విజయవాడ, సెప్టెంబర్ 30,
వైసీపీ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి సెగలు రగిలిపోతున్నారా అన్న ప్రశ్నలకు పార్టీ శ్రేణుల నుంచే ఔననే సమాధానం వస్తున్నది. అలాగే ఇటీవల వరుసగా జరిగిన సంఘటనల ఆధారంగా పరిశీలకులు కూడా ఆ రీతిగానే విశ్లేషణలు చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పార్టీ అధినేత జగన్ పై పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగరేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో బుధవారంనాడు జగన్ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్ కు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గైర్హాజరు కావడాన్ని విశ్లేషకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మరో పక్కన తాను ఆదేశించిన ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సక్రమంగా పాల్గొనని 27 మంది ఎమ్మెల్యేల పేర్లు ఆయన సమావేశంలో పబ్లిగ్గా ప్రకటించడం ఒకింత సంచలనం సృష్టించినా జగన్ పై అసంతృప్తితో రగిలిపోయే వారి సంఖ్యను కూడా పెంచిందని అంటున్నారు. ముఖ్యంగా జగన్ కు వీర విధేయుడిగా ఇంత కాలం అందరి నోళ్లలో నానిని కొడాలి నాని, తెలుగుదేశం ఎంపీగా గెలిచి ఆ తరువాత వైసీపీ గూటికి చేరిన వల్లభనేని వంశీ ఈ సమావేశానికి హాజరు కాకపోవడం వారిలో పెల్లుబుకుతున్న అసంతృప్తికి, ధిక్కారానికి నిదర్శనమని అంటున్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో తన అసమ్మతిని, అసంతృప్తిని, వ్యతిరేకతను బహిరంగంగా లేఖ రూపంలో వల్లభనేని వంశీ వ్యక్తం చేస్తే.. తన మౌనం ద్వారా, ఆదేశాలను పట్టించుకోకుండా అసెంబ్లీ ఆ మార్పు బిల్లు ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి కూడా గైర్హాజరు కావడం ద్వారా కొడాలి నాని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ సమావేశం తరువాత మరింత మంది కూడా అదే దారిలో నడిచే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇక కొడాలి నాని విషయానికి వస్తే.. మంత్రి పదవిలో ఉన్నప్పుడు జగన్ పై విమర్శలు చేసిన విపక్ష నేతలపై ఆగమేఘాల మీద మీడియా సమావేశం పెట్టి మరీ, విమర్శలు, ఆరోపణలు, బూతులతో విరుచుకుపడేవారు. అయినప్పటికీ ఆయనను మంత్రి పదవి నుంచి జగన్ పీకేశారు. దీంతో కొడాలి కోరలు పీకేసిన తాచుపాములా అయిపోయారు. ఇంతకు ముందులా ఆయన పబ్లిక్ లో పెద్దగా కనిపించడంలేదు. అడపా దడపా మీడియాలోకి వచ్చినా మునుపటి మాదిరి తీవ్రంగా స్పందించడంలేదనే చెప్పాలి. మరో పక్కన గుడివాడ నుంచి తనకు వైసీపీ వస్తుందో రాదో అనే అనుమానం కూడా కొడాలిలో కలుగుతోందంటున్నారు. ఒకవేళ తనకు టికెట్ వచ్చినా.. టీడీపీ నుంచి తనను ఢీకొట్టేందుకు బలమైన సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను చంద్రబాబు బరిలో దింపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక విధంగా దేవినేని ఉమ పేరునే టీడీపీ చీఫ్ కన్ ఫర్మ్ చేశారంటూ తాజాగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.జగన్ అస్తవ్యస్థ పాలన, అభివృద్ధి లేని ఏలుబడి, జనం సమస్యలు పట్టించుకోని వైనంతో ఈసారి వైసీపీకి గడ్డుకాలం తప్పకపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పేరు చెప్పి జనంలోకి వెళ్లినా తనకు ఉపయోగం ఉండకపోవచ్చనే అనుమానం ఏదో కొడాలి నానిలో ఉండి ఉండొచ్చని అంటున్నారు. అందుకే కాబోలు.. గడప గడపకు కార్యక్రమం సమీక్షకు కొడాలి నాని గైర్హాజరై ఉంటారనే అభిప్రాయం వస్తోంది. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న కొడాలి నాని సమీక్షకు హాజరు కాకపోవడానికి ఏదో బలమైన కారణమే ఉంటుందనే అభిప్రాయం వస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో అధినేత ఆదేశించినా ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తూ కొడాలి నాని మాట్లాడకపోవడంతో జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నరన్న వాదన కూడా వైసీపీ శ్రేణుల్లో వినవస్తోంది. ఏది ఏమైనా గతంలోలా నాని ఇక మీదట జగన్ పట్ల వీరవిధేయత ప్రదర్శించే అవకాశం అయితే లేదని స్పష్టంగా తేలిపోయిందని చెబుతున్నారు.ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయానికి వస్తే.. సాంకేతికపరంగా ఆయన వైసీపీ ఎమ్మెల్యే కాదు. అయినప్పటికీ వైసీపీతో అంట కాగుతున్నారు. ఆయన కూడా జగన్ నిర్వహించిన సమీక్షకు హాజరు కాకపోవడం చర్చనీయాంశం అవుతోంది. దశాబ్దాల నుంచి ఉన్న విజయవాడలోని హెల్త్ వర్శిటీ పేరు నుంచి ఎన్టీఆర్ తొలగించి, వైఎస్సార్ పేరు పెట్టడంతో వంశీలో అసహనం కలిగిందంటున్నారు. తాను ఏ పార్టీ గుర్తుపై గెలిచాడో ఆ పార్టీ (తెలుగుదేశం) వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు పేరును తొలగించే అంశాన్ని పునరాలోచించాలని జగన్ కు వంశీ లేఖ కూడా రాశారు. అయితే.. ఆ లేఖపై జగన్ స్పందించిన దాఖలాలు లేవు. దీంతో వంశీ చిన్నబుచ్చుకున్నారని చెబుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వంశీ పాల్గొనడం లేదు. మరో పక్కన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయానికి వల్లభనేని వంశీ వచ్చారంటున్నారు.తాను పోటీ చేయనప్పుడు ఇక నియోజకవర్గం సమీక్షకు హాజరైతే ఏంటి. . గైర్హాజరైతే ఏంటనే ధోరణి ఆయనకు కలిగిందని చెబుతున్నారు. కాగా.. గన్నవరం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరగకపోవడంపై వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలను జగన్ ప్రశ్నించారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో తమ పార్టీ ఎమ్యెల్యే కాకపోయినా గడప గడపకు కార్యక్రమాన్ని అంతగా పట్టించుకోని ఎమ్మెల్యేల పేర్లలో వల్లభనేని వంశీ పేరు కూడా జగన్ ప్రస్తావించడం గమనార్హం.జగన్ ఆదేశాలను పాటించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ జగన్ పేర్కొన్న జాబితాలో ఉన్న వారూ ఎలాగూ అధినేత తమపై ఒక అభిప్రాయానికి వచ్చేశారు కనుక వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు వచ్చే అవకాశాలు లేనట్టే అన్న నిర్థారణకు వచ్చేసి, ఇక ఆయన ఆదేశాలు పాటించేదేమిటన్న ధిక్కార స్వరాన్ని వినిపించే అవకాశం మెండుగా ఉందంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఈ క్రమంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పి మరో గూటికి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నారంటున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని తమ వారసులను బరిలో దింపుతామంటే జగన్ ససేమిరా అనడంతో వారు కూడా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని చెబుతున్నారు. దాంతో పాటు.. గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిరగకపోతే.. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలే బాధ్యత తీసుకోవాలని జగన్ అనడం కూడా ఎమ్మెల్యేలకు రుచించలేదని అంటున్నారు. జగన్ లాగ పని చేయాలంటే జగన్ లాగ తమకు కూడా బటన్ లు నొక్కే అవకాశం ఉండాలని పలువురు ఎమ్మెల్యేలు పార్టీ అధినేతపైనే జోకులు వేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వకుండా గడప గడపకు తిరగమంటే ఎలా..? ఇలాగైతే కష్టమే అంటూ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి జగన్ కు సమీప భవిష్యత్ లోనే సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగలడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తమౌతున్నది.