాల్లో కుదురుకోవడానికి, అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి సమయం సరిపోతుంది. ముందస్తుకు వెళితే ఈ రెండు పార్టీలు ఇబ్బంది పడతాయని, ముందస్తుకు వెళ్లి వారిని కుదురుకోనివ్వకుండా చేస్తే విజయం వైసీపీ పరమవుతుందనే అభిప్రాయంలో నేతలంతా ఉన్నారు. ముందస్తుకు వెళ్లడంవల్ల ఈ పార్టీలు పుంజుకోలేవని, రాజకీయంగా తమకు కలిసివస్తుందని ఇదే మంచి తరుణమనే చర్చ పార్టీలో నడుస్తోంది. అంతేకాకుండా ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయనే చర్చ ద్వారా ప్రజల్లో కూడా రాజకీయంగా వేడివాతావరణం నెలకొంటుందని, దీనివల్ల వారు రాజకీయంగా యూటర్న్ తీసుకునే అవకాశం ఉండదని, ఇతర పార్టీలవైపు వారిని మళ్లించకుండా సాధ్యమైనంత త్వరగా ముందస్తుకు రావడమే వ్యూహాత్మకమనే భావనలో వైసీపీ నేతలున్నారు. వారి వ్యూహం ఫలించి రెండోసారి ప్రజలు అధికారం కట్టబెడతారా? లేదా? అనే విషయంలో స్పష్టత రావాలంటే ఎన్నికలు జరిగేవరకు వేచిచూడక తప్పదు.!!