YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డివోషనల్‌ డెమొక్రసీయే బ్రహ్మోత్సవాల సందేశం

డివోషనల్‌ డెమొక్రసీయే  బ్రహ్మోత్సవాల సందేశం

తిరుమల, అక్టోబరు 1, 
ఏడాదికి 365 రోజులు మాత్రమే. కానీ.. ఏడుకొండలవాడికి అంతకన్నా ఎక్కువే ఉత్సవాలు జరుగుతుంటాయి. సంవత్సరం పొడవునా సప్తగిరుల పైన నిర్వహించే సంబరాలన్నింటిలోకీ బ్రహ్మోత్సవమే సర్వోన్నతమైంది. సకల సందేశాలతో కూడింది. బ్రహ్మోత్సవాల్లో సాక్షూత్తూ భగవంతుడే జనంలోకి రావటాన్ని ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యంగా అభివర్ణించొచ్చు. దీన్నిబట్టి తనను విశ్వసించినవారిని విస్మరించకూడదని ఆపద్భాంధవుడు ఆదేశిస్తున్నట్లు భావించొచ్చు. నాయకులకు ప్రజల శ్రేయస్సే పరమార్థం కావాలని ప్రసన్నమూర్తి కాంక్షిస్తున్నాడు. కష్టాలు విని పరిష్కార మార్గాలు చూపుతారేమోననే ఆశతో ఆశ్రయించేవారిని ఆత్మీయంగా చేరదీయాలని, తామున్నామనే భరోసా ఇవ్వాలని పురాణ పురుషుడు పునరుద్ఘాటిస్తున్నాడు. తిరుమల మాదిరిగానే ప్రతి ప్రజాప్రతినిధి నివాసం నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా మారాలని అనాథ రక్షకుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కలియుగ దైవం కోవెల నుంచి ఉత్సవమూర్తి రూపంలో భక్తకోటిలోకి వచ్చి వాళ్ల హృదయాల ఊయలలో, మారుమోగే గోవింద నామస్మరణాల నడుమ ఊరేగుతాడు. తనను కొలిచే గుండెల్లో, పిలిచే గొంతుల్లో అంతర్లీనంగా గొప్ప ఆధ్యాత్మిక భావనను నింపుతాడు.ఆరాధ్య దైవాన్ని కన్నులారా వీక్షించగలిగామనే అలౌకిక ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగిస్తాడు. తన కోసం వచ్చిన జనం కోసం తానే తరలివస్తాడు. దైవం.. మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో..’ అని ఓ సినీ కవి అన్నాడు. కష్టాల్లో, అవసరాల్లో ఆదుకున్న వ్యక్తులు అవతలివాళ్లకు దైవంతో సమానమే.కాబట్టి ప్రతిఒక్కరూ ఇతరులకు తమ పరిధిలో, తమకు చేతనైనంత సాయం చేయాలని జనార్దనమూర్తి సెలవిస్తున్నాడు. దేహమే దేవాలయమని, మనసే గర్భగుడి అని, సందర్భం వచ్చిన ప్రతిసారీ పరోపకారిలా ముందు వరుసలో నిలవాలని పరమ దయాకరుడు తన భక్త ప్రపంచానికి బోధిస్తున్నాడు. కులాలకు స్విస్తి పలకాలని రఘుకుల నందనుడు, ఇగోలకు ఇక్కడితో ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని ఇలవేల్పు సూచిస్తున్నాడు. అప్పుడే అందరి మది నిండా సంతోషం నిండుతుందని ఆనంద నిలయుడు భరోసా ఇస్తున్నాడు.ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసే సమూహంలోకి సర్వాలంకారుడై వచ్చి సమ్మోహితుల్ని చేస్తాడు. కోనేటిరాయుడు ప్రతిఒక్కరి కోరికలనూ నెరవేరుస్తాడు. శుభమస్తు అని దీవిస్తాడు. ఆపదలో ఉన్నవారి ఆలాపన, మొర ఆలకిస్తాడు. విన్నపాలు వింటాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అనంత లోకాన్నంతటినీ ఒక్కటిగా పాలిస్తాడు. దుష్టులను శిక్షిస్తాడు. శిష్టులను రక్షిస్తాడు. పాటలంటే శ్రీవారికి ప్రాణం. తనను గానామృతంలో ఓలలాడించేవారిని అమితంగా ప్రేమిస్తాడు.వేయి నామాలు కలిగిన వేంకటేషుడి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి. అవి ఈ సంవత్సరం ఇవాళ ప్రారంభమవుతున్నాయి. పరంధాముడి ఆజ్ఞతో ఆత్మలు తల్లి గర్భంలో నవ మాసాలు పెరిగి రూపం సంతరించుకుంటాయి. మనిషి పుట్టుకకు మూలమైన ఈ ముఖ్య దశలకు గుర్తుగానే తిరుమల క్షేత్రంలో ఈ కైంకర్యాలను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. తద్వారా ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపంగా భావించాలని మూడూ నామాల ముద్దు శ్రీనివాసుడు మానవులకు సూచిస్తున్నాడు.ఎన్నికల్లో గెలిచాక ముఖం చాటేయటం కాదని, తమ పరిధిలోని జనులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కలియుగ కరుణా సాగరుడు ఉపదేశిస్తున్నాడు. అన్నార్థుల ఆకలి తీర్చాలని ధర్మ సంస్థాపకుడు సందేశమిస్తున్నాడు. ప్రజాస్వామ్యమే దేవాలయం కావాలని, ప్రజలను భక్తులుగా కాకుండా దేవుళ్లుగా చూడాలని, అవినీతికి ఆవల దూరం ఉండాలని నేటి తరం నేతలకు నవనీతచోరుడు ఉపదేశిస్తున్నాడు. శేషాద్రి నిలయుడి విశేష వాహనాలు వివిధ సందేశాలను చాటుతున్నాయి.శేష వాహనం చైతన్యానికి, మంచి మనసుకు సూచికగా నిలుస్తోంది. సింహ వాహనం మనోస్థైర్యానికి, ముత్యాల పందిరి వాహనం ఆనంద తత్వానికి, కల్పవృక్ష వాహనం కోరికలకు, సర్వ భూపాల వాహనం కీర్తి ప్రతిష్టలకు, గరుడ వాహనం అమేయ శక్తికి, హనుమంత వాహనం బుద్ధి శక్తికి, గజ వాహనం దార్శనికతకు, సూర్యచంద్రుల వాహనం తేజస్సుకు, అశ్వ వాహనం కాల నియమాల విచక్షణకు గుర్తుగా నిలుస్తోంది. మొత్తమ్మీద డివోషనల్‌ డెమొక్రసీయే ఈ బ్రహ్మోత్సవాల సందేశమని ఏక స్వరూపుడు ఏకవాక్యంలో తేల్చేస్తున్నాడు.
శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయం లోపల నడిమి పడికావలి చెంత అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తద్వారా స్వామివారి అత్యంత ప్రియు సఖుడైన గరుడుడు బ్రహ్మ, ఇంద్ర, యమ, అగ్ని, కుబేర, వాయు తదితర దేవతలనే కాకుండా వశిష్ట, విశ్వామిత్రాది సప్తఋషులను, ఇతర గణాలను, దేవతలను ఆహ్వానిస్తారని ప్రతీతి. దీనినే దేవతావాహనం అంటారు.
వాహనసేవలు :
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అత్యంత వన్నె చేకూర్చేవి వివిధ వాహనసేవలు. అలంకార తేజోవిలాసుడైన శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేష, చిన్నశేష, హంస, సింహ, ముత్యపుపందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వ వాహనాలు క‌లిపి 13 వాహనాలపైనే కాకుండా మోహినీ అవతారం, స్వర్ణరథం, రథోత్సవాల్లో కూడా తిరుమాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు. ఒక్కొక్క వాహనం ద్వారా భక్తజన కోటికి అద్భుతమైన సందేశాన్ని అందిస్తారు.
శ్రీవారి కొలువు :
శ్రీవారి ఆలయం లోపల బ్రహ్మోత్సవాల వాహనసేవల సమయంలో కొలువు నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ అర్చకులు ఈ సమయంలో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు.
స్నపనం :
ఈ కార్యక్రమాన్నే ఉత్సవానంతర స్నపనంగా వ్యవహరిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం ఒక వాహనసేవ తిరిగి రాత్రి ఒక వాహనసేవతో క్షణం తీరిక లేకుండా ఉండే మలయప్పస్వామివారికి రెండు వాహనసేవల మధ్య సమయంలో నిర్వహించే ప్రత్యేక సుగంధద్రవ్య అభిషేకమే స్నపనం. తద్వారా స్వామివారికి ఉపశమనం కలిగించి తిరిగి రాత్రి వాహనానికి నూతనోత్తేజంతో, ఉత్సాహంతో వాహనాన్ని అధిరోహించేందుకు సంసిద్ధం చేస్తుంది.
చూర్ణాభిషేకం:
బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజు ఉదయం స్వామి, అమ్మవార్లకు సుగంధద్రవ్యంతో ఆచరించే స్నానమే చూర్ణాభిషేకం.
చక్రస్నానం:
బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామి పుష్క‌రిణిలో శ్రీవారి సుదర్శన చక్రానికి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహిస్తారు.
దేవతోద్వాసన :
చివ‌రిరోజు స్వామివారికి అర్చన నివేదించిన అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముక్కోటి దేవతలకు, ఋషిపుంగవులకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాపూర్వకంగా వీడ్కోలు ప‌లుకుతారు. అదే విధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించిన బ్రహ్మదేవునికి కూడా అర్చకస్వాములు సంబంధిత శ్లోకాల‌తో కృతజ్ఞతలను నివేదిస్తారు.
ధ్వజావరోహణం:
బ్రహ్మోత్సవాల్లో చివరి అంకం ధ్వజావరోహణం. ఆలయ ధ్వజస్తంభంపై తొలి రోజు రెపరెపలాడిన గరుడధ్వజ చిత్రపటాన్ని చివరిరోజు సాయంత్రం అవనతం చేయడంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగుస్తాయి.

Related Posts